
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రేపో, ఎల్లుండో చేపట్టేందుకు సిద్ధమైన ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన దూకుడును ప్రదర్శిస్తున్నారు. సోమవారం పార్టీ పార్టీ ప్రధాన కార్యాలయంలో సాధారణ కార్యదర్శలతో సమావేశం ఏర్పాటు చేసిన ఆయన కీలక అంశాలను ప్రస్తావనకు తెచ్చి చర్చించినట్లు తెలుస్తోంది.
పార్టీ వర్గాలు అందించిన సమాచారం మేరకు.. నవంబర్ 8న నిర్వహించబోయే బ్లా డే నిరసన ప్రదర్శనలపైనే ఆయన ప్రధానంగా చర్చించారంట. అయితే అవి సాధారణ రీతిలో కాకుండా కాస్త వైవిధ్యంగా ఉండేలా పలు సూచనలు కూడా రాహుల్ చేసినట్లు చెబుతున్నారు. ఇందుకోసం ఏకే ఆంటోనీ, మోతిలాల్ వోరా జీ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను చాటి చెప్పేలా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని రాహుల్ చెప్పినట్లు ఓ కార్యదర్శి తెలిపారు.
ఇక సమావేశం అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడారు. నవంబర్8న(నోట్ల రద్దు ప్రకటించిన రోజు) ఓ విషాదం అని రాహుల్ అన్నారు. జాతి ప్రయోజనాలు, ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకోకుండానే ప్రధాని పెద్దనోట్ల రద్దు నిర్ణయం ప్రకటించారని రాహుల్ విమర్శించారు. కాగా, ఈ సమావేశంలోనే నవంబర్ 19వ తేదీన నిర్వహించబోయే ఇందిరా గాంధీ శత జయంతి ఉత్సవాల నిర్వహణ, అదే తేదీన రాహుల్ కు పగ్గాలు అప్పజెప్పే విషయంపై చర్చ జరిగినట్లు జాతీయ మీడియాలు కథనం వెలువడుతున్నాయి.