వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ కార్యాలయం ఎదుట ఆ పార్టీ జెండాలను తగలబెడుతున్న వరదరాజులురెడ్డి అనుచరులు, గుంటూరు జిల్లా బాపట్లలో టీడీపీ నేత నరేంద్రవర్మరాజు అనుచరుల నిరసన బైక్ ర్యాలీ
సాక్షి, అమరావతి: నలభైయేళ్ల అనుభవం నవ్వుల పాలయ్యింది. లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలో తడబడింది. కొన్నిచోట్ల అభ్యర్థులను మార్చే పరిస్థితి ఏర్పడింది. కొందరు సీనియర్ల బెదిరింపులకు లొంగిపోయి వారు కోరిన విధంగా సీట్లు కేటాయించాల్సి వచ్చింది. ఎలా గోలా ఆ ప్రక్రియ ముగించామనుకుంటే మంగళవారం అసమ్మతి భగ్గుమంది. టీడీపీ సీట్లు దక్కించుకోలేని కొందరు అధినేత చంద్రబాబుపై ఆగ్రహోదగ్రులవుతూ తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. అభ్యర్థులుగా ఎంపికైన కొందరు.. ఓటమి భయంతో ‘మేము పోటీ చేయం.. ‘బాబో’య్’ అంటున్నారు. 40 ఏళ్ల అనుభవజ్ఞుడినని పదేపదే చెప్పుకునే చంద్రబాబును.. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం ఒకవైపు, టీడీపీలో ధిక్కార స్వరం, పలాయనవాదం మరోవైపు గతంలో ఎన్నడూలేని విధంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
అసమ్మతి సెగలు
చంద్రబాబు చేసిన అభ్యర్థుల ఎంపిక వ్యవహారం నేతలు, వారి అనుయాయుల ఆందోళనలు, రాజీనామాలతో మంగళవారం అధికార పార్టీలో అలజడి చెలరేగింది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో వంగలపూడి అనితకు సీటు ఇవ్వడంపై ఆగ్రహంతో అక్కడి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు పార్టీకి రాజీనామా చేశారు. తన పసుపు చొక్కాను తీసివేసి నల్ల శాలువా కప్పుకుని నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించుకున్నారు. నరసాపురంలో టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ జెడ్పీటీసీ చాగంటి సత్యనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. నిడదవోలులో సిట్టింగ్ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు మళ్లీ సీటివ్వడంపై ఆ పార్టీ నేతలు కందుల సత్యనారాయణ, ఆయన సోదరుడు వేణుగోపాలకృష్ణలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. శేషారావును ఓడించడమే ధ్యేయమని తమ అనుచరులతో నిర్వహించిన సమావేశాల్లో స్పష్టం చేశారు.
చింతలపూడి సీటును తనకివ్వకుండా చింతమనేని ప్రభాకర్, మాగంటి బాబు అడ్డుపడ్డారని, తనను మోసం చేశారని మాజీ మంత్రి పీతల సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. రెబెల్‌గా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. నర్సాపురం సీటును తనకిస్తానని చివరి నిమిషం వరకు చెప్పి చంద్రబాబు మోసం చేశారన్న ఆగ్రహంతో కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ఆ పదవికి రాజీనామా చేశారు. రెబల్‌గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. పోలవరం సీటు తనకివ్వకుండా బొరగం శ్రీనివాస్‌కివ్వడం దారుణమని సిట్టింగ్ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ అసంతృప్తితో రగిలిపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు సీటు తనకుకాకుండా తనతోపాటు తిరిగిన రాజాకు ఇవ్వడంతో అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ సీటును శివానందరెడ్డికివ్వడంతో అక్కడి సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డి తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని తొలుత ప్రకటించినా జనసేనలో చేరే ఆలోచన కూడా చేస్తున్నట్టు సమాచారం. కర్నూలు అర్బన్ సీటును తనకు కాకుండా టీజీ భరత్‌కివ్వడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎస్వీ మోహన్‌రెడ్డి రగిలిపోతున్నారు. చంద్రబాబు తనను మోసం చేశారని వాపోతూ భరత్‌ను ఓడిస్తానని శపథం చేశారు. మంగళవారం చంద్రబాబు కర్నూలులో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి కోడుమూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మణిగాంధీ, ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి డుమ్మా కొట్టారు.
దర్శి, ప్రొద్దుటూరులో ఆందోళనలు
ప్రకాశం జిల్లా దర్శి సీటును కదిరి బాబూరావుకివ్వడాన్ని మంత్రి శిద్ధా రాఘవరావు వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలకు దిగింది. తన సిట్టింగ్ స్థానాన్ని తన కుమారుడు సుధీర్‌కివ్వాలని మంత్రి శిద్ధా రాఘవరావు డిమాండ్ చేస్తున్నారు. తన డిమాండ్‌ను పట్టించుకోకపోతే ఒంగోలు ఎంపీగా తాను పోటీ చేయలేనని ఆయన హెచ్చరిస్తున్నారు. బాబూరావు తాను ఇక్కడ పోటీ చేయనని, కనిగిరిలోనే రెబల్‌గా పోటీ చేస్తానని అధిష్టానానికి స్పష్టం చేశారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు సీటును లింగారెడ్డికివ్వడంతో మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి అనుచరులు భీభత్సం సృష్టించారు. ప్రొద్దుటూరులోని నెహ్రూ రోడ్డులో ఉన్న టీడీపీ కార్యాలయం ఎదుట పార్టీ జెండాలు, ఫ్లెక్సీలను పెట్రోల్ పోసి తగులపెట్టారు. చంద్రబాబు డౌన్ డౌన్, సీఎం రమేష్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతపురం అర్బన్ సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికివ్వడంపై ఆయన వ్యతిరేకవర్గం భగ్గుమంది. చౌదరిని ఓడిస్తామని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ సీటును బలిజలకు కేటాయించనందుకు నిరసనగా ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తామని కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లా వెంకటేశ్వరరావు ప్రకటించారు. శింగనమల సీటును సిట్టింగ్ ఎమ్మెల్యేనైన తనకివ్వకుండా జేసీ సూచించిన బండారు శ్రావణికి కేటాయించడంపై యామినీబాల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణదుర్గం సీటును మళ్లీ తనకివ్వకపోవడంతో హనుమంతరాయచౌదరి ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
టీడీపీకి బ్రాహ్మణయ్య కుమారుడు రాజీనామా
కృష్ణాజిల్లా అవనిగడ్డలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ ముఖ్య నేత, మాజీ ఎంపీ అంబటి బ్రాహ్మణయ్య కుమారుడు అంబటి శ్రీహరిప్రసాద్ పార్టీకి రాజీనామా చేసి మంగళవారం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. తిరువూరులో మంత్రి జవహర్ అభ్యర్థిత్వాన్ని ఒప్పుకునేది లేదని స్వామిదాస్ వర్గీయులు ఆందోళనకు దిగారు. గుంటూరు జిల్లా మాచర్ల సీటును అంజిరెడ్డికివ్వడంపై చలమారెడ్డి వర్గం ఆగ్రహంతో ఊగిపోతోంది. ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. అంజిరెడ్డిని మార్చకపోతే మాచర్లలో టీడీపీని ఓడిస్తామని హెచ్చరిస్తూ వీరంగం సృష్టించారు. రాజధాని పరిధిలోని తాడికొండ సీటు మళ్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌కివ్వడంపై అసమ్మతి వర్గం నేత, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు రాజీనామాకు సిద్ధమయ్యారు. బాపట్ల ఎంపీ సీటు ఇస్తానని రక్షణ శాఖ సంయుక్త కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న ఎలీషాను వాలంటరీ రిటైర్‌మెంట్‌కు ప్రోత్సహించి మరీ తీసుకొచ్చిన చంద్రబాబు.. చివరకు మొండిచేయి చూపడంతో ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ టీడీ జనార్థన్ చక్రం తిప్పి ఎలీషాకు సీటు రాకుండా చేయడంతో ఉద్యోగాన్ని వదులుకుని వచ్చిన ఆయన పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.
మరోవైపు ‘‘తెలుగుదేశం పార్టీ నన్ను నమ్మించి గొంతు కోసింది. బాపట్ల అసెంబ్లీ టిక్కెట్ ఇస్తామని చెప్పి రూ.12 కోట్లు ఖర్చు పెట్టించారు...రేపు...మాపు అంటూ తిప్పించుకుని మోసం చేశారు’’ అంటూ టీడీపీ నేత వేగేష్ణ నరేంద్రవర్మరాజు మండిపడుతున్నారు. ఆయన అనుచరులు మంగళవారం మున్సిపల్ కార్యాలయం సెంటర్‌లో రాస్తారోకో చేపట్టారు. విశాఖపట్నం జిల్లా భీమిలి సీటును కేటాయించడంపై మాజీ ఎంపీ సబ్బం హరి మండిపడుతున్నారు. తాను ఎంపీ సీటు అడిగితే ఎమ్మెల్యే సీటివ్వడమేంటని ఆయన సీఎంను కలసి నిరసన వ్యక్తం చేశారు. విజయనగరం అర్బన్ సీటును అశోక్‌గజపతి రాజు కుమార్తెకు ఇవ్వడంపై ఆగ్రహంతో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీత రెబల్‌గా నామినేషన్ వేస్తానని ప్రకటించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో కిమిడి మృణాళిని కుమారుడికి సీటివ్వడాన్ని వ్యతిరేకించి ఆ పార్టీ సీనియర్ నాయకుడు కె.త్రిమూర్తులరాజు రెబల్‌గా నామినేషన్ దాఖలు చేశారు. గజపతినగరం సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పలనాయుడికివ్వడంపై ఆయన సోదరుడు కొండబాబు వ్యతిరేకించి రెబల్‌గా నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు.
మీ సీటు మాకొద్దు బాబూ
మరోవైపు వైఎస్సార్‌సీపీ ప్రభంజనం నేపథ్యంలో ఓటమి భయంతో.. ఎన్నికలకు ముందే కొందరు సిట్టింగ్‌లు తాము పోటీ చేయలేమని చేతులెత్తేయగా, కొందరు సీట్లు కేటాయించిన తర్వాత రేసులో నిలబడలేమని వెనక్కివెళ్లిపోతుండడం చంద్రబాబుకు మింగుడు పడటం లేదు. కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే సీటును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన బుడ్డా రాజశేఖర్‌రెడ్డికి చంద్రబాబు కేటాయించారు. ఒకరోజు ప్రచారం నిర్వహించిన బుడ్డా ఆ తర్వాత చేతులెత్తేసి తాను పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. అదే జిల్లాకు చెందిన బనగానపల్లి అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే బీసీ జనార్థన్‌రెడ్డి కూడా పోటీ చేసేందుకు వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం.
నియోజకవర్గంలో ఆయనకు మద్ధతు తెలిపే కీలక నాయకులు, చివరికి ఆయన స్వగ్రామంలో ఆయన వెంట ఉండే వందలాది కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరడంతో తాను పోటీ చేసినా ఫలితం ఉండదని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే డీకే సత్యప్రభకు రాజంపేట ఎంపీ సీటు కేటాయించగా.. తనకొద్దని ఆమె చంద్రబాబుకు స్పష్టం చేశారు. ఈ విషయం రెండురోజుల ముందే చెప్పినా అక్కడ పోటీ చేసేందుకు ఎవరూ ముందుకురావడం లేదని, మీరు పోటీ చేయాల్సిందేనని చెప్పినట్టు సమాచారం. అయినా ఆమె అంగీకరించలేదు. అయినప్పటికీ ఎంపీ అభ్యర్థుల జాబితాలో తన పేరును ప్రకటించడంపై సత్యప్రభ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒత్తిళ్లకు లొంగిన బాబు
వాస్తవానికి అభ్యర్థులను ఎంపికలోనే చంద్రబాబు తడబాటుకు గురయ్యారు. సర్వేల్లో ప్రజామోదం ఉన్న వారికి, గెలుపు గుర్రాలకు మాత్రమే సీట్లిస్తానని చెప్పిన ఆయన చివర్లో అవేమీ పరిగణనలోకి తీసుకోకుండానే కొందరు అభ్యర్థులను ప్రకటించేశారు. ప్రకటించిన జాబితాలోని కొందరు అభ్యర్థులను మార్చారు. సర్దుబాట్లు చేశారు. గుంటూరు జిల్లా తాడికొండ అభ్యర్థిగా బాపట్ల సిట్టింగ్ ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రిని ప్రకటించగా స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌కే సీటివ్వాలని ఆయన అనుచరవర్గం ఆందోళనలు చేయడంతో ఆ స్థానాన్ని మళ్లీ శ్రావణ్‌కే ఇస్తూ జాబితాలో మార్పు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజుకు ఇచ్చి ఒత్తిళ్ల నేపథ్యంలో తర్వాత మార్చారు. శివరామరాజును నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా మార్చి ఆయన స్థానంలో రామరాజును ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. ప్రకాశం జిల్లా దర్శి అసెంబ్లీ సీటును తన బావమరిది బాలకృష్ణ ఒత్తిడితో కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావుకు కేటాయించారు. విశాఖపట్నం ఎంపీ స్థానాన్ని కూడా బాలయ్య ఒత్తిడితోనే భరత్‌కు కేటాయించారు.
అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తాను చెప్పిన వారికి సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. అనంతపురం ఎంపీగా తన స్థానంలో తన కుమారుడు పవన్, తాడిపత్రి ఎమ్మెల్యేగా తన సోదరుడు ప్రభాకర్ స్థానంలో ఆయన కొడుకు అస్మిత్‌కు సీట్లివ్వాలని ఒత్తిడి చేసి సాధించుకున్నారు. ఇవికాకుండా శింగనమల, కళ్యాణదుర్గం సీట్లను కూడా తాను చెప్పిన వారికే ఇవ్వాలని జేసీ పట్టుబట్టారు. దీంతో ఈ రెండు చోట్లా సిట్టింగ్ ఎమ్మెల్యేలు యామినీబాల, హనుమంతరాయచౌదరిలను పక్కనపెట్టి జేసీ చెప్పిన బండారు శ్రావణి, ఉమామహేశ్వరనాయుడికి సీట్లు ఇచ్చారు. నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావుకు మళ్లీ ఎంపీ సీటు ఇవ్వకూడదని నిర్ణయించినా ఆయన బ్లాక్‌మెయిల్‌కు దిగడంతో ఆయనకే ఇచ్చారు. విజయనగరం అర్బన్ సీటును కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పట్టుబట్టడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీతను పక్కకు తప్పించి ఆయన కుమార్తె అతిథికి కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment