కేసీఆర్‌.. మీరన్న ‘లండన్‌’ ఇదేనా? | PM Narendra Modi Fires On KCR | Sakshi
Sakshi News home page

Published Wed, Nov 28 2018 2:30 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

PM Narendra Modi Fires On KCR - Sakshi

మహబూబ్‌నగర్‌ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. చిత్రంలో లక్ష్మణ్, కిషన్‌రెడ్డి తదితరులు

యూపీఏ ప్రభుత్వ హయాంలో రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా రాష్ట్రంలో పాలన సాగింది. అప్పటి కేంద్ర ప్రభుత్వంలో కేసీఆర్‌ కేంద్ర మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్‌ పార్టీనే కేసీఆర్‌కు శిక్షణ ఇచ్చింది. యూపీఏ ఉప్పు తిన్న కేసీఆర్‌.. ఆ ప్రభుత్వ సౌకర్యాలను అనుభవించారు. ఆయన ఇప్పుడు కాంగ్రెస్‌కు వ్యతిరేకమంటే ఎవరు నమ్ముతారు. నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రంలోని దళితులు, రైతులు, నిరుపేదల సంక్షేమం కోసం ఏం చేశారో టీఆర్‌ఎస్‌ సర్కారు ప్రజలకు వివరించాలి. ప్రభుత్వం చేసిన ప్రతి పైసా ఖర్చుకు లెక్క అడగాల్సిన సమయం ఇదే.  -ప్రధాని మోదీ

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌/మహబూబ్‌నగర్‌ : ‘‘నిజామాబాద్‌ను లండన్‌గా మారుస్తానని ముఖ్య మంత్రి అన్నారు. స్మార్ట్‌ సిటీ చేస్తానన్నారు. కానీ ఇక్కడ విద్యుత్, తాగునీరు, రోడ్ల వంటి మౌలిక సదుపాయాల కోసం కూడా నిజామాబాద్‌ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యమంత్రి నిజామాబాద్‌ను లండన్‌గా ఎంత మేరకు మార్చారో చూద్దామని హెలికాప్టర్‌లో చక్కర్లు కొట్టి చూశా. దేశంలో ఆర్థిక పరిస్థితి బాగోలేని రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతాలు, పట్టణాల్లో కూడా పరిస్థితి ఇంతకన్నా మెరుగ్గా ఉంది. ముఖ్యమంత్రి గారు... లండన్‌ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఓ ఐదేళ్లు అక్కడ ఉండి రండి. నిజామాబాద్‌లో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణాలు చూస్తుంటే అక్కడ డ్రైనేజీ కడుతున్నారా లేక పట్టణాన్ని డ్యామేజీ చేసే పనులు చేస్తున్నారా?’’అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. ఇంటింటికీ గోదావరి నుంచి తాగునీరు ఇవ్వకపోతే ఓట్లు అడగనన్న కేసీఆర్‌ నీళ్లివ్వకుండానే ఓట్లడిగేందుకు వచ్చారని మండిపడ్డారు.

కనీసం తాగునీరు కూడా ఇవ్వలేని కేసీఆర్‌ సర్కారుకు వీడ్కోలు చెప్పాలని ప్రజలను కోరారు. ఎందరో యువకుల ప్రాణ త్యాగాలు, పోరాటాలతో ఏర్పడిన తెలంగాణ ప్రజల ఆకాంక్షలు అస్తవ్యస్తం కావడానికి వీల్లేదని, నవ భారత, నవ తెలంగాణ నిర్మాణం కోసం బీజేపీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రం, మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో మార్పు కోసం బీజేపీ పేరిట నిర్వహించిన బహిరంగ సభల్లో మోదీ ప్రసంగించారు. తెలుగులో తన ప్రసంగాలను ప్రారంభించి అందరినీ ఆకట్టుకున్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు దొందూ దొందేనని, ఇరు పార్టీల్లోనూ కుటుంబ పాలనే సాగుతోందని విమర్శించారు. రెండు పార్టీలు దొంగాట ఆడుతున్నాయని మండిపడ్డారు. 50 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో దేశం, 50 నెలల టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణలో అభివృద్ధి చెందలేదని విమర్శించారు. మోదీ ప్రసంగాలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగులోకి అనువదించారు. ఆయా సభల్లో ప్రధాని ప్రసంగాల్లోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... 

నిజామాబాద్‌ సభలో..
కేసీఆర్‌కు శిక్షణ ఇచ్చింది కాంగ్రెస్సే.. 
ఇందూరు ప్రజలందరికీ శుభాభివందనాలు. బాసర జ్ఞాన సరస్వతి ఆశీస్సులు.. గోదావరి, మంజీరా, హరిద్ర పుణ్యనదుల సంగమం ఎంతో పవిత్రమైంది. రజాకార్ల ఆగడాలను ధైర్యంగా ఎదిరించిన ఘన చరిత్ర కలిగిన ప్రాంతం. అందరికీ నమస్కారం. యూపీఏ ప్రభుత్వ హయాంలో రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా రాష్ట్రంలో పాలన సాగింది. అప్పటి కేంద్ర ప్రభుత్వంలో కె. చంద్రశేఖర్‌రావు కేంద్ర మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్‌ పార్టీయే కేసీఆర్‌కు శిక్షణ ఇచ్చింది. యూపీఏ ఉప్పు తిన్న కేసీఆర్‌.. ఆ ప్రభుత్వ సౌకర్యాలను అనుభవించారు. ఆయన ఇప్పుడు కాంగ్రెస్‌కు వ్యతిరేకమంటే ఎవరు నమ్ముతారు. నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రంలోని దళితులు, రైతులు, నిరుపేదల సంక్షేమం కోసం ఏం చేశారో టీఆర్‌ఎస్‌ సర్కారు ప్రజలకు వివరించాలి. ప్రభుత్వం చేసిన ప్రతి పైసా ఖర్చుకు లెక్క అడగాల్సిన సమయం ఇదే. 


మంగళవారం నిజామాబాద్‌లో జరిగిన బహిరంగ సభకు హాజరైన ప్రజలు
తొమ్మిది నెలల ముందే విముక్తి 
గత ఎన్నికల్లో ఎన్నో హామీలు, వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ సర్కారు హామీలను మధ్యలోనే వదిలేసింది. ప్రాజెక్టులను సగంలోనే వదిలేసింది. చివరకు ప్రజలిచ్చిన ఐదేళ్ల పాలన సమయా న్ని కూడా పూర్తి చేయలేదు. కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలు ప్రకటించడంతో రాష్ట్ర ప్రజలకు టీఆర్‌ఎస్‌ పాలన నుంచి 9 నెలల ముందే విముక్తి లభించింది. 

మంత్రతంత్రాలు తప్ప ప్రజలను పట్టించుకోరా? 
రాష్ట్ర ముఖ్యమంత్రి అభద్రతాభావంతో ఉన్నారు. మంత్ర తంత్రాలను నమ్ముతూ నిమ్మకాయలు, మిరపకాయలతో పూజలు చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని ఏమాత్రం పట్టించుకోవడంలేదు. నిరుపేదలకు సైతం ఉన్నత వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని తెలంగాణలో అమలు చేయకుండా కేసీఆర్‌ సర్కారు అడ్డుకుంది. కేన్సర్‌ వంటి రోగాలకు రూ. ఐదు లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలందించే ఈ పథకం ద్వారా దేశంలో ఇప్పటి వరకు 3 లక్షల మందికి లబ్ధి చేకూరింది. ఈ పథకాన్ని తెలంగాణలో అమలు చేయకపోవడంతో రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు. రాష్ట్రంలో పేదలకు వైద్యం అందించే ప్రభుత్వాసుపత్రులు అధ్వాన స్థితిలో ఉన్నాయి. నిజామాబాద్‌లోని వైద్య కళాశాలే ఇందుకు నిదర్శనం.
 
రెండు పార్టీల్లోనూ కుటుంబ పాలనే.. 
కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు పెద్దగా తేడా లేదు. ఇవి రెండూ కుటుంబపార్టీలే. ఇటీవల కుమారుడితో కలసి హైదరాబాద్‌కు వచ్చిన సోనియాగాంధీ కేసీఆర్‌ది కుటుంబపాలన అనడం హాస్యాస్పదంగా ఉంది. తప్పుడు ప్రచారం చేయడంలో ఆ పార్టీలు పోటీ పడుతున్నాయి. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను కాదని కాంగ్రెస్‌ పార్టీకి అవకాశం ఇస్తే ప్రజలు ఇంకా నష్టపోతారు. 

నవ తెలంగాణ నిర్మిస్తాం.. 
ఎన్నికల్లో ఒక్కసారి బీజేపీకి అవకాశమిస్తే నవ తెలంగాణ నిర్మిస్తాం. రాష్ట్రంలో అభివృద్ధి రెండు ఇంజన్ల రైలులా వేగంగా ఢిల్లీ వరకు దూసుకుపోతుంది. తెలంగాణకు నష్టం చేసిన కాంగ్రెస్, పాలనలో విఫలమైన టీఆర్‌ఎస్‌లకు అవకాశం కల్పించొద్దు. సబ్‌కా సాత్‌.. సబ్‌కా వికాస్‌ అనే నినాదంతో పనిచేస్తున్న బీజేపీకి తెలంగాణలో అవకాశం కల్పిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం. ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభంజనం కొనసాగుతుంది. తెలంగాణలోనూ ఇదే ప్రభంజనం కన్పిస్తోంది.
 
మహబూబ్‌నగర్‌ సభలో... 

తెలంగాణ ఏర్పడింది ఒక్క కుటుంబం కోసమేనా? 
పాలమూరు ప్రజలకు నమస్కారం. పవిత్ర కృష్ణా నది ప్రవహిస్తున్న ఈ ప్రాంతం అలంపూర్‌ జోగుళాంబ భక్తికి ప్రతిరూపం. మార్పు కోసం, ప్రగతి కోసం.. అమరవీరుల ఆకాంక్షలు నెరవేరాలంటే బీజేపీకి అవకాశం ఇవ్వండి. అందరికీ నా నమస్కారం. ఎంతో మంది యువతీ యువకులు, విద్యార్థుల ఆత్మబలిదానాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఒక్క కుటుంబం కోసమేనా? ఎన్నో ఆకాంక్షలు, స్వప్నాలతో ఏర్పడిన తెలంగాణలో అవేవీ గత నాలుగున్నరేళ్లలో నెరవేరిన దాఖలాలు లేవు.

పాలమూరు జిల్లా మీదుగా కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తున్నా ఇక్కడ భూములకు నీళ్లు లేకుండా పోయాయి. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కూడా ఈ ప్రాంతం అభివృద్ధిపై నిర్లక్ష్యం వహించింది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌లో జరిగే నకిలీ పోరాటం మాదిరిగా పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్‌ బాటలో నడిచిన టీఆర్‌ఎస్‌ కూడా మైనారిటీ రిజర్వేషన్ల పేరుతో స్వార్థ రాజకీయానికి పాల్పడింది. గతంలో కేంద్ర మంత్రిగా సోనియా వద్ద, రాష్ట్ర మంత్రిగా చంద్రబాబు వద్ద పని చేసిన కేసీఆర్‌ తెలంగాణను మాయమాటలతో మభ్యపెట్టారు. మళ్లీ ఇలాంటి పార్టీకి అధికారం కట్టబడితే తెలంగాణ అంధకారంలోకి వెళ్తుంది.

మంగళవారం మహబూబ్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభకు హాజరైన జనం
 
పటేల్‌ సాహసం చేసి ఉండకపోతే... 
దేశ తొలి హోంమంత్రి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ కనుక సాహసం చేసి నిజాంల నుంచి హైదరాబాద్‌ సంస్థానాన్ని దేశంలో విలీనం చేసి ఉండకపోతే హైదరాబాద్‌ వెళ్లాలంటే బహుశా పాకిస్తాన్‌ వీసా తీసుకోవాల్సి వచ్చేదేమో. అలాంటి మహావ్యక్తికి ప్రపంచంలోకెల్లా అతిపెద్ద విగ్రహాన్ని గుజరాత్‌లో నిర్మించాం. వీలైతే ఒక్కసారైనా సందర్శించండి. దేశ తొలి ప్రధానమంత్రిగా ఒకవేళ సర్దార్‌ వల్లభ్‌బాయ్‌ పటేల్‌ బాధ్యతలు చేపట్టి ఉంటే... రైతులకు గడ్డు పరిస్థితి వచ్చేది కాదు. దేశ 75వ స్వాతంత్య్ర వేడుకల నాటికి దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం. 

బీజేపీ ఎవరి కాళ్లపైనా పడదు... 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఎవరైనా అధికారం చేపట్టాలంటే తమ కాళ్లపై పడాలంటూ కొందరు (ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి) ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంతోపాటు విభజన తర్వాత కూడా తమకు సీఎంలు అందరూ గులాం చేస్తున్నారంటూ అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ ఆత్మాభిమానంగల బీజేపీ ఎవరి కాళ్లపైనా పడదు. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంటుంది. 

2 లక్షల డబుల్‌ బెడ్రూంలు ఏవీ... 
రాష్ట్రంలో ఈ ఐదేళ్ల కాలంలో అభివృద్ధి జరిగిందా? రెండు లక్షల డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణం ఏమైంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు దేశవ్యాప్తంగా 1.25 కోట్ల ఇళ్లు నిర్మించింది. వాటన్నింటినీ మహిళల పేరిటే రిజిస్ట్రేషన్‌ చేయించింది. ఆ కుటుంబాలన్నీ ఇటీవల దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నాయి. 2022 నాటికి దేశంలోని ప్రతి నిరుపేద కుటుంబానికీ సొంత ఇల్లు ఉండే లక్ష్యంగా పనిచేస్తున్నాం.

అభివృద్ధికి కట్టుబడ్డాం... 
రాష్ట్రంలో రోడ్డు, రైల్వే ప్రాజెక్టులు, స్మార్ట్‌ సిటీ, అమృత్, విద్యుత్, ఉజ్వల గ్యాస్‌ పథకాలతోపాటు ఇతర ప్రాజెక్టుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని నిధులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు ఇచ్చాం. రూ. 30 వేల కోట్ల నిధులతో రాష్ట్రంలో 40 ప్రాజెక్టుల పనులు నడుస్తున్నాయి. హైదరాబాద్‌లో మెట్రో ప్రాజెక్టును తీసుకొచ్చింది బీజేపీయే. సబ్‌కా సాత్‌.. సబ్‌కా వికాస్‌ నినాదంతో అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాం. ఉజ్వల పథకం కింద దేశంలో 6 కోట్ల కుటుంబాలకు గ్యాస్‌ కనెక్షన్లు మంజూరు చేశాం.

తెలంగాణలో 5 లక్షల కనెక్షన్లు ఈ పథకం కింద ఇచ్చాం. సౌభాగ్య పథకం కింద దేశంలో 4 లక్షల కుటుంబాలకు ఉచితంగా విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చాం. తెలంగాణలో 15 వేల మంది ఈ పథకం కింద లబ్ధి పొందారు. కాంగ్రెస్‌ హయాంలో వృద్ధాప్య పింఛన్లు, స్కాలర్‌షిప్‌లు పొందాలంటే దళారులకు కమీషన్‌ ఇవ్వాల్సి వచ్చేది. సుమారు 6 కోట్ల బోగస్‌ లబ్ధిదారుల పేరుతో రూ. 95 వేల కోట్ల నిరుపేదల సొమ్మును కాంగ్రెస్‌ లూటీ చేసింది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదలందరికీ జన్‌ధన్‌ పథకం కింద బ్యాంకు ఖాతాలు తెరిచి ఈ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం.

దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలతో దేశాభివృద్ధికి చెదలు పట్టింది. సబ్‌కా సాత్‌.. సబ్‌కా వికాస్‌ నినాదంతో దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాం. ఇందుకోసం పంచతంత్రం లాగా అందరికీ విద్య, యువతకు ఉపాధి, వృద్ధులకు అండ, రైతులకు సాగునీరు వంటి కార్యక్రమాలను చేపడుతున్నాం. కాగా, నిజామాబాద్‌ సభలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్‌ గంగారాం, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రేమేందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల్‌ జిల్లాల పరిధిలోని ఆయా నియోజకవర్గాల బీజేపీ అభ్యర్థులు పాల్గొన్నారు. అలాగే మహబూబ్‌నగర్‌ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 14 నియోజకవర్గాల బీజేపీ అభ్యర్థులతోపాటు పరిగి, వికారాబాద్‌ అభ్యర్థులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement