పారిశ్రామిక సదస్సును ప్రారంభిస్తున్న ఆర్‌కే రోజా, గౌతమ్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్
నెల్లూరు(అర్బన్): రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో నూతన పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరుగులు పెట్టించనున్నారని ఏపీఐఐసీ చైర్‌పర్సన్ ఆర్కే రోజా చెప్పారు. రాష్ట్రంలో 320 పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. బుధవారం నెల్లూరులో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై జరిగిన సమావేశంలో పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి రోజా మాట్లాడారు. ఎక్కువ మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 31 ఇండ్రస్టియల్ పార్కులను అభివృద్ధి చేశామని, మిగతా వాటిని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. పరిశ్రమలకు అనుమతులు పొందడానికి ఎవరికీ ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన పని లేదని స్పష్టం చేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని వెల్లడించారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో పారిశ్రామికవేత్తలకు ఇస్తామన్న రూ 2,500 కోట్లను రాయితీలను ఎగ్గొట్టారని, అందువల్లే కొంతమంది పరిశ్రమలు స్థాపించకుండా వెనక్కి వెళ్లిపోయారని రోజా తెలిపారు. పరిపాలనలో పారదర్శకతకు సీఎం వైఎస్ జగన్ పెద్ద పీట వేస్తున్నారని ఐటీ, పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి చెప్పారు. నూతన ఇండ్రస్టియల్ పాలసీతో ప్రతి జిల్లాను అంతర్జాతీయ ప్రమాణాలతో పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గత ఐదేళ్లలో పారిశ్రామిక ప్రగతిపై మంత్రి గౌతంరెడ్డి, రోజా శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, వరప్రసాద్, కిలివేటి సంజీవయ్య , కమిషనర్ సిద్ధార్థ జైన్, ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌భార్గవ, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
పడవ అడ్డు పెడితే ఇళ్లు మునిగిపోతాయా?
రాష్ట్రంలో వరద రాజకీయాలు చేస్తూ టీడీపీ తమ ఉనికిని చాటుకుంటోందని ఆర్కే రోజా ధ్వజమెత్తారు. ఆమె బుధవారం నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసి, రిజర్వాయర్లు నిండి రైతన్నలు సంబరపడుతున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment