కాంగ్రెస్‌లో చేరికపై ట్విస్టు ఇచ్చిన డీఎస్‌..! | Senior Leader D Srinivas Joins Congress Party | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 27 2018 10:58 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Senior Leader D Srinivas Joins Congress Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/న్యూఢిల్లీ: పీసీసీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ మళ్లీ కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్టు కథనాలు వచ్చాయి. ఢిల్లీకి వెళ్లిన డీఎస్‌.. శనివారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గజ్వేల్‌ మాజీ ఎమ్మెల్యే టీ నర్సారెడ్డి, ఎమ్మెల్సీ రాములు నాయక్‌తో కలిసి ఆయన కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్టు కథనాలు వచ్చాయి. అయితే, ఈ కథనాలపై డీఎస్‌ దిమ్మతిరిగే ట్విస్టు ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ఆయన స్పష్టం చేశారు. అనేక మంది నాయకులను సహజంగానే తాను కలుస్తుంటానని, ఈ క్రమంలోనే రాహుల్ గాంధీని  కలిశానని డీఎస్‌ వివరణ ఇచ్చారు. అయితే, వ్యూహాత్మకంగానే డీఎస్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన టీఆర్‌ఎస్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఈ క్రమంలో ఎంపీగా అనర్హత వేటును తప్పించుకోవడానికే వ్యూహాత్మకంగా కాంగ్రెస్‌ పార్టీలో అధికారికంగా డీఎస్‌ చేరలేదని భావిస్తున్నారు. రాహుల్‌తో భేటీ అయినప్పటికీ కాంగ్రెస్‌ పార్టీలో అధికారికంగా చేరకపోవడానికి ఎంపీ పదవే కారణమని తెలుస్తోంది.

డీఎస్‌ టీఆర్‌ఎస్‌ నుంచి ఆయన సస్పెండైన నాటి నుంచే కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించడంతో శనివారం ఆయన రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. 2014 సాధారణ ఎన్నికల ఫలితాల అనంతరం అనూహ్యంగా డీఎస్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. డీఎస్‌ స్థాయికి తగ్గట్టు సీఎం కేసీఆర్‌ రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చారు. పదవి ఇచ్చినా తనను పట్టించుకోవడం లేదనే అసంతృప్తి డీఎస్‌లో చాలాకాలంగా ఉంది. ముఖ్యంగా నిజామాబాద్‌ ఎంపీ స్థానంతోపాటు ఆ జిల్లాలోని తన అనుచరులకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అసంతృప్తితో ఉన్నారు. ఈ సమయంలోనే ఆయన కుమారుడు అరవింద్‌ బీజేపీలో చేరటం, టీఆర్‌ఎస్‌ పాలనపై విమర్శలు చేయడంతో జిల్లా నాయకత్వం అంతా డీఎస్‌ను పార్టీ నుంచి తొలగించాలని అధినేతకు సిఫార్సు చేసింది. ఆ మేరకు ఆయనపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఆనాటి నుంచి ఆయన కేసీఆర్‌పై మరింత ఆగ్రహంతో ఉన్నారు.

కాంగ్రెస్‌  గూటికి నర్సారెడ్డి, రాములు నాయక్‌..!
ఇక, గజ్వేల్‌ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ టి.నర్సారెడ్డి, టీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండైన ఎమ్మెల్సీ రాములు నాయక్‌.. కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. టీఆర్‌ఎస్‌లో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని కొన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నా నర్సారెడ్డి.. ఇదే విషయాన్ని ఆ పార్టీ ముఖ్య నేతల వద్ద పలుమార్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ అపాయింట్‌మెంట్‌ దొరక్కపోవడంతో పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో ఆయన ఇటీవల భేటీ అయ్యారు. అయితే మంత్రి హరీశ్‌రావు స్వయంగా నర్సారెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగించడంతో ఆయన కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించారు. కానీ గురువారం రాత్రి ఉత్తమ్‌తో మరోమారు సమావేశమైన ఆయన కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. అనంతరం పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డితోనూ భేటీ అయి శుక్రవారం ఉదయమే ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ఒంటేరు ప్రతాపరెడ్డికి టికెట్‌ ఇప్పటికే ఖాయమైనందున నర్సారెడ్డికి మెదక్‌ ఎమ్మెల్యే టికెట్‌ కేటాయిస్తారని కాంగ్రెస్‌లో ప్రచారం జరుగుతోంది.

ఐతే విజయశాంతి.. లేదా స్థానికుడికే
నర్సారెడ్డికి మెదక్‌ ఎమ్మెల్యే టికెట్‌ కేటాయించనున్నారన్న వార్తల నేపథ్యంలో మెదక్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు అలెర్టయ్యారు. సీనియర్‌ నేతలు సుప్రభాత్‌రావు, బట్టి జగపతి, చంద్రపాల్‌ తదితరులు శుక్రవారం సాయంత్రం గాంధీభవన్‌లో ఉత్తమ్‌ను కలిశారు. ఇస్తే విజయశాంతికి టికెట్‌ ఇవ్వాలని, లేని పక్షంలో స్థానికులకే టికెట్‌ కేటాయించాలని కోరారు. కూటమిలోని మిగతా పక్షాలకు గానీ, స్థానికేతరులకు కానీ ఇవ్వరాదని విన్నవించారు. ఇదే విషయమై వీరంతా విజయశాంతిని సైతం కలసి తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

కృష్ణయ్య, తుల ఉమ కూడా?
ఎల్బీనగర్‌ తాజా మాజీ ఎమ్మెల్యే, బీసీ సంఘాల నేత ఆర్‌.కృష్ణయ్య, కరీంనగర్‌ జెడ్పీ చైర్‌ పర్సన్‌ తుల ఉమ కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.  వేములవాడ నుంచి  టికెటు హామీ ఇస్తే ఉమ చేరే అవకాశముందని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement