
మాట్లాడుతున్న వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, చిత్రంలో ఎమ్మెల్యే ఐజయ్య తదితరులు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : సీఎం చంద్రబాబు నిర్వాకంతో ఆంధ్రప్రదేశ్ ఉనికిని కోల్పోతోందని, కేంద్ర బడ్జెట్‌లో తీవ్ర అన్యాయానికి గురైందని వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. ఓటుకు నోటు కేసుతో పాటు అవినీతి వ్యవహారాలపై కేసులు పెడతారనే భయంతో సీఎం ఏమీ మాట్లాడలేరని తెలిసే కేంద్రం ఏపీకి బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ, దుగ్గిరాజపురం ఫోర్టు, అమరావతి నిర్మాణం తదితర ముఖ్య ప్రాజెక్టులకు నిధులు ఇవ్వలేదన్నారు. మంగళవారం వారు కర్నూలులోని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఈ నెల 8న వామపక్షాలు చేపట్టిన రాష్ట్ర బంద్‌కు వైఎస్‌ఆర్‌సీపీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. జిల్లాలోని అన్ని మండలాలు, నియోజకవర్గాలు, జిల్లా కేంద్రంలో జరిగే బంద్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశించారన్నారు.
బడ్జెట్‌కు ముందు సీఎం చంద్రబాబు ప్రధానమంత్రిని కలసి పలు సమస్యలపై విన్నవించినట్లు ప్రకటన చేశారని, అయితే.. ఆయన కోరినవి ఏ ఒక్కటీ ఇవ్వలేదని గుర్తు చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రానికి నిధుల వరద పారిందని, అడిగినవన్నీ హక్కుగా సాధించారని తెలిపారు. చంద్రబాబు మాత్రం తన అవినీతి బండారం బయట పడకుండా కేంద్రం ముందు మోకరిల్లారని విమర్శించారు. దేశంలో తనంత సీనియర్ లేరని పదేపదే చెప్పే చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో కేంద్రం నుంచి ఏమి సాధించారని ప్రశ్నించారు. 28 సార్లు ఢిల్లీ వెళ్లిన ఆయన రాష్ట్రానికి ఉన్న లోటు బడ్జెట్‌ను ఎంత తగ్గించారని నిలదీశారు.తన అవినీతి బయట పెట్టకుండా ఢిల్లీ పెద్దలను బుజ్జగించడం, ఎమ్మెల్యే సీట్ల సంఖ్య పెంచాలని కోరడం తప్పా చేసిందేమీలేదన్నారు.
రాష్ట్రానికి చంద్ర గ్రహణం పట్టిందని, దాన్ని తొలగించేందుకే వామపక్షాల బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని వివరించారు. కేంద్ర బడ్టెట్‌లో కర్నూలు జిల్లా పేరే ఉచ్చరించలేదని, మంత్రాలయం–కర్నూలు రైల్వేలైన్, రిహాబిలిటేషన్ వర్క్‌షాపునకు నిధులు వస్తాయని ఆశించినా ఫలితం లేకపోవడం నిరాశ కలిగిస్తోందన్నారు. మరోవైపు హైకోర్టును కర్నూలులోనే ఏర్పాటు చేయాలని కోరారు. సీఎం సొంత ప్రయోజనాల కోసం మరోసారి అభివృద్ధిని కేంద్రీకరిస్తున్నారని విమర్శించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ సోమువీర్రాజు సీఎం చంద్రబాబుపై చేసిన అవినీతి ఆరోపణలు నిజమేననిపిస్తోందన్నారు. సీఎం నియోజకవర్గంలోనే రూ.10 కోట్ల అవినీతి జరిగిందని సోమువీర్రాజు ఆరోపించారని, నాలుగేళ్ల పాలనలో పెదబాబు, చినబాబు కలసి రెండు లక్షల కోట్ల రూపాయల అవినీతి చేశారన్న మిత్రపక్షంలోని బీజేపీ ఆరోపణలను అంత తేలికగా తీసుకోకూడదన్నారు.
ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని నమ్మొద్దు
ఏపీకి జరిగిన అన్యాయంపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడంలేదని టీడీపీ, ఎల్లో మీడియా చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజమూ లేదని బీవై రామయ్య, ఐజయ్య అన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలుమార్లు కేంద్రం, ప్రధానమంత్రి, మంత్రుల దృష్టికి తీసుకెళ్లారని, ఆందోళనలు కూడా చేపట్టారని గుర్తు చేశారు. గుంటూరులో జగన్ దీక్ష చేపట్టగా అరెస్టుచేసి భగ్నం చేసింది, విశాఖలో ప్రజలే స్వచ్ఛందంగా ఇచ్చిన పిలుపులో పాల్గొనేందుకు వెళుతుండగా విమానాశ్రయంలో అరెస్టు చేసింది టీడీపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. అలాగే తమ పార్టీ రెండుసార్లు రాష్ట్ర బంద్ చేపట్టిందన్నారు. పార్టీ ఎంపీలు పార్లమెంటులో పలుమార్లు ప్రైవేట్ బిల్లులతో ఏపీకి ప్రత్యేక హోదాను కోరారని గుర్తు చేశారు.
విశాఖకు రైల్వేజోన్ కోసం తమ పార్టీనాయకుడు గుడివాడ అమర్‌నాథ్ నిరాహారదీక్ష, పాదయాత్ర చేసిన విషయాన్ని ఎవరూ మరువరాదన్నారు. ఇలా ఏపీకి జరిగిన ప్రతి అన్యాయంపై కేంద్రాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నామన్నారు.కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, రాష్ట్ర ఎస్‌సీ సెల్ ప్రధానకార్యదర్శి సీహెచ్ మద్దయ్య, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రెహమాన్, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ధనుంజయాచారి, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సత్యంయాదవ్, నాయకులు శ్రీధర్‌రెడ్డి, భాస్కరరెడ్డి, ఆదిమోహన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, ఆర్.అనిల్‌కుమార్, ఉదయ్‌కుమార్, ఓసీఎం రంగ, నరసింహారెడ్డి, సుబ్బారావు, లతీఫ్ పాల్గొన్నారు. అనంతరం పార్టీ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యంయాదవ్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment