టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని మరో అరాచకం | TDP MLA Chintamaneni Prabhakar is another anarchy | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని మరో అరాచకం

Published Mon, Sep 10 2018 3:44 AM | Last Updated on Mon, Sep 10 2018 3:44 AM

TDP MLA Chintamaneni Prabhakar is another anarchy - Sakshi

చింతమనేని ప్రభాకర్‌ నేతృత్వంలోని అక్రమ క్వారీలో తవ్వకాలను అడ్డుకున్న అబ్బయ్యచౌదరి (ఫైల్‌), ఎమ్మెల్యే చింతమనేని

సాక్షి ప్రతినిధి, ఏలూరు: వివాదాస్పద అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ సాగిస్తున్న దౌర్జన్యాలకు ఇదో పరాకాష్ట. చింతమనేని ఆధ్వర్యంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను అడ్డుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కన్వీనర్‌ కొఠారు అబ్బయ్య చౌదరిపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం సూర్యారావుపేట గ్రామంలో రెండు రోజుల క్రితం అనుమతుల్లేకుండా జరుగుతున్న మట్టి తవ్వకాల పనులను వైఎస్సార్‌సీపీ దెందులూరు నియోజకవర్గ కన్వీనర్‌ అబ్బయ్య చౌదరి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావు, గ్రామస్తులు అడ్డుకుని నిలిపివేశారు. అక్రమ తవ్వకాలపై ఏలూరు ఆర్డీఓ చక్రధర్, మైనింగ్‌ అధికారులకు సమాచారం అందించారు. దీంతో నేరుగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని రంగంలోకి దిగారు.

తన అక్రమ మైనింగ్‌ కార్యకలాపాలను అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు పెట్టాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. పోలీసుల ఒప్పుకోకపోవడంతో తవ్వకాలు జరుపుతున్న పొక్లెయిన్‌ డ్రైవర్‌ శ్రీరామ్‌జాన్‌కుమార్‌ని ప్రభుత్వాస్పత్రిలో చేర్పించి, తనపై దాడి జరిగిందంటూ ఫిర్యాదు చేయించారు. దీంతో వైస్సార్‌సీపీ నేతలు కొఠారు అబ్బయ్యచౌదరి, కొఠారు రామచంద్రరావు, మేడికొండ వెంకట సాంబశివకృష్ణారావు, బాలిన రాము, మేకా లక్ష్మణరావు, నెరుసు ధర్మరాజులపై సెక్షన్‌ 341, 323, 506 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

అసలేం జరిగింది? 
దెందులూరు నియోజకవర్గంలోని సూర్యారావుపేట పక్క నుంచి చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువ వెళ్తోంది. అక్కడికి దగ్గరలో కంకరగుట్ట ఉంది. ఇది చుట్టుపక్కల నాలుగు గ్రామాలకు మధ్యలో ఉంది. ఇక్కడ చెరువు తవ్వితే భూగర్భ జలాలు పెరుగుతాయని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ స్థానికులను ఒప్పించారు. పట్టిసీమ కుడికాలువ నుంచిగానీ, లేకపోతే చింతలపూడి కాలువ నుంచి ఎత్తిపోతల ద్వారా పైపులు వేసి చెరువును నింపుతామని పేర్కొన్నారు. కనీసం వంద ఎకరాల చెరువు ఉంటేగానీ కాలువ నుంచి అధికారికంగా లిఫ్ట్‌ ద్వారా నీటిని తరలించడం కుదరదని కలెక్టర్‌ తేల్చిచెప్పారు. అనంతరం ఎమ్మెల్యే చింతమనేని గ్రామస్తులపై ఒత్తిడి తెచ్చి, చెరువు తవ్వడానికి ఒప్పించారు. దీనికోసం 60 ఎకరాల భూమిని రైతుల నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించారు.

ఈ భూమిని గతంలో ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థానికులకు డీ–ఫారం పట్టాలుగా ఇచ్చారు. ఎమ్మెల్యే చింతమనేని ఎకరాకు రూ.6 లక్షల చొప్పున ధర నిర్ణయించి, రైతులకు రూ.లక్ష అడ్వాన్స్‌ చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని త్వరలోనే ఇస్తానన్నారు. చెరువు పేరుతో ఏడాది కాలంగా 60 ఎకరాల్లో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. ఒక్కో టిప్పర్‌కు రూ.2,500, ట్రాక్టర్‌ లోడుకు రూ.500 చొప్పున వసూలు చేస్తున్నారు. నిత్యం 120 టిప్పర్లు, ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తున్నారు. 60 ఎకరాల్లో మట్టి అమ్మకాల ద్వారా రూ.50 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. రైతులకు నామమాత్రపు ధర చెల్లించి బలవంతంగా వారి భూములను స్వాధీనం చేసుకున్నారు. ఈ చెరువు తవ్వకానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతుల్లేవు. ఈ అక్రమ తవ్వకాలను అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ నేతలపై అధికార బలంతో కేసులు బనాయించిడం గమనార్హం.

కేసులకు భయపడం
‘‘మాపై పెట్టిన తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదు. ఎమ్మెల్యే చింతమనేని సాగిస్తున్న అక్రమాలను అడ్డుకుని తీరుతాం. అతడి దుర్మార్గాలను బయటపెడతాం. ఇక్కడ అక్రమ తవ్వకాలపై అధికారులు చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తాం’’ 
– అబ్బయ్యచౌదరి, దెందులూరు కన్వీనర్, వైఎస్సార్‌సీపీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement