హోదాను సజీవంగానిలబెట్టింది జగన్‌ పార్టీనే.. | Suravaram Sudhakar Reddy Special Interview on Lok Sabha Election | Sakshi
Sakshi News home page

బాబు అవకాశవాది

Published Thu, Mar 28 2019 8:49 AM | Last Updated on Thu, Mar 28 2019 8:49 AM

Suravaram Sudhakar Reddy Special Interview on Lok Sabha Election - Sakshi

‘‘సుదీర్ఘ చరిత్ర ఉన్న కమ్యూనిస్టు పార్టీకి ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శిగా, పార్లమెంట్‌ సభ్యుడిగా, కార్మిక సమస్యలపై పార్లమెంటరీ స్థాయి సంఘం ఛైర్మన్‌గా పని చేసిన సురవరం సుధాకర్‌రెడ్డి.. మంచి చదువరి, వక్త. జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలపై పట్టున్న నేత. 15 ఏళ్ల ప్రాయంలోనే ఉద్యమాల బాట పట్టారు.  విద్యార్థి నాయకుడిగా అంచలంచెలుగా ఎదిగి ఆరేళ్లుగా సీపీఐ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు’’

‘ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్ష ప్రత్యేక హోదా. పార్లమెంటు సాక్షిగా ఆనాడు అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన మాట అది. ఆ తర్వాత కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ, టీడీపీలు ప్రజల హోదా ఆకాంక్షను మొగ్గలోనే చిదిమేశాయి. రాష్ట్ర ప్రజల ఆకాంక్షను గుర్తెరిగి వామపక్షాలు ఆందోళన చేశాయి. హోదా డిమాండ్‌ను సజీవంగా ఉంచింది మాత్రం జగన్‌ నాయకత్వంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ’  అని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి చెప్పారు. ఎన్నికల సందర్భంగా ‘సాక్షి’ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలపై తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. అవేమిటో ఆయన మాటల్లోనే..- ఆకుల అమరయ్య సాక్షి, విజయవాడ

తీవ్రమైన అవినీతి ఆరోపణలు
చంద్రబాబు నాయుడు పరిపాలనపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అధికార ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని, అధికారులను బెదిరిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. కొన్ని ప్రాజెక్టుల్లో అంచనాలు ఒకటికి రెండు సార్లు పెంచి కాంట్రాక్టర్లకు దోచి పెట్టారనే వ్యవహారంపై మా పార్టీ ఆందోళన చేసింది. రాజకీయంగా మేము పెట్టిన ప్రత్యామ్నాయానికి ప్రజలు మద్దతు ఇస్తే అధికారంలోకి అయినా రావాలి. లేదంటే శక్తివంతమైన ప్రతిపక్షంగానైనా ఎదగాలి. ఆంధ్రాలో మా ప్రయత్నం అది. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల కేసీఆర్‌ నెట్టుకువస్తున్నారు.

ఏపీలో టెక్నాలజీ దుర్వినియోగం
డేటా లీకేజీపై సమగ్ర విచారణ జరగాలి. ఎవరు లీక్‌ చేశారు, ఎక్కడికి వెళ్లిందీ, ఎవరు దుర్వినియోగం చేశారనేది బయటకు రావాలి. అసలు నిందితులు ఎవరో తేలాలి. వ్యక్తిగత గోప్యత, ఓట్ల తొలగింపు వంటి వాటి వల్ల ఎంత నష్టం వాటిల్లిందో కూడా అంచనా వేయాలి. దోషులెవరో తేల్చి వారిని శిక్షించాలి.  

హోదాను సజీవంగానిలబెట్టింది జగన్‌ పార్టీనే..
సీఎం చంద్రబాబు బీజేపీతో నాలుగున్నర ఏళ్ల పాటు కొనసాగి అవకాశవాదాన్ని ప్రదర్శించారు. ప్రజల ఒత్తిడికి ఆయన తలొగ్గి ఆలస్యంగానైనా కళ్లు తెరిచారు. ఇందులో ఆయన రాజకీయ ప్రయోజనాలు ఇమిడి ఉండవచ్చు. ప్రత్యేక హోదాను సజీవమైన నినాదంగా నిలబెట్టింది జగన్‌ పార్టీయే. హోదా రాష్ట్ర ప్రజల ఆకాంక్ష. ఇందుకోసం వామపక్షాలు మొదటి నుంచి బంద్‌లు, ఆందోళనలు చేస్తూ వచ్చాయి. ఆ తర్వాత పవన్‌ వచ్చాడు.

ఫిరాయించిన వారి సభ్యత్వం రద్దు కావాలి
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారు. తెలంగాణలోనూ అలాగే చేస్తున్నారు. ఈ విషయంలో బూర్జువా పార్టీల వారందరిదీ ఒకే తీరు. అందుకని మా డిమాండ్‌ ఏమిటంటే.. పార్టీ ఫిరాయించిన వారి సభ్యత్వం రద్దు కావాలి. ఆ మేరకు చట్టంలో సవరణ తీసుకురావాలి. ఆటోమాటిక్‌గా సభ్యత్వం రద్దు అయ్యేలా చూడాలి. స్పీకర్‌ నిర్ణయంతో నిమిత్తం లేకుండా ఎన్నికల సంఘానికైనా ఇవ్వాలి. లేదా నిర్ణీత గడువులోగా సభ్యత్వం రద్దు అయ్యేలా ఉండాలి. స్పీకర్లు అన్నిచోట్ల అధికార పక్షానికి నాయకులుగా పని చేశారే తప్ప స్పీకర్లుగా ఉండడం లేదు. ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం ఉప్పు లేని పప్పు లాంటిది.

ఎన్నికల్లో ప్రాధాన్య అంశాలు ఇవే
నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. 7.2 శాతానికి చేరింది. నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగాయి. వ్యవసాయ సంక్షోభం చాలా ప్రాధాన్యత కలిగిన అంశం. ఆ తర్వాత అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు. దేశవ్యాప్తంగా లక్షల మంది  కార్మికులు సమ్మె చేశారు. ఇవన్నీ చాలా ప్రధాన సమస్యలు. అలాగే దళితులు, మైనారిటీలపై దాడులు. ప్రస్తుత మోదీ ప్రభుత్వ హయాంలో ఈ వర్గాలపై దాడులు విపరీతంగా పెరిగాయి. గత ఆరు నెలల్లో దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ ఏదో ఒక మూల రైతులు పోరాటం చేస్తున్నారు. ఇవన్నీ ప్రభావం చూపిస్తాయి. ఒక దళితుణ్ని రాష్ట్రపతిని చేశారే తప్ప దళితులపై ఈ ప్రభుత్వానికి సానుకూల ధృక్పథం లేదు.

ఏకైక పెద్ద పార్టీగా బీజేపీ
కాంగ్రెస్‌తో చేదు అనుభవాలున్న మాట వాస్తవమే. వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచే పార్టీ బీజేపీ. ఆ తర్వాతి స్థానం కాంగ్రెస్‌ది. మిగతా పార్టీలన్నింటికీ కలిపి ఈ రెండింటి కన్నా ఎక్కువగా సీట్లు వస్తాయని భావిస్తున్నాం. తద్వారా కేంద్రంలో లౌకిక ప్రజాతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అంచనా.  

‘‘ప్రజల్లో ఉండే పోరాట స్ఫూర్తి పోదు. ఎన్నికలు వచ్చినప్పుడు ఆ ఆగ్రహాన్ని చూపిస్తారు. ప్రజల్ని ఇంతకాలం పట్టించుకోని ప్రభుత్వాలు.. ఎన్నికలకు ముందు తాయిలాలు ప్రకటిస్తున్నాయంటే  ఓడిస్తారనే కదా!’’

స్వేచ్ఛగా ఓటేయాలి
ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేయాలి. అందరూ ఓటింగ్‌కు వెళ్లాలి. ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టాలంటే శక్తివంతమైన ప్రతిపక్షం ఉండాలి. ప్రజాస్వామ్యపరిరక్షణ కోసం వామపక్షాలను, సెక్యులర్‌ పార్టీలను గెలిపించడం చాలా  ముఖ్యమని ఓటర్లకు సీపీఐ ప్రధాన కార్యదర్శిగా విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజా సమస్యలపై పోరాడే పార్టీలను ఆదరించమని తెలుగు రాష్ట్రాల ప్రజలను కోరుతున్నా!!

మా బలం తగ్గుతున్న మాట నిజమే
గత ఎన్నికల్లో వామపక్షాలు బాగా దెబ్బతిన్నాయి. అయితే మా పోరాటాలు, ఉద్యమాలు సాగుతూనే ఉన్నాయి. ఈసారి జరిగే ఎన్నికల్లో వామపక్షాల బలం గణనీయంగా పెరుగుతుంది. పార్లమెంటులో శక్తివంతమైన పాత్ర నిర్వహించగలుగుతామనే విశ్వాసం ఉంది. తెలంగాణకు మద్దతు ఇచ్చినా సీపీఐ ఎక్కడా బలం పుంజుకోలేక పోయిన మాట నిజమే. ఇదో తాత్కాలిక దశ మాత్రమే. ప్రత్యేక తెలంగాణకు మద్దతు ఇచ్చిన పార్టీలు చాలా ఉన్నా.. టీఆర్‌ఎస్, కేసీఆర్‌ను మాత్రమే తెలంగాణ తెచ్చిన పార్టీగా ప్రజలు గుర్తించారు. దీనివల్ల మిగతా పార్టీలకు నష్టం జరిగింది. రాబోయే రోజుల్లో మరిన్ని పోరాటాలు, ఉద్యమాల ద్వారా జరిగిన నష్టాన్ని పూడ్చుకుంటాం. ఇంతకన్నా ఎక్కువగా నష్టం జరిగిన రోజుల్ని కూడా మేము చూశాం.

రెయిన్‌ గన్లతో పరిష్కారం కాదు
గత ఎన్నికలకు ముందు చంద్రబాబు డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం, పెన్షన్లు వంటి అనేక హామీలు ఇచ్చినట్టు గుర్తు. టెక్నాలజీకి ప్రాధాన్యం పేరుతో చంద్రబాబు వ్యవసాయాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఈయన ఇచ్చే పది వేలతోనో, కేంద్రం ఇచ్చే రూ.6 వేలతోనో వ్యవసాయ సంక్షోభం పరిష్కారం కాదు. రెయిన్‌గన్లతోనో, అన్నదాత సుఖీభవ వంటి తాత్కాలిక పథకాలతో రైతుకు శాశ్వత పరిష్కారం లభించదు. లక్షల్లో అప్పుండే రైతుకు వేయి, రెండు వేలతో ఏమి జరుగుతుంది? స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేస్తేనే శాశ్వత పరిష్కారం లభిస్తుంది. రైతులకు గిట్టుబాటు ధర, సాగునీరు, మంచివిత్తనం, నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు ఇచ్చి రైతుల ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలి. కౌలు రైతుల సమస్య నిజంగా పెద్ద సమస్యే. కౌలుదారులు రిజిస్ట్రర్‌ కావడం లేదు. 2011లో చట్టాన్ని తీసుకువచ్చినా.. అమలు కావడం లేదు. రైతులకు, కౌలు రైతులకు ఇద్దరికీ డబ్బులు(రైతుబంధు పథకం నేపథ్యం) ఇవ్వాల్సి వస్తే పెద్ద మొత్తం అవుతుంది. అందుకని వాళ్లు ఆసక్తి చూపడం లేదు. కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తే తప్ప కౌలు రైతుల సమస్యకు పరిష్కారం లభించదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement