
జీవీఎల్ నరసింహారావు
సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ భారతదేశాన్ని ఉద్దేశించి పంజాబ్ కాంగ్రెస్ మంత్రి, మాజీ భారత క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. సిద్ధూ చేసిన వ్యాఖ్యలు దక్షిణ భారతీయులను అవమానపరిచేలా ఉన్నాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆదివారం ట్వీట్ చేశారు. ఒక క్రికెటర్‌గా దేశం మొత్తం సిద్ధూను అభిమానిస్తుందని, కానీ పాకిస్తాన్‌కు మద్దతుదారుడిగా కాదని అన్నారు. భారతదేశ భిన్నత్వంలోని ఏకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ గౌరవించదా? అని జీవీఎల్ ప్రశ్నించారు. ‘ఒక వేళ నేను దక్షిణ భారత్‌లోని ప్రాంతాలకు వెళితే ఎక్కువ కాలం ఉండలేను. నాకు అక్కడి భాష అర్థం కాదు. వారి వంటలు తినలేను. ఇడ్లీ మాత్రమే తినగలుగుతా. వారి అలవాట్లు, సంస్కృతి వేరు. కానీ నేను పాకిస్తాన్ వెళ్తే అక్కడి ప్రజలు పంజాబీ, ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు. అందుకే నాకు దక్షిణ భారత్ వెళ్లడం కంటే పాకిస్తాన్ వెళ్లడమే ఎక్కువ ఇష్టం’ అంటూ ఇటీవల ఒక సాహిత్య కార్యక్రమంలో సిద్ధూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.