
పట్నా : బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహఘట్‌బంధన్ తరఫున తనను పీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. తన కుమారుడు తేజస్వీని సీఎంని చేస్తానని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపాడన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఎన్డీఏ ప్రభుత్వం కానీ.. మోదీ కానీ నితీశ్ కుమార్‌ను పెద్దగా పట్టించుకోలేదు. ఆయనకు సరైన విలువ ఇవ్వలేదు. బీజేపీ బలవంతం మీదనే ఆయన మమ్మల్ని వదిలి వెళ్లారు. కానీ మళ్లీ ఇప్పుడు మా దగ్గరకు వచ్చారు. అప్పుడాయన ‘2020 అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వీని సీఎంగా చూడాలనుకుంటున్నాను. అయితే అందుకు ఒక షరతు.. మహఘట్‌బంధన్ తరఫున నన్ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే.. 2020లో తేజస్వీని సీఎం చేస్తాన’’ని చెప్పాడన్నారు.
రబ్రీ దేవి మహఘట్‌బంధన్ గురించి మాట్లాడుతూ.. ‘మేం 400 స్థానాల్లో విజయం సాధిస్తాం. లాలూజీ ఇక్కడ లేరు కాబట్టి కేవలం 400 సీట్లు మాత్రమే గెలుస్తామని చెప్పగలుగుతున్నాను అన్నారు. అసలు లాలూజీ జైలులో ఎందుకున్నారని ఆమె ప్రశ్నించారు. మంజూ వర్మ కేసులో కానీ.. దాణా కుంభకోణం కేసులో కానీ లాలూజీ తప్పేం లేదని స్పష్టం చేశారు. లాలూజీ పేదల గొంతుకగా నిలిచారు. అందుకు ఆయనకు కృతజ్ఞత తెలపాల్సింది పోయి.. కుంభకోణాలు చేశారని జనాలు ఆయనను విమర్శించడం దారుణమన్నారు.