
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై వ్యాఖ్యల అంశంపై జైట్లీ ప్రకటనను ఆయన తప్పుబట్టారు. జైట్లీ.. జైట్-లై(అబద్ధాలకోరు) అని అభివర్ణిస్తూ ట్విట్టర్‌లో రాహుల్ ట్వీట్లు చేశారు.
జైట్లీ గారూ మీకు ధన్యవాదాలు. మన ప్రధానిగారు చెప్పిన పనులు అస్సలు చేయరని మీరు ఒప్పుకున్నందుకు సంతోషం, బీజేపీ అబద్ధాలకోరుల పార్టీ అని బుధవారం సాయంత్రం ట్వీట్ చేశారు. అంతేకాదు ప్రచార సమయంలో మోదీ ప్రసంగాన్ని.. జైట్లీ రాజ్యసభలో మాట్లాడిన మాటల వీడియోలను పక్కపక్కనే ఉంచి మరో సందేశాన్ని ఉంచారు. ప్రధాని లాంటి స్థాయి ఉన్న వ్యక్తిని కించపరిస్తే తమ పార్టీ ఉపేక్షించలేదన్న విషయాన్ని(మణిశంకర్ అయ్యర్ వేటు) గుర్తు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. మన్మోహన్, హమీద్ అన్సారీ(మాజీ ఉపరాష్ట్రపతి) లపై వ్యాఖ్యలు చేసిన ప్రధాని నుంచి కనీసం క్షమాపణ కూడా చెప్పించకపోవటం దారుణమని బీజేపీపై మండిపడుతోంది.
కాగా, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దేశభక్తిని, అంకిత భావాన్ని తాము ప్రశ్నించలేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగాల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను, మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీలను ఎక్కడా ప్రశ్నించలేదు. అదేవిధంగా వారికి దేశంపట్ల ఉన్న నిబద్ధతపై అనుమానాలు లేవు. మన్మోహన్, అన్సారీలకున్న దేశభక్తి పట్ల మాకు నమ్మకం, విశ్వాసం ఉన్నాయని’ అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.
Dear Mr Jaitlie - thank you for reminding India that our PM never means what he says or says what he means. #BJPLies pic.twitter.com/I7n1f07GaX
— Office of RG (@OfficeOfRG) December 27, 2017