
సాక్షి, హైదరాబాద్: మంత్రి ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్రానికి జ్యోతి రావు పూలే వంటి వారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అట్టడుగు స్థాయి నుంచి వచ్చి.. ఇపుడు ప్రభుత్వంలో సుపరిపాలనను అందిస్తున్న ఈటెలపై కాంగ్రెస్ నేతలు పిచ్చెక్కి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈటెల నిప్పులాంటి మనిషి.. ఆయనతో చెలగాటం కాంగ్రెస్ నేతలకు మంచిది కాదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ చచ్చిన పీనుగని.. ఇక పైకిలేచే ప్రసక్తే లేదన్నారు. హుజురాబాద్‌లో ముగిసింది కాంగ్రెస్ బస్సు యాత్ర కాదని.. ఆ పార్టీకి జరిగిన అంతిమ యాత్రని విమర్శించారు. తిట్ల కోసమే అయితే బస్సు యాత్రలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ చేసిన అడ్డగోలు విమర్శలను ఖండిస్తున్నామని తెలిపారు.
మరో వైపు రేవంత్ రెడ్డిపై కూడా రసమయి నిప్పులు చెరిగారు. కుక్కకు బొక్క లాగే.. రేవంత్‌కు మైకు అలాగే అని ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. మైకు దొరికితే చాలు రేవంత్ బండ బూతులు మాట్లాడుతున్నారని తెలిపారు. రేవంత్ కాంగ్రెస్‌లో జోకర్‌గా మారారని ఎద్దేవా చేశారు. ఉద్యమంలో దొంగగా ఉన్న రేవంత్‌కు ఉస్మానియాలో తగిన గుణపాఠం జరిగిందని గుర్తు చేశారు. ఇతరులపై బురద చల్లి.. కడుక్కోమన్నట్టుగా రేవంత్ ధోరణి ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment