పట్నా : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సింహభాగం స్థానాల్లో జేడీయూ పోటీచేస్తుందని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు బిహార్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రశాంత్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ-జేడీయూ కూటమి మధ్య స్నేహాన్ని దెబ్బతీసేవిధంగా ఆయన వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. దీనిపై తాజాగా బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ స్పందించారు. ప్రశాంత్ వ్యాఖ్యలు విపక్షాలకు లబ్ధి చేకూర్చే విధంగా ఉన్నాయని, ఇలాంటి వాటిని కూటమి సమర్థించదని అన్నారు. (బీజేపీకి ప్రశాంత్ కిషోర్ అల్టిమేటం..!)
మంగళవారం పట్నాలో సుశీల్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఏ రాజకీయ ఎజెండా, సిద్ధాంతాలు లేకుండా కొంతమంది రాజకీయాల్లోకి వస్తారు. అధికార పార్టీని దెబ్బతీసేందుకు విపక్షాలకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఎన్నికల డేటాను సేకరించి విపక్ష పార్టీలకు చేరవేస్తూ రాజకీయంగా లబ్ధి చేస్తున్నారు. గడిచిన నాలుగేళ్ల కాలంలో బీజేపీ-జేడీయూ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. సీట్ల పంపకాలు గురించి పార్టీ అధినేతలు చర్చించి నిర్ణయం తీసుకుంటారు’ అని అన్నారు.
కాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో బిహార్ రాజకీయాలపై ప్రశాంత్ కిషోర్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకత్వం అంచనాలు వేస్తున్నట్లు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 50:50 సీట్ల పంపకాల ఒప్పందం కుదరదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో జేడీయూకే సింహాభాగం సీట్లు కేటాయించాలని అన్నారు. సీట్ల ఒప్పందంపై బీజేపీ నేతలు మరోసారి పునపరిశీలన చేసుకోవాలని సూచించారు. అలాగే 1:4 ఫార్మూలాను ఆయన తెరపైకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అధికార జేడీయూ మాత్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment