సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/హైదరాబాద్: నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ కేటాయింపు వ్యవహారంలో తలెత్తిన అసమ్మతికి టీఆర్‌ఎస్ చెక్ పెట్టింది. పార్టీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. ఈ మేరకు టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సోమవారం ప్రకటన విడుదల చేశారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని హైదరాబాద్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాములు నాయక్ ఖండించారు. ఓ దశలో కంటతడి పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను గత నెల మొదటి వారంలో విడుదల చేసిన టీఆర్‌ఎస్... నారాయణఖేడ్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పేరును మరోమారు ఖరారు చేసింది. అయితే భూపాల్‌రెడ్డికి టికెట్ కేటాయించడాన్ని రాములు నాయక్ వ్యతిరేకించారు. పార్టీ ప్రకటించిన అభ్యర్థిని మార్చాలంటూ తన వర్గానికి చెందిన కొందరు నేతలతో కలసి ప్రత్యేక సమావేశాలు, ప్రెస్‌మీట్లు నిర్వహించారు. అలాగే నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాములు నాయక్‌కు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తూ వచ్చారు. దాదాపు పక్షం రోజులుగా రాములు నాయక్‌తో పార్టీ అధిష్టానం మంతనాలు జరుపుతోందని, త్వరలో ఖేడ్‌లో తలెత్తిన అసమ్మతి సమసిపోతుందని పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. కానీ రాములు నాయక్‌ను పార్టీ సస్పెండ్ చేయడంతో అయన అనుచరుల రాజకీయ ప్రస్థానం ఆసక్తికరంగా మారింది.
కుంతియాతో భేటీయే కారణం?
గతంలో ఆదిలాబాద్ జిల్లా బోథ్ అసెంబ్లీ స్థానం నుంచి రాములు నాయక్ టీఆర్‌ఎస్ టికెట్ ఆశించారు. 2014 సాధారణ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాములు నాయక్‌ను ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన నారాయణఖేడ్ లేదా బోథ్ స్థానాల నుంచి టికెట్ ఆశించినట్లు సమచారం. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో రాములు నాయక్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియాతో భేటీ అయినట్లు వార్తలు వచ్చాయి. ఖమ్మం జిల్లా ఇల్లెందు నుంచి తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని రాములు నాయక్ కోరినట్లు ప్రచారం జరగ్గా దీన్ని ఆయన ఖండించారు. తన మిత్రుడిని కలవడానికే హోటల్‌కు వెళ్లినట్లు ఆదివారం రాత్రి ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం రాములు నాయక్‌ను టీఆర్‌ఎస్ సస్పెండ్ చేయడం చర్చనీయాంశమైంది. మరోవైపు కొంతకాలంగా రాములు నాయక్ వర్గం పేరిట అసమ్మతి రాగం వినిపిస్తున్న కంగ్టి ఎంపీపీ రామారావు రాథోడ్ టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాములు నాయక్ వెంట నడుస్తూ వస్తున్న కంగ్టి జెడ్పీటీసీ సభ్యుడు రవి కుమార్, మల్‌శెట్టి యాదవ్ తదితరులు ఏ నిర్ణయం తీసుకుంటారనే అంశంపై చర్చ జరుగుతోంది. రాములు నాయక్ అనుచరుల్లో కొందరిని మంత్రి హరీశ్‌రావు ఇటీవల బుజ్జగించినట్లు సమాచారం. రాములు నాయక్ సస్పెన్షన్ వ్యవహారం నియోజకవర్గంలో కాస్త రాజకీయ వలసలకు దారితీస్తుందనే ప్రచారం జరుగుతోంది.
టీఆర్‌ఎస్ ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ: రాములు నాయక్
టీఆర్‌ఎస్‌లో ప్రజాస్వామ్యం, ఆత్మగౌరవం లేదని.. ఆ పార్టీ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా మారిందని ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆరోపించారు. టీఆర్‌ఎస్ తనపై సస్పెన్షన్ వేటు వేసిన అనంతరం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. షోకాజ్ నోటీసులు ఇవ్వకుండానే తనను సస్పెండ్ చేయడంపట్ల ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ నిర్మాణంలో ప్రతి రాయిపైనా తన పేరు ఉందన్నారు. తెలంగాణ ద్రోహి పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరుతో తనను సస్పెండ్ చేయించడం చూసి బాధపడుతున్నానన్నారు. ‘టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ నన్ను సస్పెండ్ చేస్తే గర్వపడేవాడిని. 2004, 2009, 2014, 2018లో టికెట్ అడిగా. అధిష్టానం ఇవ్వకపోపోయినా పార్టీ మారలేదు. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ఎంపికయ్యా. గిరిజనుల రిజర్వేషన్లు అడిగినందుకే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. టీఆర్‌ఎస్‌కు సేవ చేసినందుకు, గిరిజన రిజర్వేషన్లు ఇవ్వాలని అడిగినందుకు నన్ను సస్పెండ్ చేసారా? గిరిజన మేధావులతో త్వరలో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా. నా జాతి నిర్ణయానికి కట్టుబడి ఉంటా. నేను ఎన్నికల్లో పోటీ చేయను. నాలాగా బాధపడుతున్న వాళ్లు టీఆర్‌ఎస్‌లో చాలా మంది ఉన్నారు. వాళ్లంతా ఏదో ఒకరోజు బయటకు వస్తారు’అని రాములు నాయక్ చెప్పారు. కేసీఆర్ చెప్పిన గిరిజన పారిశ్రామిక అభివృద్ధి సంస్థ అతీగతీ లేదని, గిరిజనులను టాటా బిర్లా చేస్తామని ఈ నాలుగేళ్లలో బికారీలను చేశారని మండిపడ్డారు. ఒక్కరోజూ తెలంగాణ గురించి మాట్లాడని వాళ్లు కేబినెట్‌లో ఉన్నారని, ఉద్యమ సమయంలో విద్యార్థులు తరిమికొట్టిన వారిని మంత్రి కేటీఆర్ తన కారులో తిప్పుకుంటూ వాళ్ల ఇళ్లకు వెళ్లి భోజనాలు చేస్తున్నారని విమర్శించారు. స్నేహితులను కలిసేందుకే గోల్కొండ హోటల్‌కు వెళ్లానని, కుంతియాను కలవలేదని, అక్కడ రేవంత్, మధు యాష్కీ తనకు యాదృఛికంగా తారసపడ్డారనని రాములు నాయక్ చెప్పారు.
రాములు నాయక్ సస్పెన్షన్
Published Tue, Oct 16 2018 2:27 AM | Last Updated on Tue, Oct 16 2018 8:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment