సాక్షి, బెంగళూరు : ఈనెల 12వ తేదీన జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో బహిరంగ ప్రచారం ముగిసింది. గత నెల రోజులుగా కన్నడ నాట జరిగిన ఎన్నికల ప్రచారానికి నేటితో తెర పడింది. ఇక అభ్యర్థులు ప్రచారం చేయడానికి ఇవాళే ఆఖరి రోజు కావడంతో టెన్షన్‌గా టెన్షన్‌గా ప్రచారం చేస్తూ ముగించారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు.
చివరి రోజున కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ నాయకులు బెంగళూరు నగరంలో పోటాపోటీగా సభలు, సమావేశాలు, రోడ్డుషోలు నిర్వహించారు. మరోవైపు రెండు రోజుల ముందే నగరంలో ఎన్నికల సందడి నెలకొంది. కర్ణాటక ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడంతో ప్రధాన రాజకీయ పార్టీల జాతీయ నాయకులు పూర్తి బాధ్యతలు తీసుకున్నారు. ఇక అధికారం నిలబెట్టుకుంటామని కాంగ్రెస్ చెబుతుంటే... ఈసారి కర్ణాటక పీఠం తమదేనని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. అంతేకాకుండా హంగ్ వచ్చే అవకాశమే లేదని ప్రధాన పార్టీలు చెప్పుకొస్తున్నాయి.
పోటాపోటీగా..
కన్నడ నాట ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నాయకులతో పాటు జేడీఎస్ నేతలు ప్రచారంలో జోరు పెంచారు. మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ, ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా చివరి రోజు ప్రచారంలో వేగం పెంచారు. కాగా జాతీయ నేతలతో పాటు ఆయా పార్టీల స్థానిక నాయకులు కూడా ప్రచారంలో పాల్గొని ఓటర్లను ఆకర్షించారు. బీజేపీ నాయకులు సుమారు 50 మంది రోడ్డుషోల్లో పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. కాగా ప్రధాని మోదీ గురువారం ఉదయం దళితులతో ‘నమో’ యాప్ ద్వారా సంభాషించారు.
రంగంలోకి బీజేపీ అగ్రనేతలు
భారతీయ జనతా పార్టీ తరఫున అమిత్‌షా, కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, ప్రకాశ్ జవదేకర్, అనంతకుమార్, డీవీ సదానందగౌడ, మరో 50 మంది ప్రముఖ నేతలు గురువారం ప్రచారంలో బిజీబిజీ అయ్యారు. బెంగళూరు నగరంలో సుమారు 150 మంది రోడ్డు షోలో పాల్గొన్నారు. కేంద్రమంత్రులతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచారం నిర్వహించారు. దీంతో నగరంలో ఎన్నికల సందడి నెలకొంది. మైసూరులో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, బెంగళూరులో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణసింగ్ ప్రచారంలో పాల్గొన్నారు. సీఎం సిద్ధరామయ్య పోటీ చేస్తున్న బాదామి లో బీజేపీ అభ్యర్థి బి.శ్రీరాములుతో పాటు బీజేపీ చీఫ్ అమిత్‌షా, మాజీ సీఎం బీఎస్ యడ్డూరప్ప ప్రచారంలో పాల్గొన్నారు.
మరోసారి అవకాశం ఇవ్వండి..
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హుబ్లి, ధార్వాడ ప్రాంతంలో పర్యటించారు. కర్ణాటకలో మరోసారి అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. చాముండేశ్వరిలో ప్రచారం చేస్తున్న సీఎం సిద్ధరామయ్య గురువారం బెంగళూరుకు వచ్చారు. రాహుల్ గాంధీతో పాటు సాగిన సమావేశంలో పాల్గొన్నారు. మరోసారి తనకు పట్టం కట్టాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా వివిధ నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారం చేశారు. కాగా కాంగ్రెస్, బీజేపీలకు పోటీగా జేడీఎస్ నేతలు మాజీ ప్రధాని దేవేగౌడ, మాజీ సీఎం కుమారస్వామి కూడా తమదైన శైలిలో ప్రచారం చేశారు. తాము కింగ్‌మేకర్ కాదు.. కింగ్‌లే అని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ–కాంగ్రెస్,జేడీఎస్ అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేయడంతో పల్లెలు,పట్టణాలు,నగరాలు పార్టీలు జెండాలలో రెపరెపలాడాయి.
Comments
Please login to add a commentAdd a comment