శరగడం చినఅప్పలనాయుడు
విశాఖసిటీ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ జిల్లా పరిధిలో ఏడు సెగ్మెంట్లతో పాటు ఎంపీ సీటును కైవసం చేసుకుంటామని వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ జిల్లా అధ్యక్షుడు శరగడం చిన అప్పలనాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన శాసనసభ సీట్ల విషయంలో సామాజిక న్యాయం పాటించారని తెలిపారు. అన్నివర్గాలకు సమన్యాయం పాటిస్తూ కేటాయింపు జరిపారని తెలిపారు. 175 అసెంబ్లీ సీట్లకుగానూ 50 మంది రెడ్డి సామాజిక వర్గానికి, 41 మంది బీసీలకు, 29 మంది ఎస్సీలకు, 27 మంది కాపులకు, 10 మంది కమ్మ సామాజిక వర్గానికి, ఏడుగురు ఎస్సీలకు, ఐదుగురు ముస్లింలకు, ముగ్గురు ఆర్యవైశ్యులకు, ముగ్గురు బ్రాహ్మణ వర్గానికి సీట్లు కేటాయించి సామాజిక న్యాయం పాటించారన్నారు. జగనన్నని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు శ్రమిస్తున్నాయని తెలిపారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రజలు వైఎస్సార్‌సీపీకి బ్రహ్మరథం పడుతున్నారని వెల్లడించారు. నర్సీపట్నంలో జరిగిన బహిరంగ సభ విజయవంతమైందన్నారు. సీట్ల కేటాయింపులో ఒకటి రెండు చోట్ల కొందరు నాయకులు అసంతృప్తికి గురైనా పరిస్థితులకు అనుగుణంగా వారు అర్థం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నో కుట్రలు, కుతంత్రాలకు తెరలేపిన టీడీపీకి తగిన సమాధానం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.
జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలను కాపీ కొట్టి చంద్రబాబు చివరి మూడు నెలల్లో హడావుడిగా సంక్షేమ పథకాలను అమలు చేశారని, వీటిని ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. జగనన్నపై మళ్లీ కుట్రలు మొదలయ్యాయని, దీనికి అనుగుణంగానే కొన్ని పార్టీలు అవగాహన ఏర్పరుచుకొని సీట్ల కేటాయింపులు చేసుకుంటున్నాయని ఆరోపించారు. మూడు దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించేందుకు రోజూ సమావేశాలు నిర్వహించి ఇప్పటికీ పూర్తి జాబితా ప్రకటించలేకపోయారని ఎద్దేవా చేశారు. కానీ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం 175 అసెంబ్లీ సీట్లకు, 25 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి రికార్డు సృష్టించారని అన్నారు. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న అమర్‌నాథ్‌కు అండగా నిలిచి జగనన్న సీటు కేటాయింపు జరిపారన్నారు. ఇక జిల్లాలో నలుగురు మహిళలకు సీట్లు ఇచ్చి మహిళలకు చట్టసభల్లో గుర్తింపు వచ్చేలా కృషి చేశారని తెలిపారు. రావాలి జగన్ – కావాలి జగన్ కార్యక్రమంతోపాటు గడప గడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమాలు విజయవంతమయ్యాయని, ఇది చూసిన అధికారపార్టీలో అలజడి మొదలైందన్నారు. చంద్రబాబు చేస్తున్న హత్యారాజకీయాలకు ప్రజలు సమాధానం చెప్పే రోజులు దగ్గరకు వచ్చాయని వ్యాఖ్యానించారు. వైద్యరంగంలో సేవలందించిన సత్యవతికి ఎంపీ సీటు ఇవ్వడం వల్ల మహిళల్లో మంచి సంకేతాలు లభించాయన్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని అందరూ ఆహ్వానిస్తున్నారని, రెండున్నర దశాబ్దాలుగా ఆమె వైద్యరంగంలో డబ్బు ఆశించకుండా సేవలందించడాన్ని జగనన్న గుర్తించి ఎంపీ సీటు ఇచ్చారన్నారు.
ఇక ఏజెన్సీలో సైతం గిరిజన ప్రాంతాలకు చెందిన అన్నివర్గాల వారికి సీట్లు కేటాయించారని పేర్కొన్నారు. విద్యావంతుడైన అమర్‌నాథ్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, అదే విధంగా ఆయన తండ్రి గతంలో జిల్లాలో గుర్తింపు కలిగిన నేతగా ఉన్నారని అన్నారు. ఏది ఏమైనా ఎన్ని కుట్రలు తెరమీదకు వచ్చినా జగనన్న సీఎం కావడం తథ్యమని చిన అప్పలనాయుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment