సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల వ్యూహాలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. టీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు ఎంపీలు తమ పార్టీలో చేరుతున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం సృష్టించాయి. తాము పార్టీ మారుతున్నామనే ప్రచారం వట్టిదేనని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. వీరిద్దరూ పరిశ్రమల మంత్రి కేటీఆర్‌తో గురువారం వేర్వేరుగా భేటీ అయ్యారు.
కాంగ్రెస్ మైండ్‌గేమ్ ఆడుతోందని చెప్పారు. అలాంటి ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన పనిలేదని మంత్రి కేటీఆర్ ఎంపీలకు సూచించారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం ప్రకటించిన జాబితాలో చోటు దక్కని ఆశావహులు విజయారెడ్డి (ఖైరతాబాద్), శంకరమ్మ (హుజూర్‌నగర్) సైతం మంత్రి కేటీఆర్‌ను కలిశారు. టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి చొరవతో శంకరమ్మ, ఆమె కుమారుడు వచ్చి కేటీఆర్‌ను కలిశారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంచి అవకాశాలు ఉంటాయని కేటీఆర్ ఈ సందర్భంగా శంకరమ్మకు చెప్పారు. ఖైరతాబాద్ టికెట్ ఆశించిన విజయారెడ్డికి కూడా ఇదే హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపుకోసం పనిచేస్తామని వారు చెప్పారు. ఖైరతాబాద్ అభ్యర్థి దానం నాగేందర్ కూడా మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఎన్నికల ప్రచారంలో విజయారెడ్డిని, మన్నె గోవర్ధన్‌రెడ్డిని కలుపుకుని పోవాలని మంత్రి కేటీఆర్ దానంకు సూచించారు.
కోదాడలో శశిధర్‌రెడ్డి!
టీఆర్‌ఎస్ కోదాడ, ముషీరాబాద్ నియోజకవర్గాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కోదాడ నియోజకవర్గానికి చెందిన టీడీపీ అసంతృప్త నేత బొల్లం మల్లయ్యయాదవ్‌ను పార్టీలో చేర్చుకోవాలని టీఆర్‌ఎస్ భావిస్తున్న నేపథ్యంలో మల్లయ్యయాదవ్ వచ్చి మంత్రి కేటీఆర్‌ను కలిశారు. శుక్రవారం మల్లయ్యయాదవ్ టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు.
ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే విషయంలో మాత్రం ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. కోదాడ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి శశిధర్‌రెడ్డికి ఇక్కడ టిక్కెట్ ఇవ్వాలని అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. ముషీరాబాద్‌లో ముఠా గోపాల్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిసింది. వీరిద్దరి పేర్లు ప్రకటించిన తర్వాతే 12 మంది అభ్యర్థులకు ఒకేసారి బీఫారాలు ఇవ్వనున్నారు. శుక్రవారం హైదరాబాద్‌కు రావాలని వారికి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.
దేశపతి రాజీనామా
సీఎం కేసీఆర్ ప్రత్యేక అధికారి (ఓఎస్‌డీ) దేశపతి శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వీలుగా దేశపతి ఈ నిర్ణయం తీసుకున్నారు.
రేవంత్‌వి చిల్లర వేషాలు: సీతారాంనాయక్
రేవంత్‌రెడ్డి ఏంటో అందరికీ తెలుసు. చిల్లర వేషాలు వేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. టీఆర్‌ఎస్‌కోసం పనిచేసే వాళ్లను ఆత్మరక్షణలో పడేసే ఆటలు వద్దు. నేను టీఆర్‌ఎస్‌ను వీడుతున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదు. ఇలాంటి వార్తలు రాసే ముందు మీడియా ఒకసారి ఆలోచించాలి. నేను జయశంకర్‌సార్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేశాను. విద్యార్థులకు అండగా నిలిచాను. కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని మహబూబాబాద్ ఎంపీగా గెలిచాను. రేవంత్‌రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారు.
నాపై దుష్ప్రచారం: విశ్వేశ్వర్‌రెడ్డి
రేవంత్‌రెడ్డి కావాలని నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. నేను టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశాననే వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం. ఇదే విషయంపై మంత్రి కేటీఆర్‌తోనూ మాట్లాడాను. ఈ విషయంలో టీవీలలో, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా తప్పు.
Comments
Please login to add a commentAdd a comment