సమావేశంలో మాట్లాడుతున్న శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి
కర్నూలు , నంద్యాల: మంత్రి అఖిలప్రియ నంద్యాలలో ఆళ్లగడ్డ రాజకీయాలు చేయాలని చూస్తే అవి ఇక్కడ చెల్లుబాటు కావని, నంద్యాల ప్రజలు మీ తాటతీసే రోజులు దగ్గర్లో ఉన్నాయని వైఎస్సార్సీపీ నంద్యాల నియోజకవర్గ నేత శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని శిల్పాసేవా సమితిలో కో ఆప్షన్‌మెంబర్ దేశం సు«ధాకర్‌రెడ్డితో కలిసి ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శిల్పా రవి మాట్లాడుతూ.. మంత్రి అఖిలప్రియ నంద్యాల మండలం కొత్తపల్లె గ్రామంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, ఆమె బెదిరింపులకు నంద్యాలలో భయపడే వ్యక్తులు ఎవరూ లేరన్నారు. ఆళ్లగడ్డలో వస్తున్న పర్సెంటేజీలు సరిపోక నంద్యాలకు మంత్రి వచ్చినట్లు తెలుస్తోందన్నారు. తాటతీస్తాం.. వంటి పదజాలం తాము మాట్లాడగలమని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు మంత్రి తాట తీయడం ఖాయమన్నారు. వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చే యించి వేధిస్తున్నారన్నారు. పోలీసు అధికారులు కూడా నిజాయితీగా పనిచేయాలని సూచించారు. టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి కేసులు పెట్టుకుంటూ పోవడం మంచి పరిణామం కాదన్నారు.
సొంతూరుకు ఏం చేశారో చెప్పండి..
నంద్యాల మండలం కొత్తపల్లె గ్రామాన్ని మాజీ సర్పంచ్ తులసిరెడ్డి హయాంలో శిల్పామోహన్‌రెడ్డి సహకారంతో అభివృద్ధి చేశామని శిల్పా రవి పేర్కొన్నారు. కొత్తపల్లెకు వచ్చే ముందు మంత్రి స్వగ్రామమైన డబ్లు్య. కొత్తపల్లెలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. అక్కడికి వెళ్లి అభివృద్ధి పనులు చేసుకుంటే మంచిదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో నంద్యాలలో అమృతస్కీం కింద అపార్టుమెంట్లు నిర్మిస్తున్నారని, ఆ నిధులను తమవి అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. శిల్పా మోహన్‌రెడ్డి హయాంలోనే అమృత స్కీం మంజూరు అయిందనే విషయం ప్రజలకు తెలుసున్నారు. నంద్యాలలో రోడ్ల వెడల్పులో నష్టపోయిన బాధితులకు ఇంత వరకు పరిహారం అందివ్వలేదన్నారు. తమకు తెలిసిన టీడీపీ నాయకుల షాపుల వద్ద 17 అడుగుల నుంచి 10 అడుగుల వరకు తగ్గించి రోడ్లు వేసిన దాఖలాలు మంత్రికే చెల్లాయన్నారు.
అభివృద్ధి కార్యక్రమాల పేరుతో టీడీపీ నాయకుల సమావేశం పెడతారా?
అభివృద్ధి కార్యక్రమాలు అంటూ అధికారులను అందరినీ పిలిచి తెలుగుదేశం పార్టీ నాయకులను స్టేజీపై కూర్చోబెట్టి సమావేశాలు ఎలా నిర్వహిస్తారని మంత్రి అఖిలప్రియను శిల్పారవి సూటిగా ప్రశ్నించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ దేశం సులోచన అనుమతి లేకుండా ఆమె చాంబర్‌లోకి వెళ్లడమే కాకుండా.. ఇన్ని సదుపాయాలు ఈమెకు కల్పించడం అవసరమా అని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. సీసీ టీవీ మానిటరింగ్ చైర్‌పర్సన్ పరిధిలో లేకపోయినా ఇక్కడ మానిటరింగ్ పెట్టవద్దని, తొలగించమని అధికారులను మంత్రి ఎలా ఆదేశిస్తారన్నారు. అసలు చైర్‌పర్సన్ చాంబర్‌లో సీసీ టీవీ మానిటరింగ్ లేదని, వాస్తవాలు తెలుసుకోకుండా ప్రతిపక్ష పార్టీ నాయకులపై, ప్రజాప్రతినిధులపై ఉద్దేశపూర్వకంగా ఏదో మాట్లాడాలని మాట్లాడితే తాము చూస్తూ ఊరుకొనే ప్రసక్తే లేదన్నారు. చైర్‌పర్సన్‌కు మున్సిపల్ అధికారులు నంద్యాల పట్టణ అభివృద్ధికి ఏం పనులు చేస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయం ఆమెకు తెలియకపోవడం విచారకరమన్నారు.
అందినకాడికి దోచుకోవడమే టీడీపీ నేతల పని
వచ్చే ఎన్నికల్లో గెలవలేమన్న ఉద్దేశంతో టీడీపీ నాయకులు అందినకాడికి దోచుకుంటున్నారని శిల్పా రవి ఆరోపించారు. భూకబ్జాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ స్థలాలు, వక్ఫ్‌బోర్డు స్థలాలు దేనినీ వదలడం లేదన్నారు. చివరకు పట్టణ నడి బొడ్డున ఉన్న 150 ఏళ్ల చరిత్ర ఉండి పెళ్లిళ్లకు ఉపయోగపడే పాలకొమ్మ చెట్టును నరికివేశారన్నారు. నీరు–చెట్టు పథకం కింద కోట్లు కొల్లగొడుతున్నారన్నారు. చిన్నవయస్సులో అఖిలప్రియ మంత్రి పదవి పొంది ఎలా పేరు పొందారో.. అదే విధంగా తక్కువ కాలంలోనే అవినీతి మంత్రిగా కూడా రికార్డులోకి ఎక్కనున్నారని విమర్శించారు. కార్యక్రమంలో కో ఆప్షన్ మెంబర్ దేశం సుధాకర్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఉప్పు జగన్ ప్రసాద్, మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇసాక్‌బాషా, కౌన్సిలర్లు జాకీర్‌హుసేన్, అమృతరాజు, మాబున్నిసా, చాంద్‌బీ, శోభారాణి, కన్నమ్మ, దేవనగర్‌బాషా, కిరణ్, టైలర్‌శివ, కృష్ణమోహన్, వైఎస్‌నగర్ రమణ, అహమ్మద్ హుసేన్, గోపాల్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment