
ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. తెలంగాణ ఉద్యమ సారథి, ఆపద్ధర్మ మంత్రి జోగు రామన్న ఇక్కడి నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. ఈ సెగ్మెంట్‌కు టీఆర్‌ఎస్ పోటీ చేయడం ఇది మూడోసారి. టీఆర్‌ఎస్ నుంచి రెండోసారి పోటీ చేసిన జోగు రామన్న 2014 ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గడిచిన నాలుగున్నరేళ్లలో నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. 2014లో తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్, కొత్త రాష్ట్రం జోష్ ఊపందుకోవడంతో జోగు రామన్నకు ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. గడిచిన నాలుగున్నరేళ్లలో రూ.5,333 కోట్లు ఖర్చు చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లారు. అభివృద్ధి మంత్రం ఆధారంగా గెలుస్తామనే ధీమాతో ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయానికి ముందు ఈ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు బలమైన క్యాడర్ లేదు. 2012లో జోగు రామన్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరడంతో పార్టీకి ఊపు వచ్చింది. 2014 ఎన్నికల్లో జోగు రామన్న తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్‌పై 14,711 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈసారి రామన్నపై కూటమి తరపున కాంగ్రెస్ అభ్యర్థి గండ్రత్ సుజాత బరిలో ఉన్నారు. తాంసి మండలానికి చెందిన సుజాత గతంలో 1999లో ఒకసారి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఆమె బరిలోకి దిగారు.
ప్రధాన సమస్యలు
- పట్టణంలోని తాంసి బస్టాండ్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం
- మూతపడిన సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పునరుద్ధరణ
- డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో వెనుకబాటు
- నిరుద్యోగం ప్రధాన సమస్య. చదువుకున్న యువతీ యువకులు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రత్యేకతలు
- ఆదిలాబాద్‌లో నాలుగున్నరేళ్లలో అభివృద్ధి పనుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.
- దళితబస్తీ పథకంలో రాష్ట్రంలోనే ఆదిలాబాద్ నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ ఈ పథకం కింద రూ.52.11 కోట్లు ఖర్చు చేసి 482 మంది మహిళలకు మూడెకరాల భూమి ఇప్పించారు.
- జైనథ్‌లోని కోరటలో ఓంకారేశ్వర మందిరం నిర్మాణం కోసం రూ.5.45 కోట్లు ఖర్చు చేశారు.
- నియోజకవర్గంలోని సీహెచ్‌సీ, పీహెచ్‌సీల అభివృద్ధికి రూ.24.81 కోట్లు మంజూరు చేశారు.
- చనాఖ–కొరటా బ్యారేజీ నిర్మాణం.
- రిమ్స్‌ను సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి పర్చేందుకు రూ.150 కోట్లు కేటాయించారు.
- సాత్నాల ప్రాజెక్టు పనులకు రూ.69 కోట్లు, మార్కెట్ గోదాంలకు రూ.23 కోట్లు, సీసీ, బీటీ రోడ్లు, చెక్‌డ్యాంల నిర్మాణానికి రూ.118 కోట్లు ఖర్చు చేశారు.
- జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లో ఎయిర్‌స్ట్రిఫ్ ఏర్పాటు తెరపైకి..
- రూ.80 కోట్లతో మిషన్ భగీరథ పనులు
- రూ.6 కోట్లతో యాపల్‌గూడలో పోలీస్ బెటాలియన్
- 3,970 మందికి జీవో 58 ద్వారా ఉచిత పట్టాలు.
సిట్టింగ్ ప్రొఫైల్
జోగు రామన్న 1984లో టీడీపీలో చేరి 1985–86 వరకు జైనథ్ మండల ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 1987–88 వరకు మండల పార్టీ అధ్యక్షుడిగా, 1988–95 వరకు దీపాయిగూడ సర్పంచ్‌గా, 1995 నుంచి 2001 వరకు జైనథ్ ఎంపీపీగా పని చేశారు. 2001 నుంచి 2005 వరకు టీడీపీ జెడ్పీ విప్‌గా చేశారు. అనంతరం 2005లో జైనథ్ జెడ్పీటీసీగా గెలుపొందారు. 2004లో టీడీపీ తరుపున ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2009లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. 2011లో తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీకీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం 2012 ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఇక కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక 2014 ఎన్నికల్లోనూ విజయ కేతనం ఎగరవేశారు. సీఎం
కేసీఆర్ మంత్రి వర్గంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు.
.:: ఇన్‌పుట్స్: నిమ్మల స్వామి, ఆదిలాబాద్ అర్బన్
Comments
Please login to add a commentAdd a comment