రీ టెండరింగ్‌తో ప్రజాధనం ఆదా | Saving the public money with re-tendering | Sakshi
Sakshi News home page

రీ టెండరింగ్‌తో ప్రజాధనం ఆదా

Published Sun, Aug 18 2019 3:38 AM | Last Updated on Sun, Aug 18 2019 3:38 AM

Saving the public money with re-tendering - Sakshi

ప్రకాశం బ్యారేజీ వద్ద విలేకర్లుతో మాట్లాడుతున్న మంత్రులు

సాక్షి, అమరావతి బ్యూరో: గోదావరి నదికి వరద తగ్గుముఖం పట్టగానే నవంబర్‌ 1వ తేదీ నుంచి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలు, అవకతవకలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి విడుదల చేస్తున్న నీటి ప్రవాహాన్ని శనివారం సాయంత్రం మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాస్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ... టీడీపీ ప్రభుత్వ హయాంలో నామినేషన్‌ పద్ధతిపైనే రూ.10,000 కోట్ల పనులను కాంట్రాక్ట్‌ సంస్థలకు అప్పగించారని, ఇందులో భారీగా అవినీతి చోటుచేసుకుందని చెప్పారు.

పోలవరంపై రీ టెండరింగ్‌ నిర్వహించడం వల్ల ప్రజాధనం మిగులుతుంది తప్ప వృథా కాదని స్పష్టం చేశారు. రీ టెండరింగ్‌ వల్ల బేసిక్‌ ప్రైస్‌ తగ్గుతుందని వెల్లడించారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి 8 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. సీఎంతి వైఎస్‌ జగన్‌ అమెరికా నుంచి గంటగంటకూ వరద పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారని, ఆయన సూచన మేరకు మంత్రులు, అధికారులూ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందజేస్తామన్నారు. అంటు వ్యాధులు ప్రబల కుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. 

ఇదే వరద టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి ఉంటే.. 
ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌కు మతి భ్రమించిందని అనిల్‌కుమార్‌ విమర్శించారు. వారిద్దరూ ఎక్కడో కూర్చొని వరద విషయంలో ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వరద నియంత్రణ చేతకాక 1998లో శ్రీశైలం పవర్‌ ప్రాజెక్టును ముంచేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. జలాశయాలు నిండి రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తుండడం చూసి టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. ఇదే వరద టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చినట్లయితే శ్రీశైలం, సాగర్, పులిచింతల గేట్లను ఎత్తి జలహారతి పేరుతో రూ.100 కోట్లు దోచుకునేవారని దుయ్యబట్టారు. 

వరదను కూడా రాజకీయం చేస్తారా?:బొత్స
వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. వరదల కారణంగా కృష్ణా జిల్లాలో బాలిక మృతి చెందిందని, ఆమె కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వరదల విషయంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించగలిగామని తెలిపారు. ప్రకాశం బ్యారేజీ భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. వరదను కూడా రాజకీయం చేయడం చంద్రబాబుకు తగదని బొత్స సత్యనారాయణ హితవు పలికారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్, జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement