సాక్షి, గుంటూరు : ‘హవ్వ.. మరీ ఇంత కక్కుర్తా.. డబ్బు కోసం ఇంతకు దిగజారాలా.. పేదవాడి నోటి కాడ కూడును కూడా లాగేసుకుంటారా.. అన్న క్యాంటిన్‌లలోని భోజనం తరలించి సొమ్ము చేసుకుంటారా..’ అంటూ టీడీపీ నేతల వైఖరి చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లిలో ముఖ్య నేత తనయుడు, తనయ.. అన్న క్యాంటిన్‌లో భోజనాలను కూడా అమ్ముకుంటున్న దిగజారుడుతనాన్ని చూసి ఆ రెండు నియోజకవర్గాల ప్రజలు విస్తుపోతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో టీడీపీ నేతల దౌర్జన్యాలు, అరాచకాలు తార స్థాయికి చేరాయి. మరీ ముఖ్యంగా నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో అయితే ముఖ్య నేత కుమారుడు, కుమార్తెల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయింది.
వీరి కన్ను ఇప్పుడు అన్న క్యాంటిన్‌లపైనా పడింది. అన్న క్యాంటిన్‌లలో రూ.5కే భోజనం పెడుతున్న విషయం తెలిసిందే. అయితే వీటిని ముఖ్యనేత కుమార్తెకు చెందిన ఓ వ్యాపార సంస్థకు మధ్యాహ్నం 150, సాయంత్రం 150 చొప్పున రోజుకు 300 భోజనాలను చేరవేస్తున్నారు. అన్న క్యాంటిన్‌లకు ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదు. పోనీ తమ కంపెనీలో పనిచేసే కార్మికులకైనా ఉచితంగా భోజనాలు పెడుతున్నారా అంటే అదీ లేదు.. ఒక్కో భోజనానికి కార్మికుల వద్ద నుంచి రూ.25 వసూలు చేస్తున్నట్టు సమాచారం. దీన్ని బట్టి రోజుకు భోజనాల ద్వారా కార్మికుల నుంచి రూ.7,500 చొప్పున నెలకు రూ.2.25 లక్షలు.. దోచేస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పేదలకు పెట్టే అన్నంలోనూ అంత కక్కుర్తి అవసరమా అంటూ ముఖ్యనేత కుటుంబ సభ్యులపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
కే ట్యాక్స్ కట్టాల్సిందే..
సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో అపార్ట్‌మెంట్‌ల నిర్మాణం, వ్యాపార సముదాయాల విస్తరణ పూర్తిగా నిలిచిపోయిందంటే వీరు ఏ స్థాయిలో ‘కే’ (వారి ఇంటి పేరు) ట్యాక్స్ వసూలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్‌టీపై విమర్శలు చేస్తున్న అధికార పార్టీ నేతలు.. రాజ్యాంగ బద్ధమైన పదవిలో కొనసాగుతున్న ముఖ్యనేత కొడుకు, కూతురు ప్రజలపై విధిస్తున్న కే ట్యాక్స్‌పై నోరు మెదపలేకపోతున్నారు. ఇవేకాకుండా పేకాట, క్రికెట్ బెట్టింగ్, మట్కా, గుట్కా, ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్న వారి నుంచి కూడా మామూళ్లు వసులుచేస్తున్నారు. చివరికి వారు తమ పార్టీ వారైనా సరే వదిలిపెట్టడం లేదు. ఈ విషయమై ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోవడంతో బాధితులు మిన్నకుండిపోతున్నారు. రేషన్ మాఫియా దగ్గర నుంచి భూ కబ్జాల వరకూ దేన్నీ వదలడం లేదు. చివరకు కోటప్ప కొండ పండుగను సైతం తమ ధన దాహానికి వాడుకుని త్రికోటేశ్వరుని పవిత్రతకు భంగం కలిగించారు. తమ అనుచరుల ద్వారా కోడి పందాలు, గ్యాంబ్లింగ్, కోత ముక్కాటలను నిర్వహించి జనం వ్యసనాన్ని ఆసరాగా చేసుకుని వారి జేబులు నింపుకొన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే నాలుగున్నరేళ్లలో వీరు చేసిన అవినీతి దందా వెయ్యి పేజీల పుస్తకమవుతుందని స్థానికులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment