సాక్షి, హైదరాబాద్: పోలింగ్ దగ్గరపడే సరికి ఓట్ల వేటలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణలో చాలా నియోజకవర్గాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న ముస్లిం మైనారిటీ ఓట్లను సొంతం చేసుకునేందుకు ఇప్పుడు టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు పోటీ పడుతున్నాయి. గత డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ముస్లిం మైనారిటీ ఓట్లను దాదాపు గంపగుత్తగా సాధించిన టీఆర్‌ఎస్‌కు ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టిపోటీ ఎదురయ్యేలా కనిపిస్తోంది. శాసనసభ ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా వారి ఓట్లను దాదాపు ఏకపక్షంగా సాధించేందుకు టీఆర్‌ఎస్ చేస్తున్న యత్నాలను కాంగ్రెస్ అడ్డుకుంటోంది. ఇందుకు ‘ఎన్డీయే’ప్రభుత్వాన్ని బూచిగా చూపుతోంది. రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ముస్లిం ఓటర్లున్న నియోజకవర్గం హైదరాబాద్. ఇక్కడ మజ్లిస్‌కు తిరుగులేకపోవటంతో ఇతర పార్టీలు దానిపై ఆశ పెట్టుకోలేదు. ఇదికాక, సికింద్రాబాద్, కరీంనగర్, జహీరాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్, మెదక్‌లలో భారీ సంఖ్యలో ముస్లిం ఓటర్లున్నారు.
పోలింగ్ ఏకపక్షంగా జరగని సందర్భాల్లో ముస్లిం ఓట్లు కీలకంగా మారుతాయి. అందుకే వారి ఓట్ల కోసం పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తాయి. అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఏకపక్షంగా పార్లమెంటు పోలింగ్ ఉండదని నిపుణులు అంచనా వేస్తున్న తరుణంలో ఇçప్పుడు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ముస్లిం ఓట్ల వేటలో తలమునకలై ఉన్నాయి. టీఆర్‌ఎస్ పార్టీ మైనారిటీలకు అనుకూలంగా ఉందన్న భావన చాలాకాలంగా జనంలో ఉంది. దీంతో 2014 అసెంబ్లీ ఎన్నికలు, గత డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పోలిస్తే ఆ పార్టీ వారి ఓట్లను ఎక్కువగా సాధించింది. 2014తో పోలిస్తే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు ఏకపక్షంగా వారి ఓట్లు టీఆర్‌ఎస్‌కు పోలయ్యాయి.
పార్లమెంటు ఎన్నికల్లో కూడా అదే పద్ధతిలో పోలింగ్ ఉంటుందని టీఆర్‌ఎస్ నమ్మకంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుస్తానని ధీమాలో ఉండి కంగుతిన్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డుతోంది. పోలింగ్ దగ్గర పడుతుండటంతో వేగం పెంచింది. ఇందులో భాగంగా ముస్లింల ఓట్లకు గురిపెట్టింది. తెలంగాణ ఆవిర్భావానికి పూర్వం ఆ వర్గంలో కాంగ్రెస్‌కు గట్టి పట్టు ఉండేది. దాన్ని టీఆర్‌ఎస్ దెబ్బ కొట్టి తనకు అనుకూలంగా మలుచుకుంది. ఇప్పుడు టీఆర్‌ఎస్‌కు ఏకపక్షంగా వారి ఓట్లు పోల్ కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో కొత్త కోణం ఎత్తుకుంది.
మజ్లిస్ తోడుగా టీఆర్‌ఎస్ ముందుకు...
ముస్లింల ఓట్లను సొంతం చేసుకునేందుకు టీఆర్‌ఎస్‌కు మజ్లిస్ రూపంలో బలమైన సహకారం లభిస్తోంది. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ నేరుగా టీఆర్‌ఎస్‌కు మద్దతు పలుకుతున్నట్టు ప్రచారంలో చెబుతున్నారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ ఎంపీ స్థానం పరిధిలోనే ప్రచారం చేస్తున్నా, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆ పార్టీ నేతలు నేరుగా టీఆర్‌ఎస్ తరపున ప్రచారం చేస్తున్నారు. ముస్లింల సంక్షేమంకోసం కేసీఆర్ పాటుపడుతున్నందున వారు టీఆర్‌ఎస్‌కే ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఒవైసీ మద్దతుతో ఈ ఎన్నికల్లో కూడా ఏకపక్షంగా ముస్లిం ఓట్లు సాధించాలని టీఆర్‌ఎస్ భావిస్తోంది. మరోవైపు సొంతంగా కూడా టీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రచారాన్ని తిప్పి కొడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి తామెంత దూరంగా ఉంటున్నామో, బీజేపీకి కూడా అంతే దూరంగా ఉంటున్నామని ఆ పార్టీ నేతలు ప్రచారంలో పేర్కొంటున్నారు.
ఈ రెండు పార్టీల పాలనకు చరమగీతం పాడుతూ కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తుందని, ఇది సాధ్యం కావాలంటే తెలంగాణలో ఎక్కువ సంఖ్యలో ఎంపీ సీట్లు టీఆర్‌ఎస్ గెలవాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నట్టుగా ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్ ఎన్డీయేలో చేరబోదని, దానికి మద్దతు కూడా ఇవ్వదని వారు ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. దీనికి కూడా కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్‌కు దేశంలోని ఇతర పార్టీల నుంచి మద్దతు కరవైందని, ఆ పార్టీలన్నీ యూపీయేలో చేరబోతున్నందున, టీఆర్‌ఎస్ కచ్చితంగా ఎన్డీయే వైపు వెళ్తుందని పేర్కొంటున్నారు. వెరసి పోలింగ్ దగ్గర పడుతుండటంతో రెండు పార్టీలు ముస్లిం ఓట్ల వేటలో వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి.
ఎన్డీయేలో చేరుతుందంటూ ప్రచారం..
పార్లమెంటు ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్ పార్టీ ఎన్డీయేలో చేరుతుందని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేయటం ప్రారంభించారు. నరేంద్రమోదీ కనుసన్నల్లోనే టీఆర్‌ఎస్ నడుచుకుంటోందని, దేశవ్యాప్తంగా బీజేపీకి గతంతో పోలిస్తే ఈసారి సీట్ల సంఖ్య తగ్గే సూచనలు స్పష్టంగా ఉన్నందున, కొత్త భాగస్వామ్య పక్షాల కోసం ఆ పార్టీ వెతుకుతోందని, టీఆర్‌ఎస్‌ను తనవైపు తిప్పుకుందని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే అది నేరుగా ఎన్డీయేకు పడినట్టేనని చెప్పడం ద్వారా ముస్లింల మనసును మార్చేప్రయత్నం చేస్తోంది. దీనికి కొన్ని చోట్ల సానుకూల స్పందన వస్తుండటంతో కాంగ్రెస్ మరింత ఉత్సాహంగా ప్రచారంలో ముందుకు సాగుతోంది. సికింద్రాబాద్, మల్కాజిగిరి, నిజామాబాద్, కరీంనగర్‌లలో బీజేపీ కూడా ముమ్మర ప్రచారం చేస్తూ భారీగా ఓట్లను చీల్చేలా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment