
సాక్షి, కృష్ణా: ముగ్గురు చౌదరీల రహస్య భేటీకి చంద్రబాబు నాయుడే సూత్రధారి అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్, బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరిల రహస్య భేటీ వెనక కుట్రకోణం ఉందన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్ బయటపడటంతో నిమ్మగడ్డ బండారం బట్టబయలైందన్నారు. చంద్రబాబు చేతుల్లో నిమ్మగడ్డ కీలుబొమ్మగా మారాడన్న అనుమానం నిజమని తేలిందని పేర్కొన్నారు. తప్పుడు పనులు చేస్తున్న నిమ్మగడ్డ రమేష్‌పై తక్షణమే విచారణ జరిపించాలన్నారు. (నిమ్మగడ్డతో భేటీ: బీజేపీ నేతలపై అధిష్టానం ఫైర్)
ఇక సుజనా, కామినేని బీజేపీలో ఉంటూ టీడీపీ కోసం పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో చంద్రబాబు నిపుణుడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మనుషులను వాడుకొని వదిలేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిన లేఖపై నిమ్మగడ్డ రమేష్ సంతకం చేశారనేందుకు రహస్య భేటీ ఓ నిదర్శనమని స్పష్టం చేశారు. చంద్రబాబు మాటలు వినే నిమ్మగడ్డ స్థానిక సంస్థల ఎన్నికలను అనైతికంగా వాయిదా వేశారని మరోసారి ప్రస్తావించారు. (వారితో మాట్లాడిన నాలుగో వ్యక్తి ఎవరు?)