
ఆదివారం బెంగళూరులో బీజేపీ నేతలు యడ్యూరప్ప, ఎస్‌ఎం కృష్ణను కలిసి మండ్య స్వతంత్ర ఎంపీ సుమలత. ప్రజలు కోరితే బీజేపీలో చేరతానని ఆమె అన్నారు.
సాక్షి, బెంగళూరు: మండ్య స్వతంత్ర ఎంపీ, నటి సుమలత అంబరీశ్ ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్పతో భేటీ అయ్యారు. మండ్య లోక్‌సభ ఎన్నికల్లో తనకు సహకరించి విజయాన్ని అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. బెంగళూరు ఈమేరకు బెంగళూరులో డాలర్స్ కాలనీలోని యడ్యూరప్ప నివాసంలో కలిసి చర్చలు జరిపారు. బీజేపీ సీనియర్ నాయకులు ఎస్‌ఎం కృష్ణ, ఆర్.అశోక్ తదితరులు కూడా చర్చలు పాల్గొనడం గమనార్హం. మండ్య ప్రజల నిర్ణయం మేరకు బీజేపీలో చేరాలా, వద్దా అనే నిర్ణయం తీసుకుంటానని ఆమె తెలిపారు.
బీజేపీలోకి వస్తే సంతోషం – యడ్డీ
యడ్యూరప్ప మాట్లాడుతూ మండ్య ప్రజ లు ఈసారి మార్పును కోరుకుని సుమ లతను గెలిపించడం ఆనందంగా ఉందన్నారు. ఏ పార్టీలో చేరాలనేది ఆమె నిర్ణ యమే అన్నారు. బీజేపీలోకి వస్తే సంతో షం, సాదరంగా ఆహ్వానిస్తామని, కేంద్రం లోని ఎన్డీయే కూటమికి మద్దతు ఇచ్చినా సంతోషమే అన్నారు. సుమలత సునామీ విజయంలో తాము కూడా భాగస్వాములు కావడం ఆనందంగా ఉందని చెప్పారు.
ప్రజాభీష్టం మేరకు
ఓటర్లకు సుమలత కృతజ్ఞతలు తెలిపారు. అయితే నియమ నిబంధనల ప్రకారం తాను ఏ పార్టీలోకి అధికారికంగా చేరకూడదన్నారు. మండ్య పార్లమెంటులోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి ఓటర్లకు కృతజ్ఞతలు చెబుతానని తెలిపారు. అప్పుడు ప్రజల నుంచి సలహాలు తీసుకుని ఏ పార్టీలో చేరాలనే నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు.