చివరికి సబ్బం..! | Sabba hari Get Bheemili TDP Ticket Visakhapatnam | Sakshi
Sakshi News home page

చివరికి సబ్బం..!

Mar 20 2019 1:44 PM | Updated on Mar 23 2019 8:59 PM

Sabba hari Get Bheemili TDP Ticket Visakhapatnam  - Sakshi

అనూహ్యంగా మేయర్‌ అయ్యాడు.. కలలోనైనా ఊహించని విధంగా అనకాపల్లి ఎంపీ అయ్యాడు.మహానేత ఆశీస్సులతోనే ఎవ్వరికీ దొరకని అవకాశాల అందలాలు అధిరోహించాడు..కానీ ఆ మహానేత హఠాన్మరణం తర్వాత ఆ కుటుంబానికే  తీరని ద్రోహం చేశాడు. మహానేత సతీమణి పోటీ చేస్తే ఏ మేరకు ‘కృతజ్ఞత’ చూపించాడో అందరికీ తెలుసు.. ఆ తర్వాత ఐదేళ్లు బయటకు మొహం చూపించలేని దుస్థితి దాపురించింది.తిరిగి కొన్ని నెలలుగా అయ్యా.. బాబూ.. అంటూ టీడీపీ చంద్రబాబు కాళ్ళావేళ్లా పడ్డాడు. చివరి వరకు అక్కడా గేట్లు తెరవలేదు. చివరాఖరికి ఎవ్వరూ వద్దన్న  భీమిలి టికెట్‌ మొహాన పడేశారు..
ఇదంతా ఎవరి గురించో మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది.అవును.. అతడే.. చేతల కంటే  మాటలతోనే పబ్బం గడిపేసే సబ్బం హరే..ఎట్టకేలకు టీడీపీ టికెట్‌ దొరకబుచ్చుకుని దక్కిందేచాలని భావిస్తున్న ఆయనగారి దుస్థితి చూసి.. ఒకప్పుడు అతని ప్రాభవాన్ని గురు్తతెచ్చుకుని హతవిధీ అంటున్నారు రాజకీయవిశ్లేషకులు.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: చిల్లర వేషాలు, రౌడీ వ్యవహారాలు, సెటిల్‌మెంట్లు చేస్తూ కాలం గడిపేసిన సబ్బం హరి.. అదృష్టం వరించి 1995లో అనూహ్యంగా మహావిశాఖ నగరపాలక సంస్థ మేయర్‌ అయ్యాడు. మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అనుచరుడిగా కాంగ్రెస్‌లో ముద్రపడ్డాడు. ఓసారి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడన్న ఆరోపణతో అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి సస్పెండ్‌ చేయించారు. అప్పుడు కూడా వైఎస్‌ పెద్దమనసుతో మన్నించి నేదురుమల్లిని ఒప్పించి తిరిగి పార్టీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత 2009లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి దగ్గరుండి అనకాపల్లి లోక్‌సభ సీటు ఇప్పించి గెలిపించారు. మహానేత హఠాన్మరణం తర్వాత సబ్బంహరి ఆ కుటుంబం పట్ల ఎంత కృతజ్ఞత చూపించాడో అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ విషయం ప్రస్తావిస్తే తేనెతుట్టెను కదిపినట్టే అవుతుంది. 2014 ఎన్నికల తర్వాత అడపాదడపా సీఎం చంద్రబాబును కీర్తించేందుకే ఇంటి నుంచి బయటికొచ్చిన సబ్బం హరి.. 2019 ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని చెబుతూవచ్చాడు. తాను కోరుకున్న నియోజకవర్గం నుంచి పోటీ చేయగలనని బీరాలు పోయాడు.

భీమిలియే గతి
టీడీపీలో తాను ఆశించిన టికెట్‌ను తెచ్చుకోగలనని బిల్డప్‌ ఇచ్చిన సబ్బం హరి చివరికి ఎవరూ కాదన్న భీమిలికి పోవాల్సి వచ్చింది. భీమిలిలో టీడీపీ పరిస్థితి బాగోలేదని స్వయంగా టీడీపీ మీడియా కోడై కూసినప్పటికీ భీమిలి నుంచే మళ్లీ పోటీ చేస్తానని మంత్రి గంటా శ్రీనివాసరావు మూడు నెలల కిందటి వరకు చెప్పుకొచ్చారు. అయితే అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు వైఎస్సార్‌సీపీ భీమిలి సమన్వయకర్తగా రంగంలోకి దిగడంతో గంటా అక్కడి నుంచి పరుగు అందుకున్నారు. ఇక సీఎం చంద్రబాబు కుమారుడు లోకేష్‌ అక్కడ పోటీ చేస్తారని ప్రచారం సాగినా.. చివరికి లోకేష్‌ మంగళగిరికి తరలిపోయారు.

ఓ దశలో భీమిలికి వెళ్ళేదెవరు.. అని టీడీపీలో కాగడా పట్టుకుని వెతికినా ఎవరూ దొరకని పరిస్థితి ఎదురైంది. మరోవైపు ఎక్కడైనా సరే.. ఏదో ఒక టికెట్‌ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న సబ్బం హరిని చంద్రబాబు పిలిపించి  భీమిలికి వెళ్లమని పురమాయించారు. తొలుత సబ్బం దానికి అంగీకరించలేదని అంటున్నారు. సామాజికవర్గ కోణంలో కూడా భీమిలికి తాను సరిపోనని వాదించినప్పటికీ వెళ్తే అక్కడికి వెళ్ళు.. లేదంటే లేదు.. అని బాబు తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది. ప్రత్యక్ష రాజకీయాల్లో లేక ఐదేళ్ళు ఇంటికే పరిమితమైన సబ్బం ఏదో ఒక చోట పోటీ చేస్తే పోలా... అని మనుసు కుదుటపర్చుకుని పోటీకి దిగాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. నాడు వైఎస్‌ అనుచరుడిగా ఓ వెలుగు వెలిగిన సబ్బం నేడు ఓ టికెట్‌ కోసం.. అది కూడా ఎవరూ వద్దన్న టికెట్‌ కోసం వెంపర్లాడే దుస్థితికి చేరుకోవడం స్వయంకృతాపరాధమేనని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement