టీడీపీ అభ్యర్థి కొండపల్లి అప్పలనాయుడు, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బొత్స అప్పలనర్సయ్య
సాక్షిప్రతినిధి, విజయనగరం: ఎన్నికలు జరగకుండానే ఫలితం చెప్పేయగల నియోజకవర్గం జిల్లాలో ఏదైనా ఉందంటే ముందుగా చెప్పుకోవాల్సింది గజపతినగరం నియోజకవర్గాన్నే. ఇక్కడ ప్రధాన ప్రత్యర్థులైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ అభ్యర్థులపై ప్రజల్లో ఉన్న అభిప్రాయమే దీనికి ప్రధాన కారణం. ఐదేళ్లుగా అవినీతి తప్ప ప్రజాప్రయోజనాల గురించి ఏమాత్రం ఆలోచించని అధికారపార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కేఏ నాయుడు ఆ పార్టీ అభ్యర్థిగా మరలా పోటీలోకి దిగారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా క్లీన్ ఇమేజ్‌తో, నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే నాయకుడిగా పేరుపొందిన బొత్స అప్పలనర్సయ్య వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఈ ఇద్దరిలో ఎవరిది విజయమనేదానిపై ఇప్పటికే ప్రజల్లో ఓ స్పష్టత వచ్చేసింది.అధికారంలో ఉన్నా లేక పోయినా అప్పలనర్సయ్య నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడం, బలమైన కార్యకర్తల అండదండలతో ఇక్కడ వార్ ఒన్‌సైడ్ అయినట్టే కనిపిస్తోంది.
అప్పలనర్సయ్యకు మంచి పేరు
బొత్స అప్పలనర్సయ్య విజయనగరం ఎస్సీ కార్పొరేషన్‌లో డీఈగా ఉద్యోగం చేసేవారు. అన్న బొత్స సత్యానారాయణ మంత్రిగా, వదిన ఝాన్సీ ఎంపీగా ఉండడంతో వారిని ఆదర్శంగా తీసుకుని ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2001లో బొండపల్లి, 2006లో దత్తిరాజేరు జెడ్పీటీసీగా గెలిచారు. 2009లో టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి పడాల అరుణపై ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి, మంచి పనులు చేయడంతో పాటు మంచి వ్యక్తి, కార్యకర్తలను క్రమశిక్షణతో నడిపించగలరనే పేరు తెచ్చుకున్నారు.
కొండపల్లికి అన్నీ ప్రతికూలతలే...
ప్రైవేటు వైద్యుడిగా ఉండి, తండ్రి దివంగత ఎంపీ కొండపల్లి పైడితల్లినాయుడి రాజకీయ వారసుడుగా వచ్చిన కొండపల్లి అప్పలనాయుడు రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి బొత్స వారి చేతిలో ఓటమి పాలయ్యారు. 2014 వరకు చీపురుపల్లి టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న కేఏ నాయుడుని ఎన్నికలు మందు గజపతినగరం ఇన్‌చార్జ్ పదవి ఇచ్చి అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ కేటాయించారు. 2014లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన కేఏ నాయుడు ప్రజలకు అందుబాటులో ఉండరనే అపవాదు ఉంది.
గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలు పరిష్కరించడమనేది ఐదేళ్లలో ఏనాడూ జరగలేదు. నమ్మకున్న కార్యకర్తలకే న్యాయం చేయరనే చెడ్డ పేరు సంపాదించారు. చివరికి తన సొంత అన్నకే మంచి చేయలేకపోయారు. నియోజకవర్గంలో ఆయన చేయని అవినీతి లేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయన అన్న కొండలరావు పెద్ద తిరుగుబాటే చేశారు. చివరికి తమ్ముడిపైనా, టీడీపీపైనా నమ్మకం లేక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పలనర్సయ్యకు మద్దతు పలికారు.
గజపతినగరం చరిత్ర ఇలా...
గజపతినగరం నియోజకవర్గం 1955లో ఏర్పాటైంది. పూసపాటి వంశానికి చెందిన పీవీజీ రాజు భార్య (ఎంపీ అశోక్ తల్లి) తొలి ఎమ్మెల్యేగా ఎన్నియ్యారు. ఒకసారి పెనుమత్స సాంబశివరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు 15 మంది ఎమ్మెల్యేలుగా పని చేశారు.
గజపతినగరం నియోజకవర్గం జనాభా, ఓటర్లు ఇలా..
జనాభా | 2,86,820 |
ఓటర్లు | 1,90,898 |
పురుషులు | 94,350 |
స్త్రీలు | 96,424 |
ఇతరులు | 4 |
పోలింగ్ స్టేషన్లు | 264 |
Comments
Please login to add a commentAdd a comment