
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తాము పాండవులమని, బీజేపీ వారు కౌరవులని, జరగబోయేది కురుక్షేత్ర యుద్ధమేనంటూ చేసిన వ్యాఖ్యలకు పార్టీ కార్యకర్తలు భారీగానే చప్పట్లు కొట్టి ఉండవచ్చు. ఇలాంటి మాటలు ‘శబ్బాష్’ అంటూ ఎవరి భుజాలు వారు చరచుకోవడం లాంటిది. మంత్రాలకు చింతకాయలు ఎలా రాలవో, రాజకీయ నినాదాలకు ఓట్లు రాలవు. కాకపోతే కాస్త ప్రచారాన్ని కల్పిస్థాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘సంక్షిప్త నామ పద పంధాల’ ప్రయోగం ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్రయోజనం కల్పించలేదన్న విషయాన్ని గుర్తించాలి.
కాంగ్రెస్ పార్టీ అంటే ఓ ఉద్యమమని కూడా ప్లీనరీ సమావేశాల్లో రాహుల్ గాంధీ చెప్పుకున్నారు. స్వాతంత్య్రానికి ముందే తప్ప స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ పార్టీ నడిచిందీ ఉద్యమంపై కానేకాదని విషయాన్ని మరచిపోవద్దు. పైగా దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించినదీ కాంగ్రెస్ పార్టీయే కనుక దేశంలో నెలకొన్న దుర్భర పరిస్థితులకు బాధ్యత వహించకా తప్పదు. ప్రస్తుత పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీకి 44 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఏడాదిలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 272 మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోవడం ఎంత కష్టమో ముందుగా గుర్తించాలి. అది అందుకోవడానికి ఎంతగా కృషి చేయాలో, ఓ ఉద్యమంగా ఎలా ప్రజల్లోకి దూసుకుపోవాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రాహుల్ గాంధీ విడమర్చి వివరిస్తే బాగుండేది. వారికి నమ్మకాన్ని కుదిరిస్తే మరీ బాగుండేది.
ఆక్సిజన్ గొట్టంతో ఊపిరి పీల్చుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి తిరిగి జవసత్వాలు సమకూర్చేందుకు ఎలాంటి సమగ్ర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందో ఆలోచించాలి. అందుకు తగిన కార్యాచరణను కార్యకర్తల ముందుకు తీసుకరావాలి. వారిని కార్యోన్ముఖులను చేయాలి. పార్టీ ప్రస్తుతమున్న పరిస్థితి గురించి కార్యకర్తలకు వాస్తవం చెప్పడానికి ప్లీనరీకన్నా మంచి వేదిక ఉండదు. ఆకర్షణీయమైన నినాదాలతో, ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్లీనర్ సమయాన్ని వృధా చేస్తే ఆ తర్వాత పశ్చాత్తాపానికి అవకాశం కూడా ఉండదు.
వచ్చే ఎన్నికల్లో భావ సారూప్యత గల పార్టీలతో కలిసి ‘కనీస ఉమ్మడి కార్యక్రమం’ ప్రాతిపదిక పోరాడేందుకు ప్లీనరీలో తీర్మానం తీసుకరావాలి. ఈ దిశగా ఇటీవల సోనియా గాంధీ ఏర్పాటు చేసిన భావసారూప్య పార్టీల నేతల సమావేశానికి దాదాపు 20 పార్టీల నేతలు హాజరైనప్పటికీ పెద్దగా ప్రయోజనం కనిపించలేదు.
ఎన్సీపీ, ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు ప్రధాన మంత్రి పదవికి రాహుల్ అభ్యర్థిత్వం పట్ల అభ్యంతరం ఉండడమే అందుకు కారణం. ముందుగా వారిని ఒక తాటిపైకి తీసుకరావాలి. అవసరమైతే ప్రధాని అభ్యర్థిని ఎన్నికల అనంతరం ఎన్నుకునేందుకు సిద్ధపడాలి! అందుకు ప్రమాణాలను నిర్దేశించుకొని అందుకు కట్టుబడి పనిచేయాలి. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీలతో దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉన్న నేటి పరిస్థితుల్లోనే బీజేపీని కొట్టగలగాలి. లేకపోతే చేతులు కాలక తప్పదు.