సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఘాటుగా స్పందించారు. రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే షహీన్‌బాగ్ వంటి వేలాది ఘటనలను నివారించవచ్చని, పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) విమర్శిస్తున్న ప్రత్యర్ధులను లక్ష్యంగా చేస్తూ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. షహీన్‌బాగ్‌లో జరిగిన ఘటనలను గుర్తుచేస్తూ అంతే ఆగ్రహంతో ఫిబ్రవరి 8న జరిగే ఎన్నికల్లో బటన్ నొక్కడం ద్వారా ప్రతిఘటించవచ్చని అమిత్ షా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై సోమవారం ట్విటర్ వేదికగా ప్రశాంత్ కిషోర్ స్పందించారు.
‘ఢిల్లీపై ప్రేమతో ఓటు వేయండి అంతేచాలు. ప్రస్తుతం ప్రభుత్వంపై ఎలాంటి అసహనంలేదు. సోదరభావం, స్నేహ భావానికి ఎలాంటి ప్రమాదంలేదు’ అని అమిత్ షాకు కౌంటర్ ఇచ్చారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకు ప్రశాంత్ కిషోర్ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల వ్యూహకర్తగా పేరున్న ఆయన.. ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు రాజకీయ సలహాదారుడిగా సేవలు అందిస్తున్నారు. దీనిలో భాగంగానే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలుపునకు తెరవెనుక ప్రణాళికలు రచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment