సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్ : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల షెడ్యూల్ ఇంకా వెలువడక ముందే అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌లో వలసలు తీవ్రమయ్యాయి. ముందుగానే అభ్యర్థులను ప్రకటించి టీఆర్‌ఎస్... టీడీపీ, సీపీఐ, జన సమితితో పొత్తుల కారణంగా కాంగ్రెస్ తీవ్ర అసమ్మతిని ఎదుర్కొంటున్నాయి. దీంతో టికెట్ల ప్రాతిపదికగా నేతలు పార్టీలు మారే వ్యూహాల్లో తలమునకలయ్యారు.
ఇరు పార్టీల్లోనూ అసమ్మతి...
టీఆర్‌ఎస్‌లో తాము కోరిన వారికే టికెట్లు ఇవ్వాలని పలువురు మంత్రులే పట్టుబడుతుండగా మరోవైపు టికెట్ కోసం కొందరు ఆశావహులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో టికెట్ రాదని భావిస్తున్న నేతలంతా పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సైతం ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటోంది. పొత్తుల్లో భాగంగా హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్, ఉప్పల్ నియోజకవర్గాలను టీడీపీకి కేటాయిస్తారన్న సమాచారంతో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే డి. సుధీర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి సోదరుడు బండారి లక్ష్మారెడ్డి ఉప్పల్ నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నారు. ఆ సీటును టీడీపీ గట్టిగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో లక్ష్మారెడ్డి సైతం టీఆర్‌ఎస్‌లో చేరేందుకు పావులు కదుపుతున్నారు.
అయితే ఈ రెండు నియోజకవర్గాలకు టీఆర్‌ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. ఇక మల్కాజ్‌గిరి టికెట్ ఆశించిన టీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరడం దాదాపుగా ఖాయమైంది. మల్కాజ్‌గిరి నుంచి పార్టీ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు విజయశాంతికి టికెట్ ఖాయమైనట్లు తెలిసింది. అదే నిజమైతే పార్టీ వీడటానికి వెనుకాడబోనని గ్రేటర్ హైదరాబాద్ మాజీ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు తన సన్నిహితులతో చెప్పారు. ఈ కారణంగానే మల్కాజ్‌గిరి టికెట్‌ను అధికారికంగా ప్రకటించకుండా పార్టీ నాయకత్వం తాత్సరం చేస్తోందని సమాచారం. ఎల్బీ నగర్, ఉప్పల్ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ నేతలు టీఆర్‌ఎస్‌లో చేరడానికి గ్రీన్‌సిగ్నల్ ఇస్తే ఆ నియోజవర్గాల్లో టీఆర్‌ఎస్ నేతలు పార్టీ మారే అవకాశాన్ని నాయకత్వం అంచనా వేస్తోంది. ముందుగా అక్కడి నేతలతో సంప్రదింపులు జరిపి ఒప్పించాకే నిర్ణయానికి రావాలని భావిస్తోంది. ఇటీవలటీఆర్‌ఎస్‌లో చేరతానని ప్రకటించిన మాజీ స్పీకర్ కె.ఆర్. సురేశ్‌రెడ్డి బుధవారం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరతారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
కరీంనగర్, నిజామాబాద్‌ల నుంచి ఎక్కువ వలసలు...
ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన చాలా మంది టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు వలసలకు సిద్ధమవుతున్నారు. టీఆర్‌ఎస్ నాయకత్వంతో మింగుడుపడని సీనియర్ నేత డి. శ్రీనివాస్, ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, నందీశ్వర్‌గౌడ్, ఆకుల రాజేందర్ బుధవారం హైదరాబాద్ పర్యటనకు వచ్చే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి వస్తారని తెలుస్తోంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ వర్గాలు ధ్రువీకరించాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సుద్దాల దేవయ్య పార్టీ మారుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. త్వరలో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరుతారని, చొప్పదండి నియోజకవర్గం టికెట్ ఆయనకు ఇచ్చే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ వర్గాలు చెప్పాయి.
కాంగ్రెస్‌లోకి కొండా దంపతులు!
వరంగల్ తూర్పు టికెట్ పెండింగ్‌లో పెట్టడం ద్వారా తనను అవమానించారంటూ టీఆర్‌ఎస్ నాయకత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ మురళీ దంపతులు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌తో చర్చలు జరిపినట్లు తెలియవచ్చింది. వరంగల్ తూర్పు, పరకాల సీట్లు వారికి ఖాయమయ్యాయని, ఆ నియోజకవర్గాల నుంచి సురేఖ, ఆమె కుమార్తె సుస్మితా పటేల్ పోటీకి కాంగ్రెస్ ఆమోదం తెలిపినట్లేనని విశ్వసనీయ సమాచారం. భూపాలపల్లి సీటును కూడా కొండా దంపతులు కోరినా ఇవ్వడం కుదరదని ఉత్తమ్ తేల్చిచెప్పినట్లు తెలిసింది.
సొంత గూటికి జలగం, బాలూ నాయక్...
ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి జలగం ప్రసాదరావు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. పార్టీలో చేరాలంటూ ఇటీవల జలగం ఇంటికి వెళ్లి ఉత్తమ్ కోరడంతో ఆయన చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఆయనకు ఖమ్మం లేదా కొత్తగూడెం స్థానాల నుంచి పోటీ చేసేందుకు అవకాశం లభించొచ్చని భావిస్తున్నారు. కొత్తగూడెం నుంచి పోటీకి అంగీకరిస్తే అక్కడ అన్నదమ్ముల సవాల్‌గా పోటీ రసవత్తరం కానుంది. తాజా మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు కొత్తగూడెం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జిల్లా పరిషత్ చైర్మన్ బాలూనాయక్ కాంగ్రెస్‌లో చేరాలని భావిస్తున్నారు. తనకు దేవరకొండ టికెట్ కేటాయిస్తే పార్టీలో చేరతానని ఆయన ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్యులకు వర్తమానం పంపారు. ప్రస్తుతం మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే విజయసింహారెడ్డిని పార్టీలో చేరాల్సిందిగా టీపీసీసీ ముఖ్యులు కోరినట్లు తెలిసింది. అయితే ఆయన్ను హుజూర్‌నగర్ నుంచి పార్టీ అభ్యర్థిగా నిలిపే అంశాన్ని టీఆర్‌ఎస్ నాయకత్వం పరిశీలిస్తోంది.
టీపీసీసీ చీఫ్‌ను కలిసిన దానం?
కాంగ్రెస్‌కు ఇటీవలే రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి దానం నాగేందర్ ఆదివారం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ను కలిశారని, ఖైరతాబాద్ టికెట్ ఇస్తే కాంగ్రెస్‌లో చేరతానని చెప్పారంటూ సోషల్ మీడియాలో విస్తృ ప్రచారం జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత సమక్షంలో ఉత్తమ్‌తో దానం సమావేశమైనట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం ధ్రువీకరించినట్లు టీఆర్‌ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ వార్తలను దానం తీవ్రంగా ఖండించారు. తనపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని, తనకు టికెట్ రాకున్నా టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని దానం సోమవారం మీడియాకు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment