
సాక్షి, న్యూఢిల్లీ : తొలిసారిగా క్రీయాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టిన ప్రియాంకగాంధీకి ఆమె భర్త రాబర్ట్ వాద్రా బెస్ట్ విషెస్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ (తూర్పు) పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా బాధ్యతల అనంతరం తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి ఆమె సోమవారం లక్నోలో పబ్లిక్ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రియాంక నాలుగు రోజుల పాటు యూపీలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా రాబర్డ్ వాద్రా ...భార‍్య పొలిటికల్ ఎంట్రీతో పాటు ప్రియాంకను పరిపూర్ణ మహిళ అంటూ ప్రశంసలతో ముంచెత్తారు.
ఈ మేరకు తన ఫేస్‌బుక్‌లో... కొత్త ప్రయాణం మొదలుపెట్టిన ‘పి’ నీకు నా బెస్ట్ విషెస్ అని పోస్ట్ చేశారు. ప్రియాంక నాకు మంచి స్నేహితురాలే కాదు.. పర్ఫెక్ట్ వైఫ్. మా పిల్లలకు బెస్ట్ మదర్ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దుర్మార్గపు, విద్వేషపూరిత రాజకీయాలు నడుస్తున్నాయని, ఈ పరిస్థితుల్లోనూ ప్రజలకు సేవ చేయడాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఆమెను దేశ ప్రజల చేతుల్లో పెడుతున్నాను. మీరే జాగ్రత్తగా చూసుకోండి అంటూ భావోద్వేగ పూరితంగా ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ 1997లో రాబర్డ్ వాద్రాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఇక యూపీఏ హయాంలో ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రారంభించి రాజస్థాన్, హరియాణా, ఢిల్లీలో అక్రమంగా భూములు కొనుగోలు చేశారనే ఆరోపణలున్నాయి. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారం కోల్పోయాక వాద్రా భూ కుంభకోణాలపై విచారణ కొనసాగుతోంది. అలాగే మనీ లాండరింగ్ కేసులో ఆయన ఈడీ ఎదుట విచారణకు హాజరు అవుతున్నారు.
కాగా ఆహార్యంలోనే కాకుండా మాటతీరు, నడవడికలోనూ నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీని పోలి ఉండే ప్రియాంకనే ఆమెకు నిజమైన వారసురాలని కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తున్నారు. ప్రియాంకకు ఇందిరా గాంధీ పోలికలు ఉండటం పార్టీకి కలిసొస్తుందని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ కష్టకాలంలో ఉండగా జరిగిన 1999 లోక్‌సభ ఎన్నికల్లో సోనియాగాంధీ అమేథీ నుంచి పోటీచేసినప్పుడు ప్రియాంక ఎన్నికల ప్రచారంలో తొలిసారి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment