
సాక్షి,లక్నో: బీజేపీ మహిళా నేతలంటే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి భయమని ఆ పార్టీ నేత షానవాజ్ హుసేన్ అన్నారు. మహిళలకు బీజేపీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, వారంటే పార్టీకి ఎంతో గౌరవముందని చెప్పారు. యూపీలో బీజేపీకి పెద్దసంఖ్యలో మహిళా ఎమ్మెల్యేలున్నారన్నారు.బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు మహిళల పట్ల వివక్ష ప్రదర్శిస్తాయన్న రాహుల్ వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను అర్ధం చేసుకునేందుకు రాహుల్‌కు కొంత సమయం పడుతుందని, దీనిపై ఆయన పరిశోధన చేయాలని షానవాజ్ హితవు పలికారు.
మహిళలపై రాహుల్ వ్యాఖ్యలు దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. బీజేపీ మహిళా నేతలంటే రాహుల్‌కు భయమని, స్మృతీ ఇరానీ పేరు ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారి యువనేతకు చెమటలు పడతాయన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో అమేథి నుంచి రాహుల్‌ను ఆమె ఢీకొన్న విషయం విదితమే.2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించి మోదీ తిరిగి ప్రధాని పగ్గాలు చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.