అహ్మదాబాద్ : కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీపై రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ పరువునష్టం దావా దాఖలు చేసింది. తమ గ్రూప్‌పై తప్పుడు ఆరోపణలు చేసినందుకు గాను అనిల్ అంబానీ తరఫు ప్రతినిధులు సింఘ్వీకి వ్యతిరేకంగా రూ.5000 కోట్లకు పరువునష్టం దావా వేశారు. గుజరాత్ హైకోర్టులో తమ దావాను దాఖలు చేశారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో సింఘ్వీ, అనిల్ అంబానీ కంపెనీకి సంబంధించి తప్పుడు ఆరోపణలు చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు కంపెనీ పరువుకు భంగం వాటిల్లే విధంగా ఉన్నాయని అందుకే రూ.5000 కోట్ల పరువు నష్టం దావా వేసినట్లు పేర్కొన్నాయి.
గత నెలలో సింఘ్వీ ఓ సమావేశంలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీని విమర్శిస్తూ పలు ఆరోపణలు చేశారు. ఇటీవల ప్రభుత్వం రూ.1.88 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసినట్టు పేర్కొన్నారు. 50 మంది కోటీశ్వరులు దాదాపు రూ.8.35 లక్షల కోట్ల రుణాలను బ్యాంకులకు చెల్లించాల్సి ఉందన్నారు. గుజరాత్‌కు చెందిన రిలయన్స్(అనిల్ అంబానీ గ్రూప్), అదానీ, ఎస్సార్ సంస్థలు బ్యాంకులకు రూ.3 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ రుణాలన్నింటిన్నీ జైట్లీ ఎన్‌పీఏగా చూపిస్తున్నారని సింఘ్వీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల అనిల్ అంబానీ గ్రూప్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment