
సాక్షి, అమరావతి: ఈనెల 27వతేదీ నుంచి నిర్వహించాల్సిన మహానాడును రద్దు చేయాలని టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు సమాచారం. మంగళవారం ఉండ వల్లిలోని తన నివాసంలో మంత్రివర్గ సమావేశానికి ముందు మంత్రులతో ఆయన మహానాడు నిర్వహణపై మంతనాలు జరిపారు. ఈనెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్న దృష్ట్యా మహానాడు నిర్వహించడం కష్టమని పలువు రు మంత్రులు పేర్కొనగా చంద్రబాబు సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని తెలిసింది. మహానాడు బదులుగా ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఫలితాలపై భయంతోనే?
ఏటా మే 28వ తేదీన ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మూడు రోజుల పాటు టీడీపీ మహానాడు నిర్వహించడం ఆనవాయితీ. 2014 ఎన్నికల ఫలితాల తర్వాత కూడా మహానాడు నిర్వహించారు. ఈసారి ఫలితాల సాకుతో దీన్ని రద్దు చేసుకోవడానికి కారణం గెలుపుపై భరోసా లేకపోవడమేనని చెబుతున్నారు. సర్వేలు, అంచనాలన్నింటిలో వైఎస్సార్ సీపీ విజయం ఖాయమని ప్రస్ఫుటమవుతుండడంతో టీడీపీ అధినేత సహా ముఖ్య నేతల్లో కలవరం నెలకొంది. అధికారం కోల్పోతున్నామనే ఆందోళనలో ఉన్న పార్టీ శ్రేణులకు ధైర్యం నూరిపోసేందుకు 120 సీట్లు వస్తాయంటూ గంభీరంగా చెబుతున్నా క్షేత్రస్థాయి వాస్తవాలు వారిని కుంగదీస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లోనే ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడును సైతం రద్దు చేసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గెలుపుపై ధీమా ఉంటే మహానాడు నిర్వహించడానికి ఇబ్బంది ఉండేది కాదని కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉండడంతో వాయిదా వేసినట్లు చెబుతున్నారు. దీన్ని బయటకు చెప్పుకోలేక ఫలితాల తర్వాత కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పాల్సి ఉంది కాబట్టి మహానాడులో పాల్గొనలేరని, అందుకే రద్దు చేసినట్లు పార్టీ నేతలు
చెబుతుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment