
అమేధిలో ఈనెల 10న రాహుల్ నామినేషన్
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ యూపీలోని అమేధి లోక్‌సభ నియోజకవర్గంలో ఈనెల 10న నామినేషన్ దాఖలు చేయనున్నారు. కేరళలోని వయనాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కూడా పోటీలో ఉన్న రాహుల్ గురువారం ఆ నియోజకవర్గంలో నామినేషన్ పత్రాలు సమర్పించిన సంగతి తెలిసిందే. అమేధిలో బీజేపీ నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో ఆయన తలపడనున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ రాహుల్‌పై పోటీ చేసిన స్మృతి ఇరానీ లక్ష పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
కాగా, 2004 నుంచి రాహుల్ గాంధీ అమేధి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు యూపీలోని రాయ్‌బరేలి నుంచి పోటీ చేస్తున్న యూపీఏ చీఫ్ సోనియా గాంధీ ఈనెల 11న నామినేషన్ దాఖలు చేయనున్నారు. సోనియాపై మాజీ కాంగ్రెస్ నేత దినేష్ ప్రతాప్ సింగ్‌ను బీజేపీ బరిలో దింపింది. మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ, రాయ్‌బరేలికి చెందిన సింగ్ గత ఏడాది బీజేపీలో చేరారు. మరోవైపు రాహుల్ వయనాడ్ నుంచి పోటీ చేయడం అమేధికి అవమానకరమని బీజేపీ నేత స్మృతి ఇరానీ ఆరోపించారు.