కావాలనే జగన్‌పై కాంగ్రెస్‌ కేసులు | Ramdas Athawale commented over congress | Sakshi
Sakshi News home page

కావాలనే జగన్‌పై కాంగ్రెస్‌ కేసులు

Published Fri, Apr 27 2018 3:04 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Ramdas Athawale commented over congress - Sakshi

సాక్షి, అమరావతి/నెహ్రూనగర్‌(గుంటూరు): కాంగ్రెస్‌ పార్టీ కావాలనే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కేసులు నమోదు చేయించిందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్‌దాస్‌ అథవాలే అన్నారు. జగన్‌పై ఉన్నవి కేవలం ఆరోపణలు మాత్రమేనని గుర్తుచేశారు. గురువారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రజాదరణ కలిగిన నాయకుడని కొనియాడారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా చరిష్మా ఉన్న నాయకుడని అన్నారు. 

రాజ్యాంగ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించడానికి వీల్లేదని రామ్‌దాస్‌ అథవాలే చెప్పారు. బీసీలకు ఇప్పటికే 27 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని అన్నారు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం కపట నాటకమని పేర్కొన్నారు. తమ శాఖ జనవరి 15న ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సూచించినట్లు తెలిపారు.

ప్రతి విషయంలోనూ చంద్రబాబు తప్పించుకునే వ్యవహారం చేస్తున్నాడన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటే దేశంలోని మరికొన్ని రాష్ట్రాలకు కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్యాకేజీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటికే కొన్ని నిధులు ఇచ్చామని, ఇంకా ఇస్తామని పేర్కొన్నారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ ఎన్‌డీఏలోకి వస్తామంటే ఆహ్వానిస్తామన్నారు.

సుప్రీంకోర్టు తీర్పుపై అవసరమైతే ఆర్డినెన్స్‌
కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథవాలే గురువారం విజయవాడలో సాంఘిక, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు సంబంధించి ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, అత్యాచారాల నిరోధక చట్టం కింద నమోదవుతున్న కేసుల వివరాలను ఆరా తీశారు. ఇటీవల సుప్రీకోర్టు ఇచ్చిన తీర్పుపై అవసరమైతే ఆర్డినెన్స్‌ తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

దళితులు పారిశ్రామిక రంగంలో రాణించాలి
దళితులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి సాధించేందుకు పారిశ్రామిక రంగం సరైనదని రామ్‌దాస్‌ అథవాలే చెప్పారు. గురువారం గుంటూరులో దళిత్‌ ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ(డిక్కీ) కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులు అన్ని రంగాల్లో ముందుండి దేశానికి వెన్నెముకగా నిలవాలని సూచించారు.

ఐక్యమత్యంగా ఉంటూ రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. పారిశ్రామిక రంగంలో రాణించాలంటే విద్య అవసరమని, విద్యా రంగంలో ముందంజలో అన్ని రంగాల్లో రాణించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, డిక్కీ వ్యవస్థాపక అ«ధ్యక్షుడు మిలింద్‌ కాంబ్లో, సౌత్‌ ఇండియా అధ్యక్షుడు నర్రా రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement