
హన్మకొండ లోకసభ నియోజకవర్గం పేరుతో రికార్డులే రికార్డులు.. ఇక్కడ కాంగ్రెస్ ఒకసారి, కాంగ్రెస్ (ఐ) నాలుగుసార్లు, టీడీపీ రెండుసార్లు, బీజేపీ ఒకసారి, టీఆర్‌ఎస్ రెండుసార్లు గెలిచాయి. దేశానికి ప్రధానిగా సేవలు అందించిన పి.వి నరసింహారావు ప్రాతినిధ్యం వహించిన ఆ నియోజకవర్గం 2009 తరువాత రద్దు అయ్యింది. నరసింహారావు రెండుసార్లు ఇక్కడ నుంచి గెలుపొందారు. ఆయన ప్రస్తుత ఏపీలోని నంద్యాల నుంచి రెండుసార్లు, రామ్‌టెక్, బరంపురం నుంచి కూడా గెలుపొందారు.
మూడు రాష్ట్రాలలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన తెలుగునేతగా రికార్డులకెక్కారు. ఆయన రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, ప్రధానమంత్రిగా పనిచేసి రాష్ట్రానికి వన్నె తెచ్చారు. కాగా ఇక్కడ మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించిన కమాలుద్దీన్ అహ్మద్ వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి ఒకసారి గెలుపొందారు. టీడీపీ పక్షాన చాడ సురేష్‌రెడ్డి రెండుసార్లు హన్మకొండ నుంచి గెలిచారు. ఇంకా ఇక్కడ రెండుసార్లు గెలిచిన బోయినపల్లి వినోద్‌కుమార్ (టీఆర్‌ఎస్).. కరీంనగర్ నుంచి మరోసారి గెలుపొందారు. సీనియర్ బీజేపీ నేత జంగారెడ్డి 1984లో ఒకసారి గెలవడమే కాక.. ఆ ఎన్నికల్లో పి.వి.నరసింహారావును ఓడించడం సంచలనం సృష్టించింది.