సిద్ధరామయ్య , అమిత్‌షా
మైసూరు: బీజేపీ అధినేత అమిత్‌షా మమ్మల్ని చూసి భయపడుతున్నారు, అందుకే రాష్ట్రంలో నేను ఎక్కడ ప్రచారాలు నిర్వహించినా వెంటనే అమిత్‌షా కూడా అదే ప్రాంతాల్లో పర్యటనలు చేస్తున్నారు’ అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమర్శించారు. గురువారం మైసూరు నగరానికి చేరుకున్న సీఎం మీడియాతో మాట్లాడారు. ‘హిందూ మతాన్ని విభజించడానికి కుట్రలు చేస్తున్నామంటూ మాపై పదేపదే ఆరోపణలు చేస్తున్న అమిత్‌షా ముందు హిందూ మతానికి చెందిన వారో లేదా జైన మతానికి చెందినవారో దేశ ప్రజలకు స్పష్టం చేయాలి.
గత ఏడాది నంజనగూడు, గుండ్లుపేట నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో యడ్యూరప్ప తదితర నేతలు కాళ్లరిగేలా తిరిగినా ఫలితం ఏమైందో అమిత్‌షా తెలుసుకోవాలి. అవే ఫలితాలు మే12న జరిగే ఎన్నికల్లోనూ పునరావృతమవుతాయి. చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే నాకు ఓటమి తథ్యమంటూ జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి చెప్పడం హాస్యాస్పదం. ఇప్పటివరకు చాముండేశ్వరి నుంచి నేను ఏడు సార్లు పోటీ చేస్తే, ఐదుసార్లు గెలిచాను. నా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన చాముండేశ్వరి నుంచే ఈసారి కూడా పోటీ చేస్తాను. చాముండేశ్వరి నియోజకవర్గం గురించి ఏమీ తెలియకుండా కుమారస్వామి మాట్లాడుతున్నారు’ అని సిద్ధు మండిపడ్డారు.
కావేరి భేటీకి వారెందుకు రాలేదు?
కావేరీ నదీ జలాలపై నిర్వహణ మండలిని ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు చెప్పలేదని, జలాలపై స్కీమ్‌ను మాత్రమే ఏర్పాటు చేయాలని ఆదేశించిందని సీఎం తెలిపారు. కావేరీపై అఖిలపక్ష సమావేశం జరిపితే బీజేపీ ముఖ్యనేతలైన యడ్యూరప్ప,ఈశ్వరప్పలతో పాటు జేడీఎస్ ముఖ్యనేతలు దేవేగౌడ, కుమారస్వామిలు హాజరుకాలేదన్నారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రులు అనంతకుమార్,సదానందగౌడలు మాత్రమే హాజరుకాగా కావేరీ నదీ జలాల పంపిణీలో రాస్ట్రానికి అన్యాయం జరిగితే కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇద్దరు మంత్రులకు తెలిపామన్నారు. కాగా, చాముండేశ్వరిలో సీఎం సిద్ధరామయ్య ప్రచారం ఆరంభించారు. మహిళలు హారతి పట్టగా పళ్లెంలో సిద్ధరామయ్య నోట్ల సమర్పించడం ఎన్నికల కోడ్‌ను అతిక్రమించడమేనని విపక్ష నేతలు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment