
సాక్షి, చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా నియమితులు కావడంతో జిల్లాకు మరో కీలక పదవి లభించింది. ఇదివరకే జిల్లా మంత్రులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కళత్తూరు నారాయణస్వామికి పదవులు దక్కాయి. తుడా చైర్మన్‌గా, ప్రభుత్వ విప్‌గా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నియమితులయ్యారు.
తాజాగా ప్రతిష్టాత్మకమైన ఏపీఐఐసీ చైర్‌పర్సన్ పదవి ఎమ్మెల్యే రోజాను వరించింది. ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా ఆమె నియమితులు కావడంతో జిల్లాలో పారిశ్రామిక రంగం పరుగులెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాలో పారిశ్రామికంగా సత్యవేడు శ్రీసిటీ ఉన్న నేపథ్యంలో ఏపీఐఐసీ తరఫున పారిశ్రామిక క్లస్టర్లు మరిన్ని ఏర్పాటయ్యే అవకాశం ఉంది. జిల్లాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సంతోషం వెలిబుచ్చుతున్నారు.