ప్రచారం చేయకూడదని రచ్చ చేస్తున్న నాని బంధువులు
చిత్తూరు, పాకాల : తమ గ్రామంలో వైఎస్సార్ సీపీ తరఫున ఎవరూ ప్రచారం చేయరాదంటూ అడ్డుకున్న సంఘటన చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నాని స్వగ్రామమైన పులివర్తివారిపల్లెలో చోటుచేసుకుంది. సాక్షాత్తు పులివర్తి నాని వదిన సునీతమ్మ, వైఎస్సార్ సీపీ నాయకులను గ్రామంలోకి రాకుండా నాని బంధువులు , అనుచరులు అడ్డుకున్నారు. దౌర్జన్యానికి తెగబడ్డారు. ఈ ఘటనను సెల్‌ఫోన్లలో చిత్రీకరించే ప్రయత్నం చేసిన వారి సెల్‌ఫోన్లను పగులగొట్టారు. వివరాలు..
పులివర్తివారిపల్లిలో ప్రచారం కోసం వెళ్లిన ఎమ్మెల్యే వదిన సునీతమ్మ, మహిళలను దూషిస్తూ, దూసుకొస్తున్న నాని అనుచరులు
అయితే శుక్రవారం పులివర్తివారిపల్లెకు వైఎస్సార్‌సీపీ తరఫున నాని వదిన సునీతమ్మ, వైఎస్సార్‌సీపీ నాయకురాళ్లతో వెళ్లారు. వారి రాకను గమనించిన నాని బంధువులు, అనుచరులు వారిని గ్రామంలోకి రానీయకుండా అడ్డుకున్నారు. ప్రచారం అంటూ గ్రామంలోకి వస్తే తిరిగి వెళ్లరని హెచ్చరించారు. వారిని పరుష పదజాలంతో దూషించారు. ఈ దృశ్యాలను కొందరు సెల్‌ఫోన్లలో చిత్రీకరించడానికి ప్రయత్నిస్తే సెల్‌ఫోన్లను కూడా ధ్వంసం చేశారు. మహిళలపై దాడులకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని సునీతమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
తుమ్ములగుంటలో ప్రచారం చేస్తున్న నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి (ఫైల్)
వాస్తవానికి నాలుగురోజుల క్రితం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్వగ్రామమైన తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధ ప్రచారం చేశారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రచారం చేసినా అది వారి హక్కుగా భావించి గ్రామస్తులుగానీ, వైఎస్సార్ సీపీ నాయకులుగానీ ఆక్షేపించలేదు. అక్కడ అంత మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తే, పులివర్తివారిపల్లెలో మాత్రం నాని బంధుగణం రెచ్చిపోయి, దౌర్జన్యం చేయడం విమర్శలకు తావిచ్చింది. అలాగే, తాటిమాకులపల్లెలో నాని అనుచరులు మద్యం మత్తులో వైఎస్సార్ సీపీ ప్రచారాన్ని అడ్డుకున్నారు. సమాచారమివ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని అడ్డుకున్న వారిని తీవ్రంగా హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment