
వెనుక వైపు నడుస్తూ కలెక్టరేట్‌కు వస్తున్న మణిదన్
తిరువణ్ణామలై: వేలూరు నాట్రంబల్లి గ్రామానికి చెందిన మణిదన్ అనే స్వతంత్ర అభ్యర్థి తిరువణ్ణామలై కలెక్టరేట్‌కు కాలినడకన వెనుక వైపు నడుస్తూ తిరువణ్ణామలై పార్లమెంట్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి కలెక్టర్ కందస్వామి వద్ద అందజేసి ఎన్నికల నిబంధనలకు కట్టుబడి ఉంటానని కలెక్టర్ ఎదుట ప్రతిజ్ఞ చేశాడు. అనంతరం ఆయన బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడుతూ తా ను 26ఏళ్లుగా వెనుక వైపునే నడుస్తున్నానని పలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటివరకు 50 సార్లకు పైగా నామినేషన్ దాఖలు చేశానన్నారు.
గత పార్లమెంట్ ఎన్నికల్లోను వేలూరు పార్లమెంట్ స్థానంలో నామినేషన్ దాఖలు చేశానని అయితే డిపాజిట్ సొమ్ము చెల్లించకపోవడంతో నామినేషన్‌ను తిరస్కరించారన్నారు. తన దరఖాస్తులో కులం అనే వివరణ వద్ద మానవ కులమని రాసి ఇచ్చానన్నారు. అధికారుల సూచన మేరకు రూ. 25 వేలు నగదు డిపాజిట్ చెల్లించి నామినేషన్ వేసినట్టు తెలిపారు. ఇదిలాఉండగా వినూత్నంగా వెనుకవైపు నడుస్తూ కలెక్టరేట్‌కు వచ్చి నామినేషన్ దాఖలు చేసిన విషయం పలువురిని ఆశ్చర్యపరిచింది.