చెన్నై: ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఫలితాలతో తమిళనాడు రాజకీయం మళ్లీ వేడెక్కింది. దివంగత జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్‌లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన టీటీవీ దినకరన్ అనూహ్యంగా 40వేలకుపైగా మెజారిటీ ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు. జయలలిత మృతితో ఖాళీ అయిన ఈ నియోజకవర్గంలో విజయం ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. జయలలిత వారసులం తామేనంటున్న అధికార అన్నాడీఎంకే ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అటు జయ మృతి తర్వాత నాటకీయ పరిణామాలతో ఇరుకునపడిన శశికళ వర్గం కూడా ఈ ఎన్నికను చావో-రేవో అన్నట్టుగా తీసుకొని బరిలోకి దిగింది. ఈ క్రమంలో శశికళ వర్గానికి చెందిన టీటీవీ దినకరన్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి.. రాజకీయ పరిశీలకులు సైతం ఊహించనిరీతిలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అధికారంలో ఉన్నప్పటికీ అటు అన్నాడీఎంకేగానీ, ఇటు ప్రధాన ప్రతిపక్షం డీఎంకేగానీ దినకరన్‌కు గట్టిపోటీ ఇవ్వలేకపోయాయి.
ఈ విజయం శశికళ వర్గంలో కొత్త ఉత్తేజం నింపిందని చెప్పవచ్చు. జయ సొంత నియోజకవర్గం ఆర్కే నగర్‌లో పాగా వేయడంతో శశి వర్గం ఆనంద డొలికల్లో తేలియాడుతోంది. అమ్మ వారసురాలం తామేనని చెప్పుకోవడానికి ఈ విజయం ఉపకరిస్తుందని ఆ వర్గం భావిస్తోంది. ఈ విజయంతో సంబరాలు చేసుకుంటున్న శశి వర్గం కార్యకర్తలు.. అన్నాడీఎంకే అధ్యక్షుడు దినకరనే అంటూ నినాదాలు చేశారు. అటు దినకరన్ కూడా అన్నాడీఎంకే సర్కారు మూడు నెలల్లో కూలిపోతుందంటూ జోస్యం చెప్పారు. నిజానికి పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దినకరన్ వర్గం ఎప్పుడో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. పళనిస్వామి (ఈపీఎస్), పన్నీర్ సెల్వం (ఓపీఎస్) వర్గాల విలీనం నేపథ్యంలో ప్రవేశపెట్టిన ఈ అవిశ్వాస తీర్మానం ఇంతవరకు అసెంబ్లీలో చేపట్టలేదు. ఆర్కేనగర్ ఉప ఎన్నిక ఫలితాల నేపథ్యంలో ఈ అవిశ్వాస తీర్మానం తెరపైకివచ్చే అవకాశముందనే వాదన వినిపిస్తోంది. మరోవైపు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు దినకరన్ గూటికి చేరుతున్నట్టు కనిపిస్తోంది. ఆర్కేనగర్ ఉప ఎన్నికలో విజయం నేపథ్యంలో ఎమ్మెల్యే వట్రివేలు, ఎంపీ సెంగుట్టువన్ దినకరన్‌ను కలిసి అభినందనలు తెలిపారు. మరింతమంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు దినకరన్‌కు అండగా నిలబడితే.. పళనిస్వామి సర్కారు ఇబ్బందులు పడే అవకాశముందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment