రాహుల్‌ వచ్చిండు..కేసీఆర్‌ రాలే..! | Rahul came..kcr did not come..! | Sakshi
Sakshi News home page

రాహుల్‌ వచ్చిండు..కేసీఆర్‌ రాలే..!

Published Wed, Mar 7 2018 8:54 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Rahul came..kcr did not come..! - Sakshi

సభలో కాంగ్రెస్‌ నాయకులు

నిర్మల్‌: తెలంగాణ ప్రజల కలను సోనియమ్మ నెరవేరిస్తే.. బంగారు రాష్ట్రం చేస్తామని కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ అన్నివర్గాల ప్రజలను దగా చేశాడని, రైతు ఆత్మహత్యల తెలంగాణగా మార్చాడని టీపీసీ చైర్మన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రజావ్యతిరేక పాలన సాగి స్తోందని, ఇక కుటుంబ పాలనను గద్దెదించాల్సిందేనని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ప్రజాచైతన్య బస్సుయాత్ర మంగళవారం మధ్యాహ్నం నిర్మల్‌ చేరుకుంది. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గం నుంచి సోన్‌లో ప్రవేశించిన వచ్చిన యాత్రకు జిల్లా నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.

అక్కడినుంచి భారీ వాహన ర్యాలీతో జిల్లాకేంద్రంలోని మినీ స్టేడియంలో గల సభాప్రాంగణానికి చేరుకున్నారు. ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, బస్సుయాత్ర కన్వీనర్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన సభా కార్యక్రమం కొనసాగింది. ఈసందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో హామీలతో గద్దెనెక్కిన సీఎం కేసీఆర్‌ ప్రజలకే చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో నాలుగువేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఢిల్లీ నుంచి తమ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ వచ్చారన్నారు. నిర్మల్‌ జిల్లాలో మహేశ్వర్‌రెడ్డితో కలిసి 15 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రైతుల కుటుంబాలను పరామర్శించి, రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని అందించారన్నారు. కానీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌ మాత్రం ఒక్క రైతు కుటుంబం వద్దకు రాలేదని, ఒక్కరినీ పరామర్శించిన పాపాన పోలేదని అన్నారు.

నాలుగేళ్లుగా రైతులను పట్టించుకోని సర్కారు ఇప్పుడు ఎన్నికల ముంగిట కరెంట్‌ ఇస్తున్నామని, ఎకరాకు రూ.4వేలు ఇస్తామని నమ్మబలుకుతోందన్నారు. రైతుల ఓట్లను గంపగుత్తగా కొనేందుకే ఇలాంటి ఎన్నికల స్టంట్‌లను కేసీఆర్‌ చేస్తున్నాడని దుయ్యబట్టారు.  కేసీఆర్‌ బీజేపీతో లోపాయికారి ఒప్పందం పెట్టుకునే ఫ్రంట్‌ నాటకాలు ఆడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ వస్తే అన్ని పంటకు అధిక మద్దతు ధరలను ఇస్తామని చెప్పారు. మహిళలకు డ్డీలేని రుణాలను పెంచుతామని, అభయహస్తం పింఛన్‌ పునరుద్దరిస్తామని, నిరుద్యోగ భృతి రూ.3వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్‌లో రెండు లక్షల ఎకరాలకు ప్రాణహిత–చేవెళ్ల పథకం ద్వారా నీరందిస్తామని, సిర్పూర్‌ పేపర్‌ మిల్లును తెరిపిస్తామని హామీ ఇచ్చారు

మహేశ్వర్‌రెడ్డి గెలుపు ఖాయం : రేవంత్‌
నిర్మల్‌లో డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి గెలుపు ఖాయమని రేవంత్‌రెడ్డి జోస్యం చెప్పారు. ప్రజల సంక్షేమం పట్టని మంత్రి తన స్వప్రయోజనం కోసం ఇప్పటికే ఎన్నో పార్టీలు మారిండన్నారు. 2014లో దళితులు, వెనుకబడిన వర్గాలను ఆదుకుంటానంటూ బీఎస్పీలో చేరాడన్నారు. ఏనుగు బొమ్మపై గెలిచి పీనుగు పార్టీలోకి మారాడన్నారు. దొరలకు అమ్ముడు పోయిన ఘనత ఇంద్రకరణ్‌రెడ్డి అదన్నారు. కల్లు అమ్ముకునే ఇంద్రకరణ్‌రెడ్డిని సీఎం ఇళ్ల మంత్రిని చేశాడన్నారు. జిల్లాలో తన స్వగ్రామం ఎల్లపెల్లిలో తప్ప ఈ మంత్రి ఎక్కడైనా ఇల్లు కట్టించిండా.. అని సభికులను ప్రశ్నించారు. దీనికి ముక్తకంఠంతో లేదు.. అని సమాధానం వచ్చింది.

దేవాదాయ మంత్రిగానూ ఇంద్రకరణ్‌రెడ్డి విఫలమయ్యాడని విమర్శించారు. వేములవాడలో లేగదూడలు కబేళాలకు తరలుతుంటే.. భద్రాద్రిలో సీతమ్మ తాళిబొట్టు పోతే.. బాసరలో రోజుకో అపచారం జరుగుతుంటే.. కనీసం పట్టించుకోలేదన్నారు. భద్రాద్రి రాములవారి కల్యాణంలో సీఎం మనుమడు పట్టువస్త్రాలు సమర్పిస్తుంటే మంత్రి బంట్రోతుగా ఆ పిల్లాడి వెంట నడువడం జిల్లా ప్రజలకే అవమానమన్నారు. త్యాగాల పునాదులపై నిర్మాణమైన తెలంగాణను సోనియమ్మ ఇచ్చిందని, దాన్ని కేసీఆర్‌ దోపిడీ తెలంగాణ మార్చాడన్నారు. థర్డ్‌ ఫ్రంట్‌ బీజేపీతో చేసుకున్న ఒప్పందంలో భాగమని అన్నారు. ఏ టెంట్‌ లేనోళ్లే ఈ ఫ్రంట్‌ పాట పాడుతున్నారని ఎద్దేవా చేశారు. 2017 డిసెంబర్‌ లోపల డబుల్‌ బెడ్రూం ఇళ్లు కట్టించకపోతే, ఇంటింటికీ భగీరథ నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగమని చెప్పిన కేసీఆర్‌ ఇవ్వాళ ఏ మొఖం పెట్టుకుని ప్రజల ముందుకు వస్తారన్నారు. 

మైనార్టీలకు మోసం : షబ్బీర్‌అలీ
12శాతం రిజర్వేషన్ల పేరిట మైనార్టీలు, ఎస్టీలను కేసీఆర్‌ మోసం చేశాడని కాంగ్రెస్‌ శాసనమండలి పక్షనేత షబ్బీర్‌అలీ మండిపడ్డారు. ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ కలిసి మైనార్టీల ను మోసం చేస్తున్నాయన్నారు. హైదరాబాద్‌లోని తన మహల్‌పై కూర్చుండే అసదుద్దీన్‌కు కింద గుడిసెల్లో ఉంటూ బండ్లపై పండ్లు అమ్ముకుం టున్న మైనార్టీలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి : జానా
దేశాన్ని అభివృద్ధి బాట పట్టించింది కాంగ్రెస్సేనజానారెడ్డి అన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో లక్షల ఎకరాలకు సాగునీరందించేలా ప్రాజెక్టులను నిర్మించామన్నారు. రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని వివరించారు.

నామీద గెలిచే దమ్ముందా : ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
కాంగ్రెస్‌ పార్టీకి ముందునుంచీ అండగా నిలిచింది ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా, నిర్మల్‌ ప్రాంతాలేనని డీసీసీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. తనకు కష్టకాలంలో ప్రజలు అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌.. కానీ కల్లబొల్లి మాటలతో కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాడన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేశాడన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చివరి ఒక్క ఏడాదిలో చేసిన అభివృద్ధి అంత కూడా నాలుగేళ్లలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చేయలేదని విమర్శించారు. తన ఊళ్లో తన జీతగాళ్ల కోసమే డబుల్‌ బెడ్రూం ఇళ్లు కట్టించుకున్నాడని, నాలుగేళ్లలో గృహనిర్మాణశాఖ మంత్రిగా ఉండి జిల్లాలో ఎక్కడా ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు.

తన తమ్ముడికి వెయ్యికోట్లతో చనఖా,కోర్ట ప్రాజెక్టు పనులు ఇప్పించాడని, కొడుకు భూమి ఉందని జిల్లాకేంద్రంలోని ధర్మసాగర్‌ చెరువును నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బాసరలో అవినీతి అక్రమాలు జరుగుతుంటే దేవాదాయ శాఖామంత్రి ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. జిల్లాకేంద్రంలో 40ఎకరాల స్థలం ఉన్నా.. తన 300ఎకరాల ప్లాట్ల కోసం ఎల్లపెల్లిలోని చెరువులో కలెక్టరేట్‌ కట్టిస్తున్నాడని మండిపడ్డారు. ఈ నాలుగేళ్లలో నిర్మల్‌ నియోజకవర్గానికి మంత్రి ఏం చేశాడని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో నిర్మల్‌ నియోజకవర్గంలో దమ్ముంటే తనపై గెలవాలని సవాల్‌ విసిరారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కాకుంటే.. కేసీఆర్, కేటీఆర్‌ ఎవరైనా సరే నిర్మల్‌లో వచ్చి తనపై పోటీ చేసి గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చాలెంజ్‌ చేశారు. నిర్మల్‌ ప్రజలను నమ్ముకునే తాను ముందుకు సాగుతున్నానన్నారు. 

నక్సల్స్‌ ఎజెండా అన్నడు : వీహెచ్‌
తనది నక్సల్‌ ఎజెండా అని, పేదోళ్లను ఆదుకుంటానని వచ్చిన కేసీఆర్‌ ఇప్పుడు వాళ్లనే పిట్టలను కాల్చినట్లు కాల్చేస్తున్నాడని సీనియర్‌ నేత హనుమంతరావు అన్నా రు. తమను అంతం చేయాలని చూసినోళ్లను వదిలిపెట్టరని, కేసీఆర్‌ నక్సల్స్‌ నీ పనిచేస్తరు.. జర హుషారుగ ఉండు అన్నారు. 106 సీట్లు తామే గెలుస్తామని సర్వేలు చెప్పాయన్న సీఎం ఇప్పుడు కాంగ్రెస్‌ యాత్రను చూసి ఫ్రంట్‌ పాట పాడుతున్నాడని ఎద్దేవా చేశారు. 

ఆకట్టుకున్న నాయకులు..
‘2014లో ఒకవేళ మహేశ్వర్‌రెడ్డినే గెలిపించి ఉంటే.. తానే అందరికీ ఇళ్లు కట్టించి ఇచ్చేవారని..’ మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ అన్నారు. క్రికెట్‌లో ఒక్కసారి అవుటైతే మళ్లీ తర్వాతి మ్యాచ్‌ ఉంటుందని, ఇక్కడ ఒక్కసారి ఓడితే మాత్రం ఐదేళ్ల వరకు వేచి చూడాల్సి వస్తుందన్నారు. ప్రజలు ఈసారి కాంగ్రెస్‌ను గెలిపించి, తెలంగాణను అభివృద్ధి చేయడానికి సహకరించాలన్నారు. ‘పోతావ్‌రో కేసీఆర్‌.. రైతుల ఉసురు తగిలి.. ఎవరి పాలైందిరో తెలంగాణ.. దొరల, దొంగల పాలైందిరో తెలంగాణ..’ అంటూ పాటలతో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆకట్టుకున్నారు. ఆదివాసులకు పట్టాలిచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. ఎస్టీ రిజర్వేషన్లను సాధించుకుందామని లంబాడీ భాషలో మాట్లాడి మాజీ ఎంపీ బలరాం నాయక్‌ పిలుపునిచ్చారు.

కుటుంబ పాలనకు చరమగీతం పాడుదామని ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి అన్నారు. తెలంగాణను అభివృద్ధి చేయడం కాంగ్రెస్‌తోనే సాధ్యమని సీనియర్‌ నేత మల్లు రవి పేర్కొన్నారు. ఈ సభలో పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రులు సబితారెడ్డి, డి.శ్రీధర్‌బాబు, మల్లు రవి, దానం నాగేందర్, ఎమ్మెల్సీ ఆకుల లలిత, నాయకులు రాంచంద్రారావు, రామారావు పటేల్, గండ్రత్‌ సుజాత, భార్గవ్‌ దేశ్‌పాండే, నరేశ్‌జాదవ్, హరినాయక్, జాదవ్‌ అనిల్, సత్యం చంద్రకాంత్, తక్కల రమణారెడ్డి, వినాయక్‌రెడ్డి, జుట్టు దినేశ్, సంతోష్, చిన్ను, జమాల్, చరణ్, జునైద్, హైదర్, సరికెల గంగన్న, లింగారెడ్డి, ఫక్రుద్దీన్‌ పాల్గొన్నారు.  


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement