
చింతపల్లి (పాడేరు): టీడీపీ పాలనలో అవినీతి పెరిగిపోయిందని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి గిరిజనులు తగిన గుణపాఠం చెప్పాలని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి పిలుపునిచ్చారు. విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలం అంతర్లలో మంగళవారం బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. చరిత్రలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని, ఇసుక, మట్టి, భూకబ్జాలు రాష్ట్రంలో పెరిగిపోయాయని, అందినకాడికి దోచుకోవడమే లక్ష్యంగా తెలుగుదేశం నాయకులు పనిచేశారని ధ్వజమెత్తారు. ఐదేళ్ల పాటు తెలుగుదేశం నాయకులు కొన్ని వేల కోట్లు దోచుకున్నారని, ఎన్నికలు దగ్గర పడడంతో ఓటర్లను అధికారికంగా కొనుగోలు చేసేందుకు పసుపు కుంకుమ, నిరుద్యోగ భృతి వంటి పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చారని విమర్శించారు.
2014లో నరేంద్ర మోదీ కారణంగానే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అధికారం దక్కిందన్నారు. మన్యంలో విద్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నూతన విద్యాలయాలు మంజూరు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మన్యం అభివృద్ధికి కనీస చర్యలు చేపట్టడం లేదని, మన్యంలో అధికార పార్టీ నేతలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ఆమె ప్రశ్నించారు. బీజేపీతోనే దేశ, రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని గిరిజనులు అభివృద్ధి చేసే పార్టీకే ఓట్లు వేయాలని కోరారు. గిరిజన కార్యక్రమంలో పాడేరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ లోకుల గాంధీ, జిల్లా పార్టీ అధ్యక్షుడు పి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment