తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే అధినేత జయలలిత మరణం తర్వాత అనేక మలుపులు తిరుగుతున్న తమిళనాడు రాజకీయాల్లో ఆర్‌కే నగర్ ఉప ఎన్నిక ఫలితం సహజంగానే ప్రకంపనలు సృష్టిస్తోంది. అక్కడ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన టీటీవీ దినకరన్ భారీ మెజారిటీతో గెలుపొందడం అధికార అన్నాడీఎంకేకు మాత్రమే కాదు... ప్రధాన ప్రతిపక్షం డీఎంకేకు కూడా ఊహించని పరిణామమే. అలాగే తెరవెనక ఉంటూ రాష్ట్ర రాజకీయాలను శాసి స్తున్నదని పేరుబడ్డ బీజేపీ అధిష్టానానికి సైతం ఇది షాక్. జయలలిత మరణా నంతరం ఆమె సన్నిహితురాలు శశికళ ముఖ్యమంత్రి కావాలని ఆశించి అప్పటి సీఎం పన్నీర్ సెల్వంతో రాజీనామా చేయించడం... సీఎం పదవి చేతికందేలోపే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమెకు శిక్షపడటం, అనంతరం ఆ వర్గానికి చెందిన పళనిస్వామి ముఖ్యమంత్రి కావడం చకచకా జరిగాయి. కానీ శశికళ మేన ల్లుడు దినకరన్ రంగ ప్రవేశం తర్వాత పళనిస్వామి, పన్నీర్‌సెల్వం వర్గాలు ఏకమై ఆయన్ను ఏకాకిని చేశాయి. ఆ తర్వాత దినకరన్‌ను కేసులు చుట్టు ముట్టాయి. ఇన్ని ప్రతికూలతల మధ్య ఆర్‌కే నగర్ ఓటర్లు ఆయనకు రాజకీ యంగా ఊపిరిపోశారు.
తమిళనాడు రాజకీయం విలక్షణమైనది. నాలుగు దశాబ్దాలుగా అక్కడ రెండు పార్టీల వ్యవస్థే రాజ్యమేలుతోంది. జయలలిత మరణం, శశికళ జైలు కెళ్లడం పర్యవసానంగా అన్నా డీఎంకేకు చెప్పుకోదగ్గ నాయకత్వం లేదు గనుక అది కనుమరుగవుతుందని డీఎంకే ఆశించింది. దినకరన్ జయలలిత అను గ్రహాన్ని కోల్పోయి పార్టీకి దూరంగా ఉండిపోయిన వ్యక్తి. కనుక జయ వారసు డిగా ఆయన్ను ఓటర్లు పరిగణనలోకి తీసుకోరని డీఎంకే భావించింది. ఇక దినకరన్‌పై వచ్చిపడిన కేసులు సరేసరి. పైగా ఎవరికీ పరిచయం లేని ప్రెషర్ కుక్కర్ గుర్తుతో ఆయన బరిలో నిలిచారు. వీటన్నిటినీ ఆర్‌కే నగర్ ఓటర్లు తోసి రాజన్నారు. ఎప్పుడూ జయలలిత కూడా సాధించనంత మెజారిటీ దినకరన్‌కు ఇచ్చారు. ఆయనకు 40,707 ఓట్ల మెజారిటీ వచ్చింది. పోలైన ఓట్లలో 50 శాతం పైగా ఓట్లు ఆయనవే కావడం, డీఎంకే సైతం డిపాజిట్ కోల్పోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ధారాళంగా డబ్బు ఖర్చు పెట్టడం వల్లే ఆయన గెలిచారని ప్రత్యర్థులు ఆరోపించవచ్చుగానీ... ఆ పని అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేలు చేసి ఉండవని ఎవరూ అనుకోరు. మొత్తానికి తాము జయలలిత వారసులమని చెప్పుకున్న ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంలకు ఈ ఉప ఎన్నికలో ఆదరణ దొరకలేదు. వచ్చే మూడు నెలల్లో ఈ ప్రభుత్వం కూలిపోతుందని దినకరన్ చెబుతున్నారు. అది జరిగినా, జరగకపో యినా పళని ప్రభుత్వం ఇబ్బందులు పడటమైతే తప్పకపోవచ్చు. ఎందుకంటే మొన్న సెప్టెంబర్‌లో ఆయన ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కొనవలసిన తరుణంలో దినకరన్ వర్గంలోని 18మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను స్పీకర్ ధన్‌పాల్ అన ర్హులుగా ప్రకటించారు. వారి పిటిషన్ స్వీకరించిన మద్రాస్ హైకోర్టు బలపరీక్షను నిలుపుచేసింది. ఇప్పుడా బలపరీక్ష జరిగినా, వారి అనర్హత సబబేనని తీర్పు వెలు వడి ఉప ఎన్నికలొచ్చినా పళని సర్కారుకు సమస్యలు తప్పవు. ఇవిగాక స్థానిక ఎన్నికల బెడద ఒకటి ఉంది.
ఈ ఉప ఎన్నిక అనేకమంది ఆశల్ని అడియాసలు చేసింది. పళనిస్వామి– పన్నీర్‌సెల్వం వర్గాలను ఏకం చేయడంలో విజయం సాధించిన బీజేపీ అధినా యకులు... వీరిద్దరి సాయంతో భవిష్యత్తులో రాష్ట్రంలో కాలు మోపవచ్చునని ఆశపడ్డారు. ఈ నేతలిద్దరి చేతగానితనమూ అడుగడుగునా కనబడుతూనే ఉన్నా జయలలిత వారసులుగా జనం వారినే గుర్తిస్తారని, కేసుల్లో ఇరుక్కున్న దినకర న్‌కు ఆదరణ ఉండదని వారు భావించారు. ఇదంతా ఇప్పుడు తలకిందులైంది. పైగా బరిలో నిలిచిన తమ పార్టీ అభ్యర్థికి కేవలం 1,417 ఓట్లు రావడం బీజేపీ నేతలను దిగ్భ్రాంతికి గురిచేసింది. అలాగే పార్టీలో తన వర్గానికి ప్రాధాన్యం దక్కటం లేదన్న అసంతృప్తితో ఉన్న డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వానికి కూడా ఈ ఉప ఎన్నిక ఫలితం విఘాతమే. విలీనమై నాలుగు నెలలు కావస్తున్నా పన్నీర్‌కు డిప్యూటీ సీఎంతోపాటు రాజకీయ సమన్వయకర్త పదవి రావడం మినహా ఆయన వర్గీయులకు దక్కిందేమీ లేదు. తమ వర్గానికి చెందిన మధుసూదన్ ఈ ఉప ఎన్నికలో విజయం సాధిస్తే ప్రాబల్యం పెరుగుతుందని, అప్పుడు పదవుల కోసం గట్టిగా ఒత్తిడి తీసుకురావొచ్చునని పన్నీర్ వర్గం ఆశపడింది. ఇందులో కులం కోణం కూడా ఉంది. పన్నీర్ తీవర్ కులస్థుడు. పళనిస్వామి గౌండర్. జయ లలిత వద్ద శశికళ ప్రాబల్యం పెరిగిననాటినుంచీ పార్టీలో తీవర్‌లదే ఆధిపత్యం. తమ కులస్తుడు గనుక చెప్పుచేతల్లో ఉంటాడన్న భావనతోనే జయ మరణా నంతరం శశికళ పన్నీర్‌కు మద్దతిచ్చారు. తీరా ఆయన ఎదురు తిరగడంతో గౌండర్ కులస్తుడైన పళనిస్వామిని అందలం ఎక్కించారు. ఇప్పుడు పళని, పన్నీ ర్‌లు ఏకమైనా పార్టీలో తమ ఆధిపత్యం పోయిందన్న దిగులు తీవర్‌లను బాధి స్తోంది. మధుసూదన్ గెలుపు ఈ సమస్యను తీరుస్తుందని పన్నీర్ వర్గం ఎంత గానో ఆశపెట్టుకుంది. అటు పళనిస్వామికి సైతం ఈ ఎన్నిక అగ్ని పరీక్షగా మారింది.
జయలలిత సొంత స్థానంలో, రెండాకుల గుర్తు తమకే వచ్చినా నెగ్గక పోతే అది రాజకీయంగా సమాధి అవుతుందని గ్రహించి ఆయన తన శక్తిమేరకు కష్టపడ్డారు. కానీ అదంతా బూడిదలో పోసిన పన్నీరైంది. రాష్ట్రంలో ఇక ఎదురు లేదని... ఎప్పుడు ఎన్నికలొచ్చినా అధికారం తనదే అని భావిస్తున్న డీఎంకేకు ఇప్పుడు డిపాజిట్ గల్లంతు కావడం మింగుడు పడని విషయం. పైగా దినకరన్ శశికళ పేరు చెప్పుకుని, ఆమె ఫొటో పెట్టుకుని ప్రచారం చేసి గెలిచారు. ఇది ఆర్‌కే నగర్‌లో కనబడిన ధోరణా లేక రాష్ట్రంలో గాలి మళ్లిందా అన్న అయోమయం డీఎంకేను చుట్టుముట్టింది. రాగలకాలంలో దినకరన్ గెలుపు తమిళ రాజకీయా లను మరెన్ని మలుపులు తిప్పుతుందో చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment