న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ప్రియాంక గాంధీ అయితేనే న్యాయం చేయగలరని పార్టీలోని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులో కాంగ్రెస్ పార్టీని గట్టేక్కించే సామర్థ్యం ప్రియాంక గాంధీకి మాత్రమే ఉందని సీనియర్ నేత శశిథరూర్ ప్రియాంక నాయకత్వానికి తాజాగా మద్దతు తెలిపారు. ఇటీవల హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా, శత్రుఘ్నసిన్హా వంటి సీనియర్ నాయకులు యువతరాన్ని ప్రోత్సహించాలని, ప్రియాంకలో ఇందిరాగాంధీ తరహా నాయకత్వ లక్షణాలున్నాయని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ మాట్లాడుతూ ప్రియాంకగాంధీకి ప్రజా సమస్యలపై వెంటనే స్పందించే లక్షణాలు మెండుగా ఉన్నాయన్నారు. పార్టీలో ఉన్న అనిశ్చితి తొలగి, పార్టీ బలపడాలంటే ప్రియాంక నాయకత్వాన్ని సమర్థించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు ఆమె వంద శాతం అర్హురాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ వైఫల్యం తర్వాత సీనియర్ నేతలు ఎవరూ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు ముందుకు రాని పరిస్థితుల్లో ప్రియాంక ఒక సమర్థవంతమైన నాయకురాలిగా మనకు కనిపిస్తున్నారని శశిథరూర్ వ్యాఖ్యానించారు. సీనియర్ల మాటలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రియాంక పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడతారా లేదా అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment