
రంగనాథస్వామివారి ఆలయం తూర్పు రాజగోపురం వద్ద ఏర్పాట్లు చేసిన ఫ్లెక్సీలు
సాక్షి, నెల్లూరు(బృందావనం): భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు, ఆలయ పవిత్రతకు తెలుగు తమ్ముళ్లు తిలోదకాలిచ్చారు. సింహపురి క్షేత్రపాలకుడు శ్రీదేవి, భూదేవి సమేత తల్పగిరి రంగనాథస్వామివారి రాజగోపురాన్ని దేవదాయ, ధర్మాదాయశాఖ నిబంధనలకు నీళ్లొదిలి, ప్రభుత్వ ఉత్తర్వులను, రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాల తీర్పును అగౌరవ పరుస్తూ నూతన పాలకమండలి సభ్యుల చిత్రాలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో రంగడి రాజగోపురాన్ని కప్పేశారు. దీంతో స్వామివారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రెండు రోజుల క్రితం నూతన పాలక మండలి బాధ్యతలను స్వీకరించింది. ఈ సందర్భంగా ఆదివారం స్వామివారి కల్యాణ మండపం వద్ద అభినందన సభ నిర్వహించదలిచారు. దీంతో స్వామివారి తూర్పున ఉన్న రాజగోపురం ఇరువైపులా ధర్మకర్తల మండలి సభ్యురాలి చిత్రాలతో మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, టీడీపీ ఇతర నాయకుల చిత్రాలతో రథం వద్ద నుంచి కల్యాణ మండపం వరకు ఇరువైపు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రంగడి రాజగోపురం ఎదురుగా త్రిదండి రామానుజాచార్యుల వారి విగ్రహం పక్కన ఫ్లెక్సీలను కట్టా రు. గత పాలకమండలి సాక్షాత్తు త్రిదండి రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆలయ పవిత్రతకు ఎటువంటి భంగం కలుగకుండా ఉత్సవాల ఫ్లెక్సీలను సైతం ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు అంగీకరించలేదు.
తూర్పు రాజగోపురాన్ని ఆ పాలకమండలి సొంత నిధులతో శాండ్‌బ్లాస్టింగ్ చేయించి గోపురం అసలు రూపం వెలుగు చూసేలా చర్యలు తీసుకున్నారు. అయితే రెండు రోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన నూతన పాలకమండలి మాత్రం అభినందనసభ నిర్వహిస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా దేవదాయ, ధర్మాదాయశాఖ నిబంధనలను తుంగలోతొక్కి సాక్షాత్తు పాలకమండలి సభ్యుల చిత్రాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై భక్తులు విస్మయంతోపాటు అధికారపార్టీ నాయకులు తీరుతెన్నులను ఏవగించుకుంటున్నారు. దేవదాయశాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథస్వామివారి ఆలయం ఎదురుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు
Comments
Please login to add a commentAdd a comment