
అమేథీ: ఉత్తరప్రదేశ్‌లో జరిగే తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత ప్రియాంక గాంధీపై ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పూర్తి బలగంతో బరిలోకి దిగుతామని చెప్పారు. తన నియోజకవర్గం అమేథీలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ గురువారం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ‘ప్రియాంక గాంధీ, జ్యోతిరాదిత్య సింధియాకు ఓ లక్ష్యం నిర్దేశించాం.
అదేంటంటే, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడమే. ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ అని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల మాదిరిగా నేను ‘బీజేపీ ముక్త్ భారత్’ అని నినాదం ఇవ్వను. బీజేపీ పట్ల గౌరవంతో మాట్లాడతా. గుజరాత్, యూపీ, తమిళనాడు..ఇలా రాష్ట్రమేదైనా కాంగ్రెస్ పూర్తి బలంతో, దూకుడుగానే పోరాడుతుంది. యూపీలో అసెంబ్లీ ఎన్నికలు(2022లో జరగనున్నాయి) పూర్తయిన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తారు’ అని రాహుల్ అన్నారు. అమేథీ నియోజకవర్గానికి తన తల్లి సోనియా, సోదరి ప్రియాంక సైనికుల వంటి వారని అభివర్ణించారు.
మోదీ విద్వేషానికి ప్రతీక: రఫేల్ ఒప్పందం, బడా పారిశ్రామికవేత్తల రుణాల ఎగవేత వ్యవహారంలో ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు కొనసాగించారు. వాచ్‌మెన్ అని చెప్పుకునే వ్యక్తి దొంగ అని నిరూపితమైందని ప్రధాని మోదీపై పరోక్షంగా మండిపడ్డారు. మోదీ విద్వేషానికి ప్రతీక అని, 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్ని నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు.
ప్రియాంక ప్రభావం ఉండదు: బీజేపీ
ప్రియాంక గాంధీ రాజకీయ ఆగమనంతో రాబోయే లోక్‌సభ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం ఉండదని బీజేపీ పేర్కొంది. ఆమెను తూర్పుయూపీ ప్రధాన కార్యదర్శిగా నియమించిన తరువాత ఢిల్లీలో నెలకొన్న సందడి, ఆ ప్రాంతంలో కనిపించలేదని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment