భోపాల్: మధ్యప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ స్పందించారు. కొందరు రాజకీయ నాయకులకు విశ్వసనీయత, భావజాలం కంటే అధికారమే ముఖ్యమని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కేంద్ర మాజీమంత్రి, గ్వాలియర్ రాజవంశస్తుడు జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. కేబినెట్ పదవి కోసం కాంగ్రెస్ మాజీ నేత సింధియా పార్టీ మారుతారని తాను ఊహించలేదని ట్విటర్ వేదికగా తెలిపారు. ట్విటర్‌లో ఆయన స్పందిస్తూ.. గాంధీ కుటుంబాన్ని, కాంగ్రెస్ పార్టీని కాదని ప్రధానీ నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని రాజ్యసభ, కేబినెట్ పదవి కోసం సింథియా పార్టీ మారతారని తాను అనుకోలేదని అన్నారు. బీజేపీని తాను వ్యతిరేకిస్తాను కానీ భావజాలం పట్ల వారి నిబద్దతను గౌరవిస్తానని తెలిపారు.
మోదీని తాను విమర్శిస్తాను, కానీ వచ్చిన ప్రతి అవకాశాన్ని దేశాన్ని సంఘటితం చేయడానికి తాను ఉపయోగించే తీరు అద్భుతమని తెలిపారు. తాను చివరి శ్వాస వరకు కాంగ్రెస్‌లోనే ఉంటానని.. తనను మొదట్లో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరమని అడిగినా తిరస్కరించానని అన్నారు. తనకు విశ్వసనీయత, సిద్ధాంతాలు ముఖ్యమని స్పష్టం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలవాలనుకుంటే తాను రాజ్‌ఘర్ స్థానం నుంచి సునాయసంగా గెలిచేవాడినని, పార్టీ ఆదేశాల మేరకు తాను పోటీ చేయకుండా కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి కృషి చేశానని పేర్కొన్నారు. తన దృష్టిలో అధికారం అంటే మానవత్వంతో సేవ చేయడమే అని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment