
సాక్షి, హైదరాబాద్: దేశానికి స్వాతంత్య్రం 1947లో వస్తే, తెలంగాణలో బడుగు, బలహీన, అణగారిన వర్గాలకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక వచ్చిందని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దీనిపై ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ స్పందిస్తూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను కలుపుకుంటే తెలంగాణలో 91 శాతం జనాభా ఉండగా.. కేసీఆర్ ప్రభుత్వం లో నలుగురు బీసీ మంత్రులు, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనార్టీ కలిపి ఏడుగురే ఉన్నా రు.
ఇదేనా స్వాతంత్య్రం అని ఎద్దేశా చేశారు. సోమవా రం మండలిలో ‘గ్రా మీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కొరకు చర్యలు– గొర్రెలు, చేపల పంపిణీ, పాడి పరిశ్రమ అభివృద్ధి’అనే అంశంపై లఘు చర్చ జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. మూడున్నర నెలల్లోనే 27 లక్షల గొర్రెల ను పంపి ణీ చేశామని, ఇందులో 2 శాతం గొర్రెలు వేర్వేరు కారణాలతో మృతి చెందినట్లు చెప్పారు. ఈ ఏడాది 70 కోట్ల చేప పిల్లలు వదలాలని నిర్ణయించగా ఇప్పటికే 45 కోట్ల చేపపిల్లలను వదిలినట్టు తలసాని వివరించారు.
రాష్ట్రంలో నీలకంఠ రొయ్య ల పెంపకాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టామని, 9 ప్రాంతాల్లో వాటిని పెంచుతున్నట్లు వివరించారు. ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ మాట్లాడుతూ ‘ఇంతకూ తమరు ఏ పార్టీ నుంచి గెలుపొందారు? ఎవరి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు? రాజకీయ విలువలులేని మీలాంటి వాళ్లు మాకు చెప్తే ఎలా’అని ప్రశ్నించారు. షబ్బీర్ వ్యాఖ్యలకు మంత్రి స్పందిస్తూ..తాను ఏ పార్టీ నుంచి గెలిచాను అనేది ప్రజలకు తెలుసన్నారు. వివాదం ముదురుతుండటంతో మండలి డిప్యూటీ చైర్మన్ సభను మంగళవారానికి వాయిదా వేశారు.