
సాక్షి, హైదరాబాద్ : ఏప్రిల్ ఒకటో తేది నుంచి రెండో దశ బస్సు యాత్ర చేయనున్నట్లు తెలంగాణ పీసీసీ అధ్యకుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. గాంధీభవన్‌లో బుధవారం శాసన మండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి,జీవన్ రెడ్డి, డీకే అరుణ, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ..వచ్చే నెల ఒకటో తేది నుంచి పదవ తేది వరకు 17 నియోజకవర్గాల్లో ప్రజా చైతన్య బస్సు యాత్ర చేయనున్నట్లు చెప్పారు.
ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ కావడంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు గురించి సభలో ప్రశ్నించాలనుకున్నామని తెలిపారు. అయితే, కేసీఆర్ తమకు ఆ అవకాశం ఇవ్వకుండా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నామన్న కారణంతో అందర్నీ బర్తరఫ్ చేశారని, ఇద్దరి సభ్వత్యాలను రద్దు చేశారని ధ్వజమెత్తారు. ప్రధాన ప్రతిపక్షం లేకుండానే పంచాయతీ రాజ్ సవరణ బిల్లు, ప్రైవేట్ యూనివర్సీటీ బిల్లు తీసుకురావడం నీతిమాలిన చర్యగా వర్ణించారు.
ఎమ్మేల్యేల సభ్యత్వ రద్దుపై హైకోర్టు అసెంబ్లీ వీడియో పుటేజ్ ఇవ్వాలని కోరింది. ప్రభుత్వం మాత్రం పుటేజ్ ఇవ్వలేమని అంటుంది. ఇక్కడే ప్రభుత్వ తప్పు బయటపడిందన్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను తట్టుకోలేకనే అడ్వకేట్ జనరల్ రాజీనామా చేశారని ఆరోపించారు. అసెంబ్లీ నుంచి కాంగ్రెస్‌ను గెంటేసిన విషయం, బడ్జెట్ కేటాయింపులో బలహీన వర్గాలకు జరిగిన అన్యాయాన్ని బస్సుయాత్రలో ప్రజలకు వివరిస్తామని ఉత్తమ్ కుమార్ తెలిపారు.